ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.
డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.
బ్యాటింగ్‌లో హెడ్ టాప్
తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..
ట్రవిస్ హెడ్-448
యశస్వి జైస్వాల్-391
స్టీవ్ స్మిత్-314
నితీశ్ కుమార్ రెడ్డి-298
కేఎల్ రాహుల్-276
రిషబ్ పంత్-255
మార్నస్ లబూషేన్-232
అలెక్స్ క్యారీ-216
విరాట్ కోహ్లి-190
ఉస్మాన్ ఖ్వాజా-184
బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..
బుమ్రా-32
కమిన్స్-25
బోలాండ్-21
సిరాజ్-20
స్టార్క్-18
నాథన్ లియోన్-9
జోష్ హాజిల్‌వుడ్-6
ప్రసిద్ద్ కృష్ణ-6
ఆకాశ్‌దీప్-5
నితీశ్ కుమార్ రెడ్డి-5
చెలరేగిన బోలాండ్
ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్
భారత్‌పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment