
ఐఓసీ లాభం రెండున్నర రెట్లు జంప్
♦ క్యూ1లో రూ.6,436 కోట్లు
♦ ఏడేళ్ల గరిష్ట స్థాయికి రిఫైనింగ్ మార్జిన్లు
న్యూఢిల్లీ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రెండున్నర రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.2,523 కోట్లు(ఒక్కో షేర్‌కు రూ.10.39)గా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,436 కోట్లకు(ఒక్కో షేర్‌కు రూ.26.51) పెరిగిందని ఐఓసీ చైర్మన్ బి. అశోక్ తెలిపారు. రిఫైనింగ్ మార్జిన్లు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరడం, అధిక పెట్రోకెమికల్ మార్జిన్ల వల్ల ఈ స్థాయి లాభాలు సాధించామని వివరించారు. ఒక బ్యారెల్ ముడిచమురును ఇంధనంగా మార్చడానికయ్యే స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) ఈ క్యూ1లో 10.77 డాలర్లు ఆర్జించామని పేర్కొన్నారు.
గత క్యూ1లో ఈ జీఆర్‌ఎం బ్యారెల్‌కు 2.25 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పటివరకూ ఈ జీఆర్‌ఎం 2008-09 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లోనే అధికంగా(16.81 డాలర్లు) ఉందని వివరించారు. రిఫైనరీ మార్జిన్ రూ.706 కోట్ల నుంచి రూ.6,521 కోట్లకు, పెట్రోకెమ్ మార్జిన్ రూ.719 కోట్ల నుంచి రూ.1,875 కోట్లకు పెరిగాయని వివరించారు. గత క్యూ1లో రూ.426 కోట్ల నిల్వ నష్టాలు రాగా, ఈ క్యూ1లో నిల్వ లాభాలు రూ.2,395 కోట్లని (ఒక్కో బ్యారెల్‌కు నిల్వ లాభాలు 4.78 డాలర్లు) పేర్కొన్నారు.
నిర్వహణ పనితీరు కూడా బాగా ఉండడం వల్ల జీఆర్‌ఎం పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.55,247 కోట్లుగా ఉన్న మొత్తం రుణాలు ఈ జూన్ 30 నాటికి రూ.52,519 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఇక మొత్తం ఆదాయం 19 శాతం క్షీణతతో (సీక్వెన్షియల్‌గా 7 శాతం వృద్ధి) రూ.1.01 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ 1.5 శాతం వృద్ధితో రూ.394కు పెరిగింది.
ఐఓసీ వాటా విక్రయానికి బ్యాంకర్ల నియామకం
కాగా ఐఓసీలో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఐదు మర్చంట్ బ్యాంకర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. సిటీ బ్యాంక్, నొముర, డాయిష్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్.. ఈ ఐదు సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా కేంద్రం నియమించింది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి గురువారం నాటి ముగింపు ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.9,500 కోట్ల నిధులు లభిస్తాయి.