బ్రిస్బేన్ టెస్టు మూడో రోజు... వాషింగ్టన్ సుందర్ అవుటై పెవిలియన్‌కు తిరిగి వస్తున్నాడు. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ నుంచి కిందకు దిగి వచ్చి బౌండరీ వద్ద టాప్ స్పిన్నర్ అశ్విన్ నిలబడ్డాడు. సుందర్ రాగానే ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని అభినందించాడు. తన స్థానంలో బరిలోకి దిగిన ఆటగాడి అద్భుత ప్రదర్శనకు అతను ఇచ్చిన కితాబు అది. మ్యాచ్ నాలుగో రోజు... పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఇలాగే ఒక్కడే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఐదు వికెట్ల ప్రదర్శన అనంతరం సహచరుల అభినందనల మధ్య ముందుగా నడుస్తూ వచ్చిన సిరాజ్‌ను ఎంతో ఆప్యాయంగా హత్తుకొని తన ఆనందాన్ని ప్రదర్శించాడు.
ఈ దృశ్యం సోమవారం హైలైట్‌గా నిలిచింది. తాను గాయంతో దూరం కావడంతో బౌలింగ్ భారం మోసిన ఆటగాడు అంచనాలకు మించి రాణించడం, ఐదు వికెట్లతో తిరిగి రావడం బుమ్రాలో కూడా సంతోషం నింపిందనడంలో సందేహం లేదు. క్యాచ్ పట్టి సిరాజ్ ఐదో వికెట్ ప్రదర్శనకు కారణమైన శార్దుల్ ఠాకూర్ చప్పట్లతో నవ్వుతూ అతడి వెంట నడవటం... ఐదో వికెట్ తీశాక ఆకాశం వైపు చూస్తూ సిరాజ్ తన తండ్రిని గుర్తు చేసుకున్న క్షణాన మయాంక్ అగర్వాల్ అదే తరహాలో అందులో భాగం కావడం... ఇవన్నీ సగటు భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ సిరీస్ ఆసాంతం భారత క్రికెటర్లలో ఒక రకమైన ప్రత్యేక అనుబంధం కనిపించింది.
సాధారణంగా ఆటలో వినిపించే ‘టీమ్ స్పిరిట్’ మాత్రమే కాదు... ఇది అంతకంటే ఎక్కువ. వీరంతా సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ వచ్చారు. సహచరులు తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది. సిరీస్‌లో వేర్వేరు దశల్లో ప్రతికూలతల నడుమ వారంతా గొప్ప పోరాటపటిమ కనబర్చారు. అందరి లక్ష్యం మాత్రం ఆసీస్‌ను మట్టికరిపించడమే. రెండేళ్ల క్రితం కూడా ఆస్ట్రేలియాలో మన జట్టు సిరీస్ గెలిచినా... ఇప్పటి పరిస్థితులు భిన్నం. ముఖ్యంగా టాప్–4 పేస్ దళంలో ఒక్కరు కూడా లేకుండా బ్రిస్బేన్ టెస్టుకు సిద్ధమైన వేళ జట్టు మరింత పట్టుదలగా నిలబడింది. ఈ జట్టులో ఇప్పుడు సీనియర్, జూనియర్ ఎవరూ లేరు. అంతా ఒక్కటే! ఒక్కో ఆసీస్ వికెట్ తీస్తున్న సమయంలో మన ఆటగాళ్ల సంబరాలు చూస్తే ఇది అర్థమవుతుంది.
ముఖ్యంగా సిరాజ్‌కు కష్టకాలంలో జట్టు మొత్తం అండగా నిలబడింది. తండ్రి అంత్యక్రియలకు వెళ్లరాదని అతను తీసుకున్న నిర్ణయం నిజంగానే కెరీర్‌ను మార్చేసింది. మెల్‌బోర్న్ నుంచి బ్రిస్బేన్ చేరే వరకు అతని ఆట మరింత మెరుగైంది. తన మూడో టెస్టులోనే సహచర పేసర్లకు సూచనలిస్తూ కనిపించిన సిరాజ్ స్వయంగా ఐదు వికెట్లతో మార్గనిర్దేశనం చేశాడు. సిరాజ్ తండ్రి మరణ వార్త తెలిసిన రోజున ‘మీ నాన్న ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. ఈ టూర్‌లో ఏదో ఒక దశలో మ్యాచ్ ఆడతావు. ఐదు వికెట్లు కూడా తీస్తావు’...అని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అక్షరసత్యమైంది. ఇప్పుడు సచిన్ మొదలు క్రికెట్ దిగ్గజాలంతా అతని అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అభినందనలకు సిరాజ్ అర్హుడనడంలో ఎలాంటి సందేహం లేదు!
బిర్యానీని బాగా తగ్గించాను
సిరీస్‌లో తీసిన 13 వికెట్లలో ఈ రోజు తీసిన స్మిత్ వికెట్ నాకు అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది. నాపై నమ్మకముంచి పదే పదే తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిన రహానేకు కృతజ్ఞతలు. నాన్న దీవెనలతోనే ఐదు వికెట్ల ప్రదర్శన సాకారమైందని భావిస్తున్నా. నా స్పందనను మాటల్లో చెప్పలేను. లాక్‌డౌన్ సమయం నుంచి టెస్టు క్రికెట్‌కు కావాల్సిన ఫిట్‌నెస్‌ను సాధించడంలో ఫిట్‌నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్ ఎంతో సహకరించారు. ఈ క్రమంలో నేను తినే బిర్యానీని బాగా తగ్గించారు. నన్ను నేను సీనియర్ బౌలర్‌గా భావించుకోలేదు. దేశవాళీలో, ‘ఎ’ జట్టు తరఫున ఆడటం నాకు మేలు చేసింది. బుమ్రా లేకపోవడంతో అదనపు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మొహమ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment