భారత్ ముందు భారీ సవాల్
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 228/9
ఓవరాల్ ఆధిక్యం 333 పరుగులు
నాలుగో టెస్టుకు నేడు చివరి రోజు
తొలి ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియాకు 105 పరుగుల ఆధిక్యం... ఆ తర్వాత భారత పదునైన పేస్ బౌలింగ్ ముందు రెండో ఇన్నింగ్స్‌లో జట్టు బ్యాటింగ్ తడబడింది... 11 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు తీయడంతో స్కోరు 91/6కు చేరింది... ఇక్కడే టీమిండియా కాస్త పట్టు విడిచింది... దాంతో స్కోరు 173/9 వరకు వెళ్లింది... ఇక్కడా ఆట ముగిస్తే రోహిత్ బృందం పని సులువయ్యేది... కానీ చివరి వికెట్‌కు కంగారూలు మళ్లీ పోరాడారు... దాంతో ఆ్రస్టేలియా స్కోరు 228/9కు... ఆధిక్యం కాస్తా 333కు చేరిపోయింది...
మ్యాచ్ చివరి రోజు ఆసీస్ ఇదే స్కోరు వద్ద డిక్లేర్ చేసినా దాదాపు అసాధ్యమైన లక్ష్యం ఇది... నాలుగేళ్ల క్రితం బ్రిస్బేన్‌లో చెలరేగిన తరహాలో భారత్ దూకుడుగా ఆడి విజయం వైపు వెళుతుందా... లేక తలవంచుతుందా... లేక పోరాడి టెస్టును ‘డ్రా’గా ముగిస్తుందా అనేది చివరి రోజు ఆటలో ఆసక్తికరం. ఆదివారం ఆటలో బుమ్రా, సిరాజ్‌లు భారత్‌కు విజయావకాశాలు సృష్టించగా... లబుషేన్, కమిన్స్, లయన్ ఆసీస్‌కు ఆపద్భాంధవులుగా నిలిచారు.
మెల్‌బోర్న్: అనూహ్య మలుపులతో సాగుతున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నాలుగో టెస్టు మ్యాచ్ చివరి ఘట్టానికి చేరింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లబుషేన్ (139 బంతుల్లో 70; 3 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (90 బంతుల్లో 41; 4 ఫోర్లు), నాథన్ లయన్ (54 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు.
ప్రస్తుతం క్రీజ్‌లో లయన్‌తో పాటు స్కాట్ బోలండ్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. వీరిద్దరు ఇప్పటికే చివరి వికెట్‌కు ఏకంగా 18.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 55 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/9తో తమ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 21 బంతులు ఆడి 11 పరుగులు చేసి 369 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (189 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఆసీస్ ప్రస్తుతం 333 పరుగులు ముందంజలో ఉంది.
కీలక భాగస్వామ్యాలు...
ఆసీస్ ఓపెనర్లు కొన్‌స్టాస్ (18 బంతుల్లో 8; 1 ఫోర్), ఖ్వాజా (65 బంతుల్లో 21; 2 ఫోర్లు) చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో తనపై దూకుడు ప్రదర్శించిన కొన్‌స్టాస్‌ను ఈసారి అద్భుత బంతితో పడగొట్టి బుమ్రా సంబరాలు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ బౌలింగ్‌తో 122 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సిరాజ్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శనతో ఆసీస్ పని పట్టాడు.
ఖ్వాజాను పదునైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేసి జోరు ప్రదర్శించిన సిరాజ్... లంచ్ విరామం తర్వాత స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 13; 1 ఫోర్)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆదివారం తన 31వ పుట్టిన రోజు జరుపుకున్న ట్రావిస్ హెడ్‌కు కలిసి రాలేదు. బుమ్రా పన్నిన ఉచ్చులో పడిన హెడ్ (2 బంతుల్లో 1) స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో మిచెల్ మార్ష్(4 బంతుల్లో 0)ను కూడా అవుట్ చేసిన బుమ్రా, తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతికి అలెక్స్ కేరీ (7 బంతుల్లో 2) పని పట్టాడు. దాంతో ఆ్రస్టేలియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
ఇలాంటి స్థితిలో లబుషేన్, కమిన్స్ కలిసి జట్టును ఆదుకున్నారు. 19.1 ఓవర్ల పాటు వీరిద్దరు భారత బౌలర్లను నిలువరించగలిగారు. లబుషేన్ తనదైన శైలిలో పట్టుదల కనబరుస్తూ 105 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, తొలి ఇన్నింగ్స్‌లాగే కమిన్స్ మళ్లీ బ్యాటింగ్‌లో ప్రభావం చూపించాడు. ఎట్టకేలకు మూడో సెషన్‌లో లబుషేన్‌ను అవుట్ చేసి సిరాజ్ 57 పరుగుల ఏడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు.
స్టార్క్ (13 బంతుల్లో 5) రనౌట్ కాగా, కమిన్స్ వికెట్ జడేజా ఖాతాలో చేరింది. ఈ దశలో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ లయన్, బోలండ్ టీమిండియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అప్పటికే బాగా అలసిపోయిన భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో చివరి వికెట్ దక్కకుండానే రోజు ముగిసింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: కొన్‌స్టాస్ (బి) బుమ్రా 8; ఖ్వాజా (బి) సిరాజ్ 21; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 70; స్మిత్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; హెడ్ (సి) నితీశ్ (బి) బుమ్రా 1; మార్ష్(సి) పంత్ (బి) బుమ్రా 0; కేరీ (బి) బుమ్రా 2; కమిన్స్ (సి) రోహిత్ (బి) జడేజా 41; స్టార్క్ (రనౌట్) 5; లయన్ (బ్యాటింగ్) 41; బోలండ్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (82 ఓవర్లలో 9 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–20, 2–43, 3–80, 4–85, 5–85, 6–91, 7–148, 8–156, 9–173. బౌలింగ్: బుమ్రా 24–7–56–4, ఆకాశ్‌దీప్ 17–4–53–0, సిరాజ్ 22–4–66–3, జడేజా 14–2–33–1, నితీశ్ రెడ్డి 1–0–4–0, సుందర్ 4–0–7–0.
బుమ్రా ‘ద గ్రేట్’
200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కెరీర్ ఆరంభంలో టి20, వన్డే స్పెషలిస్ట్ బౌలర్‌గానే చూశారు. ఈ రెండు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగిన రెండేళ్ల తర్వాత గానీ అతను తొలి టెస్టు ఆడలేదు. కానీ ఇప్పుడు టెస్టుల్లో బుమ్రా ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అతని పదునైన బంతులకు ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే ఉండటంలేదు. తన భిన్నమైన బౌలింగ్ శైలి అదనపు ప్రయోజనం కల్పిస్తుండగా... అసాధారణ బౌలింగ్ ప్రదర్శనలు అతని ఖాతాలో చేరాయి.
ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా... జట్టు ఏదైనా బుమ్రాను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బుమ్రా స్పెల్‌ను దాటితే చాలనుకుంటున్నారు. తాజా సిరీస్‌లో ఇది మరింత బాగా కనిపించింది. ఇప్పటికే అతను కేవలం 13.24 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసి 200 వికెట్ల మైలురాయిని అందుకున్న బుమ్రా ఎందరితో సాధ్యం కాని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.
» 200 వికెట్లు తీసిన 85 మంది బౌలర్లలో 20కంటే తక్కువ సగటుతో ఈ మైలురాయిని చేరిన ఏకైక బౌలర్ బుమ్రానే. అతను కేవలం 19.56 సగటుతో ఈ వికెట్లు తీశాడు. బుమ్రా తన 44వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. » అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా (8484) నాలుగో స్థానంలో ఉన్నాడు. వఖార్ యూనిస్ (7725), స్టెయిన్ (7848), రబడ (8154) అతనికంటే తక్కువ బంతులు వేశారు.
» బుమ్రా తీసిన 202 వికెట్లలో 142 వికెట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో రావడం విదేశీ గడ్డపై అతని విలువ ఏమిటో అర్థమవుతుంది.
» భారత్ గెలిచిన 20 టెస్టుల్లో బుమ్రా భాగంగా ఉండగా... ఈ టెస్టుల్లో 110 వికెట్లతో అతని బౌలింగ్ సగటు కేవలం 14.4 కావడం అతని ప్రభావాన్ని చూపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment