
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికి డకెట్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. స్టార్ బ్యాటర్ జో రూట్‌తో కలిసి స్కోర్ బోర్డును డకెట్ పరుగులు పెట్టించాడు.
ఈ జోడీ మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో కేవలం 95 బంతుల్లోనే తన మూడో వన్డే సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) రాణించారు.
డకెట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన డకెట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
డకెట్ సాధించిన రికార్డులు ఇవే..
👉ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా డకెట్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం నాథన్ ఆస్ట్‌లీ పేరిట ఉండేది. నాథన్ ఆస్ట్ లీ 2004లో అమెరికాపై 145 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆస్ట్‌లీ రికార్డును డకెట్ బ్రేక్ చేశాడు.
👉ఐసీసీ టోర్నమెంట్(వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డకెట్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో ఆసీస్ పై సచిన్ 141 పరుగులు చేశాడు.
👉ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగానూ డకెట్ రికార్డు సాధించాడు. కెవిన్ పీటర్సన్ ను అతడు అధిగమించాడు. 2007 వన్డే ప్రపంచకప్ లో పీటర్సన్ ఆసీస్ పై 104 పరుగులు చేశాడు.
చదవండి: Champions Trophy: టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’