ఐవోసీలో జాబ్.. ఐఎస్ఐఎస్‌కు మార్కెటింగ్!
జైపూర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మార్కెటింగ్ మేనేజర్ ఒకరిని జైపూర్‌లో అరెస్టు చేశారు. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకొని ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రజలను పోత్సహిస్తున్న మహమ్మద్ సిరాజుద్దిన్‌ను రాజస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టుచేసింది. వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా ఐఎస్ఐఎస్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఏటీఎస్ అదనపు డీజీపీ అలోక్ త్రిపాఠి తెలిపారు.
కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన సిరాజుద్దిన్ దేశంలో ఐఎస్ఐఎస్ తరఫున సభ్యులను చేర్చుకోవడానికి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. అతని ఇంటర్నెట్ కార్యకలాపాలను పరిశీలించడం ద్వారా అతను ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడని తెలుస్తున్నదని, ముస్లిం యువతను ఆ గ్రూపు వైపు మళ్లించేందుకు అతను ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. ఐఎస్ఐఎస్ కోసం అతను వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో వీడియోలు, ఫొటోలు పోస్టుచేసేవాడని, అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఐఎస్ఐఎస్ మ్యాగజీన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవాడని చెప్పారు. భారత్‌లో, విదేశాల్లో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి అతను ప్రయత్నించినట్టు అలోక్ త్రిపాఠి వివరించారు.