ఖాజా శతక జోరు | Usman Khawaja's first-ever Test century against India | Sakshi
Sakshi News home page

ఖాజా శతక జోరు

Published Fri, Mar 10 2023 3:15 AM | Last Updated on Fri, Mar 10 2023 3:15 AM

Usman Khawaja's first-ever Test century against India  - Sakshi

తొలి మూడు టెస్టులకు భిన్నంగా చివరి నాలుగో టెస్టు మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జట్టు మొదటి రోజే ఆలౌట్‌ కాకపోవడం విశేషమైతే... ఒక బ్యాటర్‌ తొలి రోజే సెంచరీ సాధించడం మరో విశేషం. స్పిన్‌ పిచ్‌లపై చేతులెత్తేసిన బ్యాటర్లను చూసిన ఈ టెస్టు సిరీస్‌లో తొలిసారి బౌలర్లు కష్టపడ్డారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆఖరి టెస్టు పరుగుల మజా అందించనుంది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా అజేయ సెంచరీతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజును సంతృప్తికరంగా ముగించింది. 

అహ్మదాబాద్‌: తొలిరోజు ఆలౌట్‌. మూడో రోజుకల్లా ముగింపు! ఆ్రస్టేలియా ఆడినా... భారత్‌ ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసినా... ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో ఇది షరామామూలే! కానీ ఆఖరి టెస్టు అలా మొదలవలేదు. మొతెరా వికెట్‌ బ్యాటర్లకు అవకాశమిచ్చింది. ఆలౌట్‌ కాదుకదా... కనీసం సగం వికెట్లు (5) అయినా ఆతిథ్య భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు.

ఇదే మరో నాలుగు రోజులు కొనసాగితే ఈ టెస్టు ఐదు రోజుల పాటు జరగడం ఖాయం! నాలుగో టెస్టులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. భారత పేసర్‌ షమీ 2 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు అశి్వన్, జడేజాలకు చెరో వికెట్‌ దక్కింది. ఆట నిలిచే సమయానికి ఖాజాతో పాటు కామెరాన్‌ గ్రీన్‌ (49 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. 

ఓపెనర్ల శుభారంభం 
ఆ్రస్టేలియా ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (44 బంతుల్లో 32; 7 ఫోర్లు), ఖాజా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై యథేచ్చగా బ్యాటింగ్‌ చేశారు. అనుభవజ్ఞులైన పేసర్లలో షమీ రివర్స్‌ స్వింగ్‌తో వైవిధ్యం కనబరిస్తే... ఉమేశ్‌ యాదవ్‌ నిరాశపరిచాడు. ఇతని బౌలింగ్‌లో హెడ్‌ వన్డేను తలపించే ఆట ఆడాడు. హెడ్‌ కొట్టిన 7 ఫోర్లలో అరడజను ఉమేశ్‌ బౌలింగ్‌లోనే బాదాడు.

అయితే అంతకు ముందు ఉమేశ్‌ బౌలింగ్‌లోనే హెడ్‌ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్‌ భరత్‌ సులువైన క్యాచ్‌ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. తొలి వికెట్‌కు 61 పరుగులు జతయ్యాక హెడ్‌ను అవుట్‌ చేసిన అశ్విన్‌ ఓపెనింగ్‌ జోడీకి ముగింపు పలికాడు. తర్వాత లబుషేన్‌ (3)ను చక్కని డెలివరీతో షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కెప్టెన్‌ స్మిత్‌ క్రీజులోకి రాగా... 75/2 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లారు. అనంతరం రెండో సెషనైతే బౌలర్లకు ఏమాత్రం కలిసి రాలేదు. ఖాజా, స్మిత్‌ ఆతిథ్య బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆట కొన సాగించారు.  

ఖాజా అజేయ శతకం 
మూడో వికెట్‌కు ఖాజా–స్మిత్‌ జోడీ అజేయంగా సాగడంతో వికెట్‌ పడకుండానే 149/2 స్కోరువద్ద రెండో సెషన్‌ ముగిసింది. వికెట్లు టపటపా రాలిన ఈ సిరీస్‌లో ఒక్క వికెట్‌ అయినా పడకుండా సెషన్‌ ముగియడం ఇదే తొలిసారి! అయితే ఆఖరి సెషన్‌ మొదలవగానే స్మిత్‌ (38; 3 ఫోర్లు) వికెట్‌ను జడేజా పడగొట్టడంతో 79 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హ్యాండ్స్‌కాంబ్‌ (17)ను షమీ అవుట్‌ చేశాడు.

తర్వాత వచ్చిన కామెరాన్‌ గ్రీన్‌ చూడచక్కని బౌండరీలతో స్కోరు బోర్డును పరుగుపెట్టించాడు. అతని అండతో ఖాజా టెస్టుల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి 9 ఓవర్లలో ఆసీస్‌ వేగంగా పరుగులు సాధించడంతో 54 పరుగులు వచ్చాయి. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు.  

మైదానంలో ప్రధానమంత్రులు 
తొలి రోజు ఆటలో భారత్, ఆ్రస్టేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్‌ ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ త్రూ క్రికెట్‌’ అంటూ ప్రధాన ఆకర్షణగా మారారు. టెస్టు ఆరంభానికి ముందు వీరిద్దరు ప్రత్యేక వాహనంలో మైదానమంతా కలియతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు.

అనంతరం ఇరు ప్రధానులు తమ జట్ల కెప్టెన్లకు ప్రత్యేక ‘క్యాప్‌’లను అందించగా,  వేదికపై నలుగురూ చేతులు కలిపి నిలబడిన దృశ్యం హైలైట్‌గా నిలిచింది. తమ జట్ల ఆటగాళ్లతో కలిసి వీరిద్దరు జాతీయ గీతాలాపన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ను ప్రారంభించిన అనంతరం మాజీ క్రికెటర్లు గావస్కర్, లక్ష్మణ్‌ తదితరులతో మోదీ సంభాషించారు.

ప్రెసిడెంట్స్‌ బాక్స్‌నుంచి ప్రధానులిద్దరూ కొద్ది సేపు టెస్టు మ్యాచ్‌ తొలి సెషన్‌ను వీక్షించగా...బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్‌ బిన్నీ, జై షా జ్ఞాపికలు అందజేశారు. మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. అయితే కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా తొలి రోజు ఆశించిన స్థాయిలో రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరు కాలేదు.   


స్కోరు వివరాలు 
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) జడేజా (బి) అశ్విన్‌ 32; ఉస్మాన్‌ ఖాజా బ్యాటింగ్‌ 104; లబుషేన్‌ (బి) షమీ 3; స్మిత్‌ (బి) జడేజా 38; హ్యాండ్స్‌కాంబ్‌ (బి) షమీ 17; గ్రీన్‌ బ్యాటింగ్‌ 49; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 255.

వికెట్ల పతనం: 1–61, 2–72, 3–151, 4–170. బౌలింగ్‌: షమీ 17–2–65–2, ఉమేశ్‌ 15–2–58–0, అశ్విన్‌ 25–8–57–1, జడేజా 20–2–49–1, అక్షర్‌ 12–4–14–0, అయ్యర్‌ 1–0–2–0.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement