2022కల్లా చమురు దిగుమతులు...
10 శాతానికి తగ్గింపే లక్ష్యం
* ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి..
* ఐఓసీ పారాదీప్ రిఫైనరీ జాతికి అంకితం
పారాదీప్: విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులను భారత్ భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నామని.. అప్పటికల్లా క్రూడ్ దిగుమతులను 10 శాతానికి తగ్గించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు అవసరాల్లో 79 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటం గమనార్హం.
2014-15లో 112.7 బిలియన్ డాలర్ల విలువైన 189.4 మిలియన్ టన్నుల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఆదివారమిక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) పారాదీప్‌లో నిర్మించిన రిఫైనరీని జాతికి అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా నిలబెట్టేందుకు ఆయిల్ కంపెనీలు కృషిచేయాలని, దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఐఓసీ పారాదీప్ రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. 2000 సంవత్సరం మే 24న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ఏర్పాటు కోసం ఐఓసీ రూ.34,555 కోట్లను పెట్టుబడిగా వెచ్చిం చింది. కాగా, పారాదీప్ రిఫైనరీ జతకావడంతో ఇప్పటిదాకా దేశంలో నంబర్ వన్ రిఫైనరీ సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి ఐఓసీ ఆ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన రిఫైనరీల్లో ఒకటిగా ఇది నిలవనుంది.
అధిక సల్ఫర్ మోతాదు ఉన్న హెవీ క్రూడ్ ఆయిల్‌ను సైతం శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇక్కడ ఏడాదికి 5.6 మిలియన్ టన్నుల డీజిల్, 3.79 మిలియన్ టన్నుల పెట్రోలు, 1.96 మిలియన్ టన్నుల కిరోసిన్/ఏటీఎప్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు 7,90,000 టన్నుల వంటగ్యాస్(ఎల్‌పీజీ), 1.21 మిలియన్ టన్నుల పెట్‌కోక్ కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పారు.
ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం 2.8 లక్షల టన్నుల స్టీల్‌ను వినియోగించామని.. ఇది 30 ఈఫిల్ టవర్లు/350 రాజధాని రైళ్లతో సమానమని ఆయన వివరించారు. అంతేకాదు ఇక్కడ వాడిన 11.6 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు.. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్‌కు మూడింతలతో సమానమని కూడా పేర్కొన్నారు. ఇంకా ఇక్కడ వాడిన పైపుల పొడవు 2,400 కిలోమీటర్లు(దాదాపు గంగా నది అంత పొడవు) కావడం విశేషం.
రూ. లక్ష కోట్ల ముద్రా రుణాల మంజూరు...
ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద చిన్న ఎంట్రప్రెన్యూర్లకు ఇప్పటివరకూ దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు మోదీ తెలిపారు. చాలా తక్కువ కాలంలోనే ఇంత భారీ స్థాయిలో రుణాలివ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు.
దేశంలో యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారిగా కాకుండా వాళ్లే మరింత మందికి ఉద్యోగాలను కల్పించేవిధంగా చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంతో పాటు పర్సనల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిద్వారా యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి, ఉద్యోగావకాశాలను కల్పించే స్థాయికి ఎదుగుతారని చెప్పారు.