టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేదన 418... సాధించి 20 ఏళ్లయింది... ఓవల్ మైదానంలో అయితే 263 పరుగులే, అదీ 1902లో వచ్చింది. ఈ రెండింటితో పోలిస్తే ప్రస్తుత లక్ష్యం 444 పరుగులు చాలా ఎక్కువ... అయితే పాత లెక్కల ప్రతికూలతలకంటే పట్టుదలతో కూడిన ప్రదర్శన ఫలితాన్ని ఇవ్వవచ్చు! వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకునేందుకు భారత్‌ను విజయం ఊరిస్తోంది.
పరుగు తేడాతో రోహిత్, పుజారా వెనుదిరిగినప్పుడు సందేహం ఉన్నా... కోహ్లి, రహానే కలిసి ఆశలు రేపారు. వీరిద్దరి ఆటతో పాటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. అయితే మరో వికెట్ ఆసీస్‌కు దారులు తెరిచే అవకాశమూ ఉంది. టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు!
లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలిచేందుకు భారత్, ఆ్రస్టేలియా మధ్య ఆఖరి రోజు ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు),రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ఇప్పటికే అభేద్యంగా 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌కు 7 వికెట్లు అవసరం. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
క్యారీ జోరు...
ఆ్రస్టేలియా భారత్‌కు భారీ లక్ష్యాన్ని విధించగలగడంలో కీపర్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు)దే కీలకపాత్ర. శనివారం ఆసీస్ 40.3 ఓవర్లు ఆడి మరో 147 పరుగులు జత చేసింది. వాటిలో క్యారీ, మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్‌కు 20 ఓవర్లలో 93 పరుగులు జోడించడం విశేషం.
ఓవర్ నైట్ బ్యాటర్లు లబుషేన్ (41; 4 ఫోర్లు), గ్రీన్ (25; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా, క్యారీ మాత్రం బౌండరీలతో చకచకా పరుగులు రాబట్టాడు. 82 బంతుల్లో క్యారీ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు స్టార్క్‌ను అవుట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, తాను అవుట్ కాగానే కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
రోహిత్ రాణించినా...
ఛేదనను ఓపెనర్లు రోహిత్, గిల్ (19 బంతుల్లో 18; 2 ఫోర్లు) దూకుడుగానే ఆరంభించారు. దాంతో 7 ఓవర్లలోనే స్కోరు 41 పరుగులకు చేరింది. ఈ దశలో గ్రీన్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌తో గిల్ నిష్క్రమించాడు. గ్రీన్ క్యాచ్ అందుకుంటున్నప్పుడు బంతి నేలకు తగిలినట్లుగా కనిపించింది. టీవీ రీప్లేలోనూ సందేహాస్పదంగానే ఉన్నా అంపైర్ చివరకు అవుట్‌గా ప్రకటించడంతో గిల్ నిష్క్రమించక తప్పలేదు. టీ విరామం తర్వాతా రోహిత్ ధాటి కొనసాగింది.
అయితే లయన్ తొలి ఓవర్లో అనవసరపు స్వీప్ షాట్‌కు ప్రయత్నించి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఐదు బంతులకే పుజారా (47 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా అవుట్ కావడంతో భారత్ కుప్పకూలుతుందేమో అనిపించింది. కానీ కోహ్లి, రహానే తమ అపార అనుభవంతో జట్టును ఆదుకున్నారు.
ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా క్రీజులో నిలబడటంతో పాటు వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లు కూడా పూర్తిగా నియంత్రణ కోల్పోయి బంతులు వేశారు. ఆట చివర్లో మరో వికెట్ తీయలేక కంగారూ శిబిరంలో తీవ్ర అసహనం కనిపించింది. భారత్ ఈ ఇన్నింగ్స్‌లో 4.10 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469;
భారత్ తొలి ఇన్నింగ్స్: 296;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (సి) పుజారా (బి) ఉమేశ్ 41; స్మిత్ (సి) శార్దుల్ (బి) జడేజా 34; హెడ్ (సి అండ్ బి) జడేజా 18; గ్రీన్ (బి) జడేజా 25; క్యారీ (నాటౌట్) 66; స్టార్క్ (సి) కోహ్లి (బి) షమీ 41; కమిన్స్ (సి) (సబ్) అక్షర్ (బి) షమీ 5; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (84.3 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 270. వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111, 5–124, 6–167, 7–260, 8–270.
బౌలింగ్: షమీ 16.3–6–39–2, మొహమ్మద్ సిరాజ్ 20–2–80–1, శార్దుల్ ఠాకూర్ 8–1–21–0, ఉమేశ్ యాదవ్ 17–1–54–2, రవీంద్ర జడేజా 23–4–58–3.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీ) (బి) లయన్ 43; శుబ్‌మన్ గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 44; అజింక్య రహానే (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93. బౌలింగ్: కమిన్స్ 9–0–42–1, బోలండ్ 11–1–38–1, మిచెల్ స్టార్క్ 7–0–45–0, గ్రీన్ 2–0–6–0, నాథన్ లయన్ 11–1–32–1.
Comments
Please login to add a commentAdd a comment