ప్యాట్ కమిన్స్.. ఈ ఫాస్ట్‌బౌలర్ 2021లో ఆస్ట్రేలియా క్రికెట్ టెస్టు జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 టైటిల్ గెలిచాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023ట్రోఫీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్‌ఫుల్ సారథిగా తనదైన ముద్ర వేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 రూపంలో కమిన్స్‌కు కఠిన సవాలు ఎదురుకాబోతోంది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో .. టీమిండియాతో జరిగే ఈ టెస్టు సిరీస్ కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కెప్టెన్‌గా అదొక్కటే నేను గెలవలేదు
తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన కమిన్స్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నేను ఇప్పటి వరకు సాధించాలనుకుని.. సాధించలేకపోయింది ఏదైనా ఉందీ అంటే.. అది టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడమే. కెప్టెన్‌గా నేను ఇప్పటి వరకు భారత్‌ను టెస్టు సిరీస్‌లో ఓడించనేలేదు. అయితే, మా జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఆ అదృష్టం దక్కింది.
సారథిగా మారిన తర్వాత నాలో పెద్దగా మార్పులేమీ రాలేదు. నేను నాలాగే ఉంటూ జట్టును విజయపథంలో ముందుకు నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’’ అని తెలిపాడు.
నాడు లీడింగ్ వికెట్ టేకర్‌గా
తన కెప్టెన్సీ కెరీర్‌లో టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవడం ముఖ్యమైనదని కమిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా కమిన్స్ 2017లో తొలిసారిగా టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పుడు ఆసీస్ ఓడిపోయింది. అయితే, 2022-21లో భారత్‌తో నాలుగు టెస్టులాడిన ఈ పేసర్.. 21 వికెట్లతో సత్తా చాటాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం
ఇక డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్లో కమిన్స్ బృందం.. టీమిండియాను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్‌లోనూ ఈ రెండు జట్లే తుదిపోరుకు అర్హత సాధించే అవకాశం ఉంది.
అయితే, రెండింటిలో ఏది ముందు ఫైనల్ చేరుతుందోనన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. రోహిత్ సేన స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడనున్న మూడు టెస్టుల్లో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.
టీమిండియాదే ఆధిపత్యం
అలా అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఫలితంతో సంబంధం ఉండదు. ఇదిలా ఉంటే.. భారత్- ఆసీస్ మధ్య నవంబరు నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో గెలిచి.. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఆస్ట్రేలియా తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేయాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇక గత నాలుగు సందర్భాల్లోనూ ఆసీస్‌ను ఓడించి భారత్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన అక్టోబరు 16 నుంచి కివీస్‌తో సిరీస్‌తో బిజీ కానుండగా.. కమిన్స్ బృందం నవంబరు 4 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది.
చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...
Comments
Please login to add a commentAdd a comment