Mohammad SirajudDin
-
హడలెత్తించిన ఉమేశ్, సిరాజ్
చెస్టర్ లీ స్ట్రీట్: భారత బౌలర్ల ప్రాక్టీస్ అదిరింది. కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/22), మొహమ్మద్ సిరాజ్ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కౌంటీ తరఫున బరిలోకి దిగిన భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) ప్రాక్టీస్‌ను సద్వినియోగం చేసుకోలేదు. భారత్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 306/9తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్... మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి 93 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ మిల్స్ నాలుగు వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ అవుట్ భారత యువ పేసర్ అవేశ్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. గాయంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెలెక్ట్ ఎలెవన్ తరఫున అవేశ్ ఖాన్ బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ బౌలింగ్ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్ వేలు విరిగినట్లు తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
విమానంలో రోహిత్ చేసిన పనికి నిద్రపోలేదు..
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, రూట్ సేనతో ఐదు టెస్ట్ సిరీస్‌ల కోసం టీమిండియా గురువారం యూకేలో అడుగుపెట్టింది. భారత్ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు లండన్‌కు చేరుకున్నాయి. క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేస్తుండగా తీసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో ఆటగాళ్లు ఏ రకంగా గడిపారో కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ప్రయాణ విషయాలను తెలుపుతూ.. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. దీంతో సరిగా నిద్ర పోలేదని చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాం. హోటల్‌కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా. నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను' అని సిరాజ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 🇮🇳 ✈️ 🏴 Excitement is building up as #TeamIndia arrive in England 🙌 👌 pic.twitter.com/FIOA2hoNuJ — BCCI (@BCCI) June 4, 2021 చదవండి: బాలీవుడ్ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన టీమిండియా కోచ్ -
రవిశాస్త్రి భవిష్యవాణి! బుమ్రా ఆత్మీయత
ఒక ప్రతిష్టాత్మక సిరీస్‌లో ప్రదర్శన ఆటగాళ్లను ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలదనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొహమ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా రాణించిన హైదరాబాదీ సిరాజ్ ఇప్పుడు టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు. నాన్న మరణించినా మనసులో బాధను దిగమింగుకొని వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోవాలని అతను తీసుకున్న నిర్ణయం కెరీర్‌ను మార్చేసింది. స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం ఈ సిరీస్ అనుభవంపై ‘సాక్షి’తో సిరాజ్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు అతని మాటల్లోనే... –సాక్షి, హైదరాబాద్ ఆస్ట్రేలియా సిరీస్‌తో వచ్చిన గుర్తింపుపై... సరిగ్గా ఐదేళ్ల క్రితం 2015 చివర్లో నా తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాను. అంతకు ముందు కూడా నేను ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఎప్పుడూ ఆడలేదు. హైదరాబాద్ అండర్–23 టీమ్‌తోనే నా ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చూసుకుంటే నాకంటూ భారత క్రికెట్ జట్టులో ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇది నేను చాలా గర్వపడే సమయం. ఇంత వేగంగా నా కెరీర్ దూసుకుపోతుందని, ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఎప్పుడూ రాబోయే రోజుల గురించి ప్రణాళికలు వేసుకోకుండా నాకు తెలిసిన ఒకే ఒక విద్య బౌలింగ్ చేస్తూనే పోయాను. ఫలితాలు వాటంతట అవే వచ్చాయి. ముఖ్యంగా ‘ఎ’ జట్టు తరఫున వచ్చిన అవకాశాలు నా కెరీర్‌ను నిర్దేశించాయి. తొలి టెస్టు అవకాశంపై... అడిలైడ్ టెస్టు ముగిసిన పరిస్థితుల్లో నేను నా స్థానం గురించి ఆలోచించే అవకాశం కూడా కనిపించలేదు. షమీ భాయ్ గాయపడినా నేను ఎంపికవుతాననే నమ్మకం లేదు. అయితే అప్పటి వరకు నేను కష్టపడుతున్న తీరు టీమ్ మేనేజ్మెంట్ను ఆకట్టుకున్నట్లుంది. మ్యాచ్ ఆడబోతున్నట్లుగా ఒక రోజు ముందు నాకు చెప్పారు. మెల్‌బోర్న్‌లాంటి చోట నేను టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాననే విషయమే నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అప్పుడే నాన్న గుర్తుకొచ్చారు. ఇక సిరీస్ మొత్తం ఆయనను తల్చుకుంటూనే ఆడాను. సిడ్నీ టెస్టు ఆరంభంలో కూడా కన్నీళ్లకు అదే కారణం. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రభావం... నా ఈ ఉన్నతికి కారణమైన వ్యక్తి అరుణ్ సర్. ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభంనుంచి నన్ను తీర్చిదిద్ది నాకు అండగా నిలిచిన ఆయనే నా డెబ్యూ సమయంలో భారత బౌలింగ్ కోచ్‌గా కూడా ఉండటం నా అదృష్టం. అన్ని చోట్లా ఆయనే నాకు అండగా నిలిచి నడిపించారు. తొలి టెస్టు కోసం మైదానంలోకి దిగే సమయంలో...అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు అనుభవం సమస్య కాదని, మూలాలకు కట్టుబడి బౌలింగ్ చేస్తే ఎరుపు బంతితో నువ్వు అద్భుతాలు చేయగలవని ధైర్యమిచ్చారు. మూడో టెస్టుకే సీనియర్‌గా... సీనియర్ అనే మాటను నేను వాడను. పరిస్థితులు అలా వచ్చాయి. బ్రిస్బేన్లాంటి వేదికపై బౌలర్లకూ మంచి అవకాశం ఉంటుందని నమ్మాం. దానిని బట్టే అందరం బౌలింగ్ చేశాం. అయితే అన్నింటికి మించి చెప్పుకోవాల్సింది బుమ్రా భాయ్ గురించే. ఆయన తుది జట్టులో లేరన్న మాటే కానే... మాతో కలిసి ఆడుతున్నట్లే అనిపించింది. ప్రతీ డ్రింక్స్ బ్రేక్‌లో బుమ్రానే డ్రింక్స్ తీసుకురావడం, మా అందరికీ తగిన సూచనలిచ్చిన తర్వాతి గంట కోసం ఒక ప్రణాళికను సూచించడం...ఇలా వరుసగా జరిగిపోయాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక స్పెల్‌లో నేను బాగా ఇబ్బంది పడిన సమయంలో ఏం ఫర్వాలేదంటూ బుమ్రా ధైర్యమిచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన దానిని అనుసరించింది. తొలి రోజునుంచి మైదానం బయట కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. నాలుగో రోజు తిరిగి వస్తున్నప్పుడు బుమ్రా ఇచ్చిన ఆత్మీయ (దిల్సే) ఆలింగనాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. కోచ్‌గా రవిశాస్త్రి అండదండలపై... నా దృష్టిలో ఆయన కోచ్‌గాకంటే ఒక ‘మోటివేషనల్ స్పీకర్’గా చాలా అద్భుతమైన వ్యక్తి. నాన్న చనిపోయిన విషయం తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే దాని ప్రభావం నా ఆటపై పడకుండా ఆడగలిగా. బయో బబుల్లాంటి పరిస్థితుల్లో ఎవరితో కలవకుండా ఇలాంటి సమయంలో మన గదిలో ఒంటరిగా ఉండటం అంత సులువు కాదు. మీ నాన్న పైనుంచి నిన్ను చూసి గర్విస్తారంటూ చెప్పిన రవిశాస్త్రి...ఈ సిరీస్‌లో నువ్వు ఐదు వికెట్ల ప్రదర్శన ఇస్తావు చూడు అని గట్టిగా చెప్పారు. చివరకు అదే నిజమైంది. కఠిన పరిస్థితుల్లో అందరూ నాకు అండగా నిలవడం నా జీవితంలో మరచిపోలేను. భారత పిచ్‌లపై బౌలింగ్... నాకు నా బౌలింగ్‌పై నమ్మకముంది. నేను పిచ్‌ను మాత్రమే నమ్ముకుని బౌలింగ్ చేసే తరహా వ్యక్తిని కాదు. ఆసీస్ పిచ్‌లతో పోలిస్తే భారత పిచ్‌లపై పేసర్లు రాణించరంటూ అప్పుడే కొందరు చర్చ మొదలు పెట్టారు. కానీ ఎలాంటి స్థితిలోనైనా రాణించగలనని గట్టిగా నమ్ముతున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దీనిని నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నా. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘నాన్న చనిపోయిన తర్వాత నేను ఆడటానికి సిద్ధపడటంలో నా కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. అమ్మతో పాటు నా కాబోయే భార్య కూడా స్ఫూర్తి నింపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఏడుస్తుంటే నేనే ధైర్యం చెప్పా. సిరీస్‌లో సాధించిన ప్రతీ వికెట్‌ను నాన్నకు అంకితమిచ్చా. టీమ్ మేనేజ్మెంట్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదు వికెట్లు తీయడం ఆనందంగా అనిపించింది. బ్రిస్బేన్‌లో స్మిత్ క్యాచ్ వదిలేసిన ఒత్తిడి నాపై ఉండింది. తర్వాత అతని వికెట్ తీసి లెక్క సరి చేశాను. రాబోయే సిరీస్‌లలోనూ ఇదే తరహాలో బాగా ఆడి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటా. వన్డేలు, టి20ల్లో అడుగు పెట్టినప్పుడు కొత్త కాబట్టి విఫలమయ్యాను. ఇప్పుడు అనుభవంతో నా ఆట మెరుగుపడింది. అదే ఆత్మవిశ్వాసం టెస్టుల్లో కనిపించింది. సిడ్నీలో ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినప్పుడు మేం ఆటను ఆపి వెళ్లే అవకాశం మాకు అంపైర్లు ఇచ్చారు. కానీ తప్పు చేసినవారిని పట్టుకోండి తప్ప మేం ఆట ఆపేయం అని జవాబిచ్చాం. దానిపై విచారణ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి’ హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఎయిర్‌పోర్ట్‌నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తున్న సిరాజ్ -
ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు
జాత్యహంకారం. కించపరిచే మాటలు. ఒళ్లంతా గాయాలు. అంతిమంగా.. ఒక ఘన విజయం. ముప్పై రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ‘గాబా గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై ఇండియా గ్రౌండ్ బ్రేకింగ్ విక్టరీ సాధించింది. 2–1తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ముగ్గురు హీరోలు. మొహమ్మద్ సిరాజ్. అతడి వెనుక ఉన్న జీవ శక్తి అతడి తల్లి షబానా. ఇంకో హీరో రవిచంద్రన్ అశ్విన్. ఫస్ట్ సిరీస్‌లో రన్స్ కోసం ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. భార్య ప్రీతి అతడికి ఊరడింపుగా నిలబడ్డారు. వన్ మోర్ హీరో వాషింగ్టన్ సుందర్. సిరీస్‌లో మూడో రోజు అతడు తీసిన పరుగులే టీమిండియాకు తక్షణ శక్తి! అతడి వెనుక ఉన్న శక్తి మాత్రం సోదరి శైలజ! ఈ ముగ్గురు హీరోలు ఇండియాను నిలబెడితే, వారిని ఈ ముగ్గురు మహిళలు నిలబెట్టినవారయ్యారు. అడిలైడ్‌లో ఓటమి. మెల్బోర్న్లో గెలుపు. సిడ్నీలో మ్యాచ్ డ్రా. గాబాలో గెలుపు. ఇండియా 2–1తో చరిత్రాత్మక విజయం సాధించింది. టీమిండియాలోని మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. హైదరాబాద్ కుర్రాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు! హీరో అయ్యాడు. కానీ తన కొడుకు హీరో అవడం తండ్రి చూడలేకపోయాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవగానే ఇక్కడ ఇండియాలో సిరాజ్ తండ్రి చనిపోయారు. టెస్ట్ మ్యాచ్ లో కొడుకు హీరో అవాలని కాదు ఆ తండ్రి కలగంది. అసలంటూ టెస్ట్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాలని. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. ఆయన ఇంటిని నడిపాడు. ఆమె సిరాజ్‌ను క్రికెటర్‌గా నడిపించారు. గాబాలో మొన్న ఇండియా ఘన విజయం సాధించగానే.. ‘‘సిరాజ్ క్రికెటర్ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్ గుండెను దిటవు పరచింది అమ్మే. సిరాజ్ కెరీర్లో అమ్మది కీలకమైన పాత్ర’’ అని సిరాజ్ సోదరుడు (అన్న) మొహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు. సిరాజ్ తల్లి షబానా బేగం. ఆస్ట్రేలియా లో ఉన్న సిరాజ్‌ను తండ్రి మరణం నుంచి తేరుకునేలా చేయడానికి అతడితో రోజూ కనీసం రెండు గంటలైనా మాట్లాడేవారు, ధైర్యం చెప్పేవారు. మనిషి రాటు తేలినట్లు ఉంటాడు కానీ సిరాజ్ వట్టి ఉద్వేగ ప్రాణి. మహా సున్నితం. సిడ్నీ మ్యాచ్ లో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు తండ్రి గుర్తుకు రావడంతో సిరాజ్ కళ్లలో నీళ్లు ఉబికివచ్చాయి. ‘హి గాట్ ఎమోషనల్’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ∙∙ ఆస్ట్రేలియా టూర్లో ఇంకో హీరో రవిచంద్రన్ అశ్విన్. ఆల్ రౌండర్. చెన్నై ప్లేయర్. సిడ్నీ మ్యాచ్ డ్రా అయి ఇండియా గట్టెక్కింది ఇతడి వల్లనే. ఆ మ్యాచ్‌లో ఏకధాటిగా మూడు గంటలపాటు బ్యాటింగ్ చేసి 128 బాల్స్‌కి 39 రన్స్ తీశాడు. ఆ మాత్రానికైనా అతడు చెల్లించవలసి వచ్చిన మూల్యం ఒళ్లు హూనం చేసుకోవడం. కష్టపడ్డాడు. ‘‘భరించలేనంత వెన్నునొప్పితో ఆయన నిద్రపోలేకపోయారు. నిలవడం, కూర్చోవడం కూడా కష్టమైపోయింది. వంగి షూ లేస్‌లను కూడా కట్టుకోలేకపోయారు. ఆ నొప్పితోనే అద్భుతంగా ఆడారు’’ అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేశారు. అందుకు అశ్విన్ ఒక కన్నీటి ఎమోజీ, చేతులు జోడించిన రెండు ఎమోజీలు పెట్టి ‘‘ఇన్స్టెంట్ టియర్స్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మి త్రూ ఆల్ దిస్’’ అని రీ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తన భర్తను స్లెడ్జ్ చేసిన సంగతిని కూడా ఆమె బాగానే గుర్తుపెట్టుకుని ఇండియా గెలిచాక అంతకంతా తీర్చుకున్నారు. ‘‘గాబాలో చూసుకుందాం’ అని టిమ్ పెయిన్ తన భర్తను స్లెడ్జ్ (తక్కువ చేసి మాట్లాడ్డం) చేసినందుకు ప్రతీకారంగా ఆమె ‘గాబాలో చూసుకుందాం’ అనే మాటతో ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ భారత విజయాన్ని సెలబ్రేట్ చేశారు. టీమిండియాను తన కూతురు ఉల్లాస పరుస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ∙∙ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా గెలుపునకు కారణం అయిన మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. ఇతడిది కూడా చెన్నై. తొలి ఇన్నింగ్స్‌లోనే స్మిత్ సహా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో మూడో రోజు 62 పరుగులు తీసి జట్టుకు తక్షణ శక్తిని అందించాడు. రెండో ఇన్నింగ్‌లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. కీలక దశలో 22 పరుగులు తీశాడు. కెరీర్లో సుందర్ వెనుక ఉన్న శక్తి, స్ఫూర్తి అతడి అక్క శైలజ. ‘‘మా తమ్ముడిని చూసి ఆర్నెల్లు అయింది. వాడి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని ఇండియా గెలిచిన సందర్భంలో తన కామెంట్ అడిగేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులతో శైలజ అన్నారు. ఈ అక్కాతమ్ముడికి ‘సూపర్ సిబ్లింగ్స్’ అని పేరు. ఏ ఫొటోలో అయినా అక్క పక్కనే తమ్ముడు. అక్కే తమ్ముడి ప్రపంచం. ఆమె పుట్టిన రోజుకు ‘హ్యాపీ బర్త్‌డే మై వరల్డ్’ అని శుభాకాంక్షలు తెలిపే ఈ క్రికెటర్‌కు ఆట–అక్క సమాన ప్రపంచాలు. శైలజ కూడా క్రికెటరే. సిరాజ్ క్రికెటర్ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్ గుండెను దిటవుపరచింది అమ్మే. సిరాజ్ కెరీర్లో అమ్మది కీలకమైన పాత్ర. – సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్ మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ -
బిర్యానీని బాగా తగ్గించాను: సిరాజ్
బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు... వాషింగ్టన్ సుందర్ అవుటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్నాడు. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందకు దిగి వచ్చి బౌండరీ వద్ద టాప్ స్పిన్నర్ అశ్విన్ నిలబడ్డాడు. సుందర్ రాగానే ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని అభినందించాడు. తన స్థానంలో బరిలోకి దిగిన ఆటగాడి అద్భుత ప్రదర్శనకు అతను ఇచ్చిన కితాబు అది. మ్యాచ్ నాలుగో రోజు... పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలాగే ఒక్కడే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శన అనంతరం సహచరుల అభినందనల మధ్య ముందుగా నడుస్తూ వచ్చిన సిరాజ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యం సోమవారం హైలైట్‌గా నిలిచింది. తాను గాయంతో దూరం కావడంతో బౌలింగ్ భారం మోసిన ఆటగాడు అంచనాలకు మించి రాణించడం, ఐదు వికెట్లతో తిరిగి రావడం బుమ్రాలో కూడా సంతోషం నింపిందనడంలో సందేహం లేదు. క్యాచ్ పట్టి సిరాజ్ ఐదో వికెట్ ప్రదర్శనకు కారణమైన శార్దుల్ ఠాకూర్ చప్పట్లతో నవ్వుతూ అతడి వెంట నడవటం... ఐదో వికెట్ తీశాక ఆకాశం వైపు చూస్తూ సిరాజ్ తన తండ్రిని గుర్తు చేసుకున్న క్షణాన మయాంక్ అగర్వాల్ అదే తరహాలో అందులో భాగం కావడం... ఇవన్నీ సగటు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సిరీస్ ఆసాంతం భారత క్రికెటర్లలో ఒక రకమైన ప్రత్యేక అనుబంధం కనిపించింది. సాధారణంగా ఆటలో వినిపించే ‘టీమ్ స్పిరిట్’ మాత్రమే కాదు... ఇది అంతకంటే ఎక్కువ. వీరంతా సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ వచ్చారు. సహచరులు తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది. సిరీస్‌లో వేర్వేరు దశల్లో ప్రతికూలతల నడుమ వారంతా గొప్ప పోరాటపటిమ కనబర్చారు. అందరి లక్ష్యం మాత్రం ఆసీస్‌ను మట్టికరిపించడమే. రెండేళ్ల క్రితం కూడా ఆస్ట్రేలియాలో మన జట్టు సిరీస్ గెలిచినా... ఇప్పటి పరిస్థితులు భిన్నం. ముఖ్యంగా టాప్–4 పేస్ దళంలో ఒక్కరు కూడా లేకుండా బ్రిస్బేన్ టెస్టుకు సిద్ధమైన వేళ జట్టు మరింత పట్టుదలగా నిలబడింది. ఈ జట్టులో ఇప్పుడు సీనియర్, జూనియర్ ఎవరూ లేరు. అంతా ఒక్కటే! ఒక్కో ఆసీస్ వికెట్ తీస్తున్న సమయంలో మన ఆటగాళ్ల సంబరాలు చూస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా సిరాజ్‌కు కష్టకాలంలో జట్టు మొత్తం అండగా నిలబడింది. తండ్రి అంత్యక్రియలకు వెళ్లరాదని అతను తీసుకున్న నిర్ణయం నిజంగానే కెరీర్‌ను మార్చేసింది. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్ చేరే వరకు అతని ఆట మరింత మెరుగైంది. తన మూడో టెస్టులోనే సహచర పేసర్లకు సూచనలిస్తూ కనిపించిన సిరాజ్ స్వయంగా ఐదు వికెట్లతో మార్గనిర్దేశనం చేశాడు. సిరాజ్ తండ్రి మరణ వార్త తెలిసిన రోజున ‘మీ నాన్న ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఈ టూర్లో ఏదో ఒక దశలో మ్యాచ్ ఆడతావు. ఐదు వికెట్లు కూడా తీస్తావు’...అని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అక్షరసత్యమైంది. ఇప్పుడు సచిన్ మొదలు క్రికెట్ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అభినందనలకు సిరాజ్ అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు! బిర్యానీని బాగా తగ్గించాను సిరీస్‌లో తీసిన 13 వికెట్లలో ఈ రోజు తీసిన స్మిత్ వికెట్ నాకు అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది. నాపై నమ్మకముంచి పదే పదే తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిన రహానేకు కృతజ్ఞతలు. నాన్న దీవెనలతోనే ఐదు వికెట్ల ప్రదర్శన సాకారమైందని భావిస్తున్నా. నా స్పందనను మాటల్లో చెప్పలేను. లాక్డౌన్ సమయం నుంచి టెస్టు క్రికెట్‌కు కావాల్సిన ఫిట్నెస్ను సాధించడంలో ఫిట్నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఎంతో సహకరించారు. ఈ క్రమంలో నేను తినే బిర్యానీని బాగా తగ్గించారు. నన్ను నేను సీనియర్ బౌలర్‌గా భావించుకోలేదు. దేశవాళీలో, ‘ఎ’ జట్టు తరఫున ఆడటం నాకు మేలు చేసింది. బుమ్రా లేకపోవడంతో అదనపు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మొహమ్మద్ సిరాజ్ -
మరో ‘మంకీ’ వివాదం– సిరాజ్, బుమ్రాలను దూషించిన ప్రేక్షకులు
మూడో టెస్టు సందర్భంగా అనూహ్య వివాదం చోటు చేసుకుంది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇద్దరు భారత క్రికెటర్లు బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ అభిమాని ఒకరు సిరాజ్‌ను ‘మంకీ’గా సంబోధించినట్లు తెలిసింది. 2007–08 సిరీస్‌లో ఇదే మైదానంలో జరిగిన ‘మంకీ గేట్’ ఉదంతాన్ని ఇది గుర్తు చేసింది. దీనిపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సెక్యూరిటీ అధికారులు, అంపైర్లతో భారత బృందం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. -
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్‌లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్‌ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 246/8
బెంగళూరు: బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ‘ఎ’ 88 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. రూడీ సెకండ్ (94; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (3/56) ఆకట్టుకున్నాడు. శనివారం ఇక్కడ ప్రారంభమైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోగా... సిరాజ్ చెలరేగడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. పీటర్ మలాన్ (7), జుబేర్ హమ్జా (0)లను పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సరెల్ ఇర్వీ (47; 7 ఫోర్లు) నిలబడ్డాడు. కెప్టెన్ ఖాయా జోండో (24), సెనురాన్ ముత్తుస్వామి (23)లతో కలిసి కొన్ని పరుగులు జతచేశాడు. అనంతరం రూడీ సెకండ్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఓ మోస్తరు స్కోరుకు చేర్చాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు పేసర్లు నవ్‌దీప్ సైనీ (2/47), రజనీశ్ గుర్బానీ (2/47) రాణించారు. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర రంజీ క్రికెటర్లు కోన శ్రీకర్ భరత్, హనుమ విహారి భారత తుది జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ భరత్ నాలుగు క్యాచ్‌లు, విహారి ఒక క్యాచ్ తీసుకోవడం విశేషం. -
సిరాజ్ ఆగయా...
సుదీర్ఘ కాలం తర్వాత భారత క్రికెట్ జట్టు జాబితాలో ‘పక్కా హైదరాబాదీ’ పేరు కనిపించింది. అపార ప్రతిభకు ఆశించిన విధంగానే తగిన గుర్తింపు లభించింది. కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అదృష్టం పలకరించింది. ఐపీఎల్, ఇండియా ‘ఎ’ జట్ల తరఫున సత్తా చాటిన అతడిని సెలక్టర్లు ప్రమోట్ చేస్తూ భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతనికి అవకాశం దక్కింది. తన బౌలింగ్‌లాగే వేగంగా దూసుకొచ్చిన సిరాజ్ తనతో పోటీ పడుతున్న అనేక మందిని వెనక్కి తోసి టీమిండియా తలుపు తట్టడం విశేషం. ముంబై: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఈ జట్టును ఎంపిక చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌తో పాటు ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా తొలిసారి టీమ్‌లో చోటు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు జట్టులో ఉన్న కేదార్ జాదవ్‌పై వేటు పడింది. ‘అన్ని ఫార్మాట్లలో అయ్యర్ చాలా బాగా ఆడుతున్నాడు. సిరాజ్ ఆట కూడా అదే తరహాలో ఉంది. దానిని గుర్తించే మేం జట్టులోకి తీసుకున్నాం. ఒక ఆటగాడిని ఎంపిక చేస్తే అతనికి తగినన్ని అవకాశాలు కల్పించాలనేదే మా అభిమతం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. నెహ్రా ఒక్క మ్యాచ్‌కే... సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా తొలి టి20కు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. నవంబర్ 1న న్యూఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించినంత మాత్రాన ఢిల్లీ టి20 మ్యాచ్‌లో నెహ్రా భారత తుది జట్టులో ఉంటాడనే గ్యారంటీ ఏమీ లేదని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టులో ఉన్నా రెండు మ్యాచ్‌లలో కూడా నెహ్రాకు ఆడే అవకాశం రాలేదు. ‘నెహ్రా కచ్చితంగా ఆడతాడని మేం చెప్పలేం. అది మ్యాచ్ రోజున టీమ్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రమే. అతను వీడ్కోలు మ్యాచ్ కావాలని కోరలేదు. మేం ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని నెహ్రాకు కూడా తెలియజేశాం’ అని ప్రసాద్ చెప్పారు. భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ధోని, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా, భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా, మొహమ్మద్ సిరాజ్. అహో అయ్యర్... గత ఏడాది కాలంలో ముంబై రంజీ జట్టు, భారత్ ‘ఎ’ తరఫున 23 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ భారీగా పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కూడా రాణించాడు. ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అతను...దక్షిణాఫ్రికాలో జరిగిన ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 140 పరుగులతో చెలరేగాడు. ఇటీవల న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టుల్లో 108, 82 పరుగులు చేసిన అతను, వన్డేలో 73 బంతుల్లో 90 పరుగులతో భారత్‌ను గెలిపించాడు. గత ఏడాది (2015–16) రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా శతకం బాది ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్... ఆసీస్‌తో ధర్మశాల టెస్టుకు కోహ్లి స్థానంలో బ్యాకప్‌గా పిలిపించినా, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 42 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 54.74 సగటుతో 3,668 పరుగులు చేసిన అయ్యర్... 53 టి20ల్లో 128 స్ట్రయిక్ రేట్‌తో 1,289 పరుగులు సాధించాడు. -
హైదరాబాద్ మహిళకు ఐసిస్‌తో సంబంధాలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అరెస్టయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ సిరాజుద్దీన్‌తో సంబంధముందని భావిస్తున్న ఆ మహిళపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ‘ఆమె.. ఆన్లైన్లో ఐసిస్ సానుభూతిపరులతో నిత్యం సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల సాయంతో ఆమెను ఆ ప్రభావం నుంచి తప్పించడానికి కృషి చేస్తున్నామని’ ఓ అధికారి ఒకరు తెలిపారు. -
ఐవోసీలో జాబ్.. ఐఎస్ఐఎస్కు మార్కెటింగ్!
జైపూర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మార్కెటింగ్ మేనేజర్ ఒకరిని జైపూర్‌లో అరెస్టు చేశారు. ఇంటర్నెట్ను ఉపయోగించుకొని ఐఎస్ఐఎస్లో చేరేందుకు ప్రజలను పోత్సహిస్తున్న మహమ్మద్ సిరాజుద్దిన్ను రాజస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టుచేసింది. వాట్సప్, ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐఎస్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఏటీఎస్ అదనపు డీజీపీ అలోక్ త్రిపాఠి తెలిపారు. కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన సిరాజుద్దిన్ దేశంలో ఐఎస్ఐఎస్ తరఫున సభ్యులను చేర్చుకోవడానికి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. అతని ఇంటర్నెట్ కార్యకలాపాలను పరిశీలించడం ద్వారా అతను ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడని తెలుస్తున్నదని, ముస్లిం యువతను ఆ గ్రూపు వైపు మళ్లించేందుకు అతను ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. ఐఎస్ఐఎస్ కోసం అతను వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వీడియోలు, ఫొటోలు పోస్టుచేసేవాడని, అంతేకాకుండా ఆన్లైన్లో ఐఎస్ఐఎస్ మ్యాగజీన్‌ను డౌన్లోడ్ చేసుకునేవాడని చెప్పారు. భారత్‌లో, విదేశాల్లో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి అతను ప్రయత్నించినట్టు అలోక్ త్రిపాఠి వివరించారు.