ఐదో రోజు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లి, రహానే కలిసి కమాల్ చూపిస్తారనుకున్న భారత అభిమానులకు అసలు పరిస్థితి కొద్ది సేపటికే అర్థమైంది. ఒక వికెట్ పడగానే మిగతా వారంతా అనుసరించేశారు. కోలుకునే అవకాశమే లేకుండా మ్యాచ్‌ను అప్పగించేశారు. వరుసగా రెండోసారి టీమిండియా ఫైనల్ చేరిన ఆనందం అక్కడికే పరిమితం కాగా, ఆస్ట్రేలియా తొలిసారి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.
గతంలో భారత్‌తో టెస్టుల్లో చేసిన పొరపాట్లను ఆ్రస్టేలియా ఈసారి చేయలేదు. మరో ‘గాబా’కు అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు తొలి బంతి నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను కదలనీయకుండా చేసిన కంగారూలు ఒత్తిడి పెంచి వరుస వికెట్లు తీశారు. వన్డే, టి20 ప్రపంచకప్‌ల తర్వాత సాంప్రదాయ క్రికెట్‌లో వరల్డ్ కప్‌లాంటి చాంపియన్‌షిప్‌ను అందుకొని కంగారూలు శిఖరాన నిలిచారు.
లండన్: రెండో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ను ఆ్రస్టేలియా సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. చివరి రోజు హోరాహోరీగా సాగుతుందనుకున్న ఆట భారత్ పేలవ బ్యాటింగ్‌తో ఏకపక్షంగా ముగిసింది. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 164/3తో ఆట కొనసాగించిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది.
విరాట్ కోహ్లి (78 బంతుల్లో 49; 7 ఫోర్లు), అజింక్య రహానే (108 బంతుల్లో 46; 7 ఫోర్లు) తమ జోరును చివరి రోజు కొనసాగించలేకపోయారు. లయన్‌కు 4 వికెట్లు దక్కాయి. ట్రవిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. విజేత ఆ్రస్టేలియా జట్టుకు గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 19 లక్షలు), రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
23.3 ఓవర్లు... 70 పరుగులు... 7 వికెట్లు... చివరి రోజు భారత జట్టు ప్రదర్శన ఇది. శనివారం ఆఖరి గంటలో ప్రదర్శించిన పట్టుదల గానీ, దూకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకరి వెనుక ఒకరు వరుస కట్టడంతో లంచ్‌లోపే ఓటమి ఖాయమైంది. తొలి 6 ఓవర్ల పాటు కోహ్లి, రహానే గట్టిగా నిలబడ్డారు. అయితే బోలండ్ వేసిన తర్వాతి ఓవర్ ఆటను మలుపు తిప్పింది. స్లిప్‌లో స్మిత్ చక్కటి క్యాచ్‌కు కోహ్లి వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే జడేజా (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చెత్త బౌలింగ్ వేసిన స్టార్క్ అసలు సమయంలో తన విలువను చూపించాడు. అతని బంతిని ఆడలేక రహానే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ వేగంగా ఓటమి దిశగా పయనించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆదుకున్న శార్దుల్ (0) ఈసారి నిలవలేకపోగా, ఉమేశ్ యాదవ్ (1) అతడిని అనుసరించాడు. కొద్దిసేపు పోరాడిన శ్రీకర్ భరత్ (41 బంతుల్లో 23; 2 ఫోర్లు)ను వెనక్కి పంపిన లయన్, తన తర్వాతి ఓవర్లో సిరాజ్ (1)ను అవుట్ చేసి భారత్ ఆట ముగించాడు.
1 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్‌లను గెలిచిన తొలి జట్టుగా ఆ్రస్టేలియా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా జట్టు ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) వన్డే వరల్డ్‌కప్‌ను... రెండుసార్లు (2006, 2009) చాంపియన్స్ ట్రోఫీని... ఒకసారి (2021) టి20 వరల్డ్‌కప్‌ను.. ఒకసారి (2023) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను సాధించింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 469;
భారత్ తొలి ఇన్నింగ్స్: 296;
ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 270/8 డిక్లేర్డ్;
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) లయన్ 43; గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; కోహ్లి (సి) స్మిత్ (బి) బోలండ్ 49; రహానే (సి) క్యారీ (బి) స్టార్క్ 46; జడేజా (సి) క్యారీ (బి) బోలండ్ 0; భరత్ (సి అండ్ బి) లయన్ 23; శార్దుల్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఉమేశ్ (సి) క్యారీ (బి) స్టార్క్ 1; షమీ (నాటౌట్) 13; సిరాజ్ (సి) బోలండ్ (బి) లయన్ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (63.3 ఓవర్లలో ఆలౌట్) 234.
వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93, 4–179, 5–179, 6–212, 7–213, 8–220, 9–224, 10–234. బౌలింగ్: కమిన్స్ 13–1–55–1, బోలండ్ 16–2–46–3, స్టార్క్ 14–1–77–2, గ్రీన్ 5–0–13–0, లయన్ 15.3–2–41–4.
Comments
Please login to add a commentAdd a comment