ఒక ప్రతిష్టాత్మక సిరీస్‌లో ప్రదర్శన ఆటగాళ్లను ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలదనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొహమ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా రాణించిన హైదరాబాదీ సిరాజ్ ఇప్పుడు టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు. నాన్న మరణించినా మనసులో బాధను దిగమింగుకొని వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోవాలని అతను తీసుకున్న నిర్ణయం కెరీర్‌ను మార్చేసింది. స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం ఈ సిరీస్ అనుభవంపై ‘సాక్షి’తో సిరాజ్ ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు అతని మాటల్లోనే...
–సాక్షి, హైదరాబాద్
ఆస్ట్రేలియా సిరీస్‌తో వచ్చిన గుర్తింపుపై...
సరిగ్గా ఐదేళ్ల క్రితం 2015 చివర్లో నా తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాను. అంతకు ముందు కూడా నేను ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఎప్పుడూ ఆడలేదు. హైదరాబాద్ అండర్–23 టీమ్‌తోనే నా ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చూసుకుంటే నాకంటూ భారత క్రికెట్ జట్టులో ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇది నేను చాలా గర్వపడే సమయం. ఇంత వేగంగా నా కెరీర్ దూసుకుపోతుందని, ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఎప్పుడూ రాబోయే రోజుల గురించి ప్రణాళికలు వేసుకోకుండా నాకు తెలిసిన ఒకే ఒక విద్య బౌలింగ్ చేస్తూనే పోయాను. ఫలితాలు వాటంతట అవే వచ్చాయి. ముఖ్యంగా ‘ఎ’ జట్టు తరఫున వచ్చిన అవకాశాలు నా కెరీర్‌ను నిర్దేశించాయి.
తొలి టెస్టు అవకాశంపై...
అడిలైడ్ టెస్టు ముగిసిన పరిస్థితుల్లో నేను నా స్థానం గురించి ఆలోచించే అవకాశం కూడా కనిపించలేదు. షమీ భాయ్ గాయపడినా నేను ఎంపికవుతాననే నమ్మకం లేదు. అయితే అప్పటి వరకు నేను కష్టపడుతున్న తీరు టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నట్లుంది. మ్యాచ్ ఆడబోతున్నట్లుగా ఒక రోజు ముందు నాకు చెప్పారు. మెల్‌బోర్న్‌లాంటి చోట నేను టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాననే విషయమే నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అప్పుడే నాన్న గుర్తుకొచ్చారు. ఇక సిరీస్ మొత్తం ఆయనను తల్చుకుంటూనే ఆడాను. సిడ్నీ టెస్టు ఆరంభంలో కూడా కన్నీళ్లకు అదే కారణం.
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రభావం...
నా ఈ ఉన్నతికి కారణమైన వ్యక్తి అరుణ్ సర్. ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభంనుంచి నన్ను తీర్చిదిద్ది నాకు అండగా నిలిచిన ఆయనే నా డెబ్యూ సమయంలో భారత బౌలింగ్ కోచ్‌గా కూడా ఉండటం నా అదృష్టం. అన్ని చోట్లా ఆయనే నాకు అండగా నిలిచి నడిపించారు. తొలి టెస్టు కోసం మైదానంలోకి దిగే సమయంలో...అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు అనుభవం సమస్య కాదని, మూలాలకు కట్టుబడి బౌలింగ్ చేస్తే ఎరుపు బంతితో నువ్వు అద్భుతాలు చేయగలవని ధైర్యమిచ్చారు.
మూడో టెస్టుకే సీనియర్‌గా...
సీనియర్ అనే మాటను నేను వాడను. పరిస్థితులు అలా వచ్చాయి. బ్రిస్బేన్‌లాంటి వేదికపై బౌలర్లకూ మంచి అవకాశం ఉంటుందని నమ్మాం. దానిని బట్టే అందరం బౌలింగ్ చేశాం. అయితే అన్నింటికి మించి చెప్పుకోవాల్సింది బుమ్రా భాయ్ గురించే. ఆయన తుది జట్టులో లేరన్న మాటే కానే... మాతో కలిసి ఆడుతున్నట్లే అనిపించింది. ప్రతీ డ్రింక్స్ బ్రేక్‌లో బుమ్రానే డ్రింక్స్ తీసుకురావడం, మా అందరికీ తగిన సూచనలిచ్చిన తర్వాతి గంట కోసం ఒక ప్రణాళికను సూచించడం...ఇలా వరుసగా జరిగిపోయాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక స్పెల్‌లో నేను బాగా ఇబ్బంది పడిన సమయంలో ఏం ఫర్వాలేదంటూ బుమ్రా ధైర్యమిచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన దానిని అనుసరించింది. తొలి రోజునుంచి మైదానం బయట కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. నాలుగో రోజు తిరిగి వస్తున్నప్పుడు బుమ్రా ఇచ్చిన ఆత్మీయ (దిల్‌సే) ఆలింగనాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను.
కోచ్‌గా రవిశాస్త్రి అండదండలపై...
నా దృష్టిలో ఆయన కోచ్‌గాకంటే ఒక ‘మోటివేషనల్ స్పీకర్’గా చాలా అద్భుతమైన వ్యక్తి. నాన్న చనిపోయిన విషయం తెలిసినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే దాని ప్రభావం నా ఆటపై పడకుండా ఆడగలిగా. బయో బబుల్‌లాంటి పరిస్థితుల్లో ఎవరితో కలవకుండా ఇలాంటి సమయంలో మన గదిలో ఒంటరిగా ఉండటం అంత సులువు కాదు. మీ నాన్న పైనుంచి నిన్ను చూసి గర్విస్తారంటూ చెప్పిన రవిశాస్త్రి...ఈ సిరీస్‌లో నువ్వు ఐదు వికెట్ల ప్రదర్శన ఇస్తావు చూడు అని గట్టిగా చెప్పారు. చివరకు అదే నిజమైంది. కఠిన పరిస్థితుల్లో అందరూ నాకు అండగా నిలవడం నా జీవితంలో మరచిపోలేను.
భారత పిచ్‌లపై బౌలింగ్...
నాకు నా బౌలింగ్‌పై నమ్మకముంది. నేను పిచ్‌ను మాత్రమే నమ్ముకుని బౌలింగ్ చేసే తరహా వ్యక్తిని కాదు. ఆసీస్ పిచ్‌లతో పోలిస్తే భారత పిచ్‌లపై పేసర్లు రాణించరంటూ అప్పుడే కొందరు చర్చ మొదలు పెట్టారు. కానీ ఎలాంటి స్థితిలోనైనా రాణించగలనని గట్టిగా నమ్ముతున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దీనిని నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నా.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
‘నాన్న చనిపోయిన తర్వాత నేను ఆడటానికి సిద్ధపడటంలో నా కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. అమ్మతో పాటు నా కాబోయే భార్య కూడా స్ఫూర్తి నింపారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఏడుస్తుంటే నేనే ధైర్యం చెప్పా. సిరీస్‌లో సాధించిన ప్రతీ వికెట్‌ను నాన్నకు అంకితమిచ్చా. టీమ్ మేనేజ్‌మెంట్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదు వికెట్లు తీయడం ఆనందంగా అనిపించింది. బ్రిస్బేన్‌లో స్మిత్ క్యాచ్ వదిలేసిన ఒత్తిడి నాపై ఉండింది. తర్వాత అతని వికెట్ తీసి లెక్క సరి చేశాను.
రాబోయే సిరీస్‌లలోనూ ఇదే తరహాలో బాగా ఆడి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటా. వన్డేలు, టి20ల్లో అడుగు పెట్టినప్పుడు కొత్త కాబట్టి విఫలమయ్యాను. ఇప్పుడు అనుభవంతో నా ఆట మెరుగుపడింది. అదే ఆత్మవిశ్వాసం టెస్టుల్లో కనిపించింది. సిడ్నీలో ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినప్పుడు మేం ఆటను ఆపి వెళ్లే అవకాశం మాకు అంపైర్లు ఇచ్చారు. కానీ తప్పు చేసినవారిని పట్టుకోండి తప్ప మేం ఆట ఆపేయం అని జవాబిచ్చాం. దానిపై విచారణ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి’
హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఎయిర్‌పోర్ట్‌నుంచి నేరుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తున్న సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment