15, 13, 14, 14... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత టాప్–4 బ్యాటర్ల స్కోర్లు ఇవి! కొండంత స్కోరు ఎదురుగా కనిపిస్తుండగా మన ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో రెండో రోజు కూడా ఆ్రస్టేలియాదే పైచేయి అయింది. మన బౌలర్ల ఆట కాస్త మెరుగుపడటంతో ప్రత్యర్థిని తొందరగానే ఆలౌట్ చేయగలిగిన టీమిండియా ఆనందం కొద్ది సేపటికే ఆవిరైంది.
కంగారూ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాటర్లను కట్టి పడేశారు. జడేజా, రహానే కీలక భాగస్వామ్యంతో ఆదుకోకపోయుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సగం బ్యాటర్లు ఇప్పటికే పెవిలియన్ చేరగా, మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది.
లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), భరత్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
ఐదుగురు ఆసీస్ బౌలర్లూ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 327/3తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా 469 పరుగులకు ఆలౌ టైంది. హెడ్ (174 బంతుల్లో 163; 25 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (268 బంతుల్లో 121; 19 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 285 పరుగులు జోడించారు.
బౌలర్ల జోరు...
రెండో రోజును ఆస్ట్రేలియా ధాటిగా ఆరంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ 229 బంతుల్లో కెరీర్‌లో 31వ సెంచరీ పూర్తి చేసుకోగా, హెడ్ కూడా కొద్ది సేపటికే 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తమ జోరు కొనసాగించిన హెడ్, స్మిత్ మొదటి 6 ఓవర్లలోనే 34 పరుగులు జోడించారు. దాంతో స్కోరు 361/3కి చేరింది. ఈ స్థితిలో భారత బౌలర్లు ఆసీస్‌ను నిలవరించగలిగారు.
హెడ్‌ను అవుట్ చేసి భారీ భాగస్వామ్యాన్ని సిరాజ్ విడదీయగా, గ్రీన్ (6) విఫలమయ్యాడు. అప్పటి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడిన స్మిత్ కూడా శార్దుల్ బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని స్టంప్స్‌పైకి ఆడుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లూ చేతులెత్తేసినా... అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన బ్యాటింగ్ కారణంగా ఆసీస్ మెరుగైన స్కోరుతో ముగించగలిగింది. ఆ్రస్టేలియా 108 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోగా... సిరాజ్ టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు 36.3 ఓవర్లు ఆడిన ఆసీస్ 142 పరుగులు సాధించింది.
టపటపా...
భారత జట్టుకు ఓపెనర్ల నుంచి ఆశించిన ఆరంభం లభించలేదు. ఒకేస్కోరు వద్ద రోహిత్ (15), గిల్ (13) అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కమిన్స్ అద్భుత బంతితో రోహిత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, బోలండ్ వేసిన బంతిని ఆడకుండా వదిలేసి గిల్ వెనుదిరిగాడు. ఆదుకుంటారనుకున్న పుజారా (14), కోహ్లి (14) కూడా విఫలమయ్యారు. పుజారా కూడా బంతిని వదిలేసి బౌల్డ్ కాగా, స్టార్క్ బౌన్సర్‌కు కోహ్లి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు.
ఈ దశలో జడేజా, రహానే కలిసి జట్టును ఆదుకున్నారు. రహానే క్రీజ్‌లో నిలదొక్కునేందుకు పట్టుదల కనబర్చగా, జడేజా దూకుడుతో పరుగులు వేగంగా వచ్చాయి. 17 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా... అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం జడేజాను లయన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వికెట్ పడకుండా రహానే, భరత్ మరో 21 బంతులు జాగ్రత్తగా ఆడారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) భరత్ (బి) శార్దుల్ 43; ఖ్వాజా (సి) భరత్ (బి) సిరాజ్ 0; లబుషేన్ (బి) షమీ 26; స్మిత్ (బి) శార్దుల్ 121; హెడ్ (సి) భరత్ (బి) సిరాజ్ 163; గ్రీన్ (సి) గిల్ (బి) షమీ 6; క్యారీ (ఎల్బీ) (బి) జడేజా 48; స్టార్క్ (రనౌట్) 5; కమిన్స్ (సి) రహానే (బి) సిరాజ్ 9; లయన్ (బి) సిరాజ్ 9; బోలండ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (121.3 ఓవర్లలో ఆలౌట్) 469. వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76, 4–361, 5–376, 6–387, 7–402, 8–453, 9–468, 10–469. బౌలింగ్: షమీ 29–4–122–2, సిరాజ్ 28.3–4–108–4, ఉమేశ్ 23–5–77–0, శార్దుల్ 23–4–83–2, జడేజా 18–2–56–1.
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కమిన్స్ 15; గిల్ (బి) బోలండ్ 13; పుజారా (బి) గ్రీన్ 14; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 14; రహానే (బ్యాటింగ్) 29; జడేజా (సి) స్మిత్ (బి) లయన్ 48; భరత్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38 ఓవర్లలో 5 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–50, 4–71, 5–142. బౌలింగ్: స్టార్క్ 9–0–52– 1, కమిన్స్ 9–2–36–1, బోలండ్ 11–4–29–1, గ్రీన్ 7–1–22–1, లయన్ 2–0–4–1.
Comments
Please login to add a commentAdd a comment