ఇండోర్: ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని నిలబెట్టుకున్న భారత్ ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్‌పై కన్నేసింది. రెండు వరుస విజయాలతో తుదిపోరుకు మరింత చేరువైన టీమిండియా ఈ టెస్టు గెలిస్తే... చివరి టెస్టు, ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది.
సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్ కావడం... ఆటగాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఉండటం ఆ తిథ్య జట్టును పటిష్టస్థితిలో ఉంచగా... గాయాలు, వరుస వైఫల్యాలతో పర్యాటక ఆ్రస్టేలియా జట్టు కునారిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్ శర్మ బృందం ఆరంభం నుంచే పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది.
రాహుల్ స్థానంలో గిల్!
పేలవ ఫామ్‌తో ఇప్పటికే వైస్ కెపె్టన్సీ కోల్పోయిన కేఎల్ రాహుల్ తాజాగా తుది జట్టుకూ దూరమ య్యే అవకాశముంది. మూడు ఇన్నింగ్స్‌ల్లో అతని స్కోరు 20, 17, 1. ఓ టాపార్డర్ బ్యాటర్ ఆటతీరును సమీక్షిస్తున్న జట్టు మేనేజ్‌మెంట్ ఓపెనింగ్‌లో జోరు మీదున్న శుబ్‌మన్ గిల్‌ను బరిలోకి దించాలని చూస్తోంది. ఇది మినహా విజయవంతమైన జట్టులో ఇంకేం మార్పు ఉండదు.
రోహిత్–గిల్ జోడీ ఇన్నింగ్స్ ఆరంభిస్తే పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లతో కూడిన మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. అక్షర్ పటేల్ బంతి లేదంటే బ్యాట్‌తో జట్టును ఆదుకోవడం ఈ సిరీస్‌లో కలిసొచ్చింది. అతనితోపాటు జడేజా, అశ్విన్‌ల స్పిన్ త్రయం మళ్లీ కంగారూ–కంగారూ పెట్టేందుకు సిద్ధమైంది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆరంభంలో పేసర్లు షమీ, సిరాజ్‌లు కూడా ఇండోర్‌లో ప్రమాదకరం కావొచ్చు.
స్మిత్ సారథ్యంలో...
భారత పర్యటన మొదలైనప్పటి నుంచి ఆ్రస్టేలియా మైదానం లోపల, వెలుపల కష్టాలతో సహవాసం చేస్తోంది. కీలకమైన ఆటగాళ్ల గాయాలు, మ్యాచుల్లో వైఫల్యాలు నంబర్‌వన్ టెస్టు జట్టుకు ప్రతికూలంగా మారాయి. మూడంటే మూడు రోజుల్లోనే ఆటను ముగించడం చూస్తుంటే నిజంగా ఇది ఆ్రస్టేలియా జట్టేనా అనే అనుమానం కూడా రాకమానదు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరు (స్వదేశానికి తిరుగుముఖం)లో అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
మాజీ కెప్టెన్ సారథ్యంలో జట్టు ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖాజాలు శుభారంభం అందిస్తేనే తర్వాత లబుషేన్, స్మిత్, గ్రీన్‌లు జట్టును నడిపిస్తారు. లేదంటే గత మ్యాచ్‌ల ఫలితాలే పునరావృతమయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా ఈ టెస్టును ఎన్ని రోజులు ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
పిచ్–వాతావరణం
ఇండోర్ పిచ్ ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుంది. మూడో రోజు స్పిన్‌కు టర్న్ అవుతుంది. 2016లో న్యూజిలాండ్, 2019లో బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. వేసవి వేడి మొదలవడంతో వాన ముప్పేమీ లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/రాహుల్, పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, జడేజా, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్, షమీ, సిరాజ్.
ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఉస్మాన్ ఖాజా, లబుషేన్, హ్యాండ్స్‌కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ , లయన్, కున్‌మన్/బోలండ్.
Comments
Please login to add a commentAdd a comment