సుదీర్ఘ కాలం తర్వాత భారత క్రికెట్ జట్టు జాబితాలో ‘పక్కా హైదరాబాదీ’ పేరు కనిపించింది. అపార ప్రతిభకు ఆశించిన విధంగానే తగిన గుర్తింపు లభించింది. కొంత కాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అదృష్టం పలకరించింది. ఐపీఎల్, ఇండియా ‘ఎ’ జట్ల తరఫున సత్తా చాటిన అతడిని సెలక్టర్లు ప్రమోట్ చేస్తూ భారత సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతనికి అవకాశం దక్కింది. తన బౌలింగ్‌లాగే వేగంగా దూసుకొచ్చిన సిరాజ్ తనతో పోటీ పడుతున్న అనేక మందిని వెనక్కి తోసి టీమిండియా తలుపు తట్టడం విశేషం.
ముంబై: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ఈ జట్టును ఎంపిక చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌తో పాటు ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు కూడా తొలిసారి టీమ్‌లో చోటు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు జట్టులో ఉన్న కేదార్ జాదవ్‌పై వేటు పడింది. ‘అన్ని ఫార్మాట్‌లలో అయ్యర్ చాలా బాగా ఆడుతున్నాడు. సిరాజ్ ఆట కూడా అదే తరహాలో ఉంది. దానిని గుర్తించే మేం జట్టులోకి తీసుకున్నాం. ఒక ఆటగాడిని ఎంపిక చేస్తే అతనికి తగినన్ని అవకాశాలు కల్పించాలనేదే మా అభిమతం’ అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు.
నెహ్రా ఒక్క మ్యాచ్‌కే...
సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా తొలి టి20కు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. నవంబర్ 1న న్యూఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించినంత మాత్రాన ఢిల్లీ టి20 మ్యాచ్‌లో నెహ్రా భారత తుది జట్టులో ఉంటాడనే గ్యారంటీ ఏమీ లేదని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టులో ఉన్నా రెండు మ్యాచ్‌లలో కూడా నెహ్రాకు ఆడే అవకాశం రాలేదు. ‘నెహ్రా కచ్చితంగా ఆడతాడని మేం చెప్పలేం. అది మ్యాచ్ రోజున టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం మాత్రమే. అతను వీడ్కోలు మ్యాచ్ కావాలని కోరలేదు. మేం ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని నెహ్రాకు కూడా తెలియజేశాం’ అని ప్రసాద్ చెప్పారు.
భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, ధోని, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా, భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా, మొహమ్మద్ సిరాజ్.
అహో అయ్యర్...
గత ఏడాది కాలంలో ముంబై రంజీ జట్టు, భారత్ ‘ఎ’ తరఫున 23 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ భారీగా పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కూడా రాణించాడు. ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అతను...దక్షిణాఫ్రికాలో జరిగిన ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 140 పరుగులతో చెలరేగాడు. ఇటీవల న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టుల్లో 108, 82 పరుగులు చేసిన అతను, వన్డేలో 73 బంతుల్లో 90 పరుగులతో భారత్‌ను గెలిపించాడు. గత ఏడాది (2015–16) రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా శతకం బాది ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్... ఆసీస్‌తో ధర్మశాల టెస్టుకు కోహ్లి స్థానంలో బ్యాకప్‌గా పిలిపించినా, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. 42 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 54.74 సగటుతో 3,668 పరుగులు చేసిన అయ్యర్... 53 టి20ల్లో 128 స్ట్రయిక్ రేట్‌తో 1,289 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment