ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్‌కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్‌లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి.
బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్‌వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్‌సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది.
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్
ఉత్పత్తిని పెంచడం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment