ఐఈఏ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: చమురు దిగుమతులు, వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఐఈఏ నివేదిక ప్రకారం, 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ నిలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి.
దేశీయంగా వినియోగ మార్కెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. రహదారి రవాణాకు భారత్‌లో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 2023–2030 మధ్య కాలంలో ఆయిల్ వినియోగ వృద్ధిలో రహదారి రవాణా విభాగం వాటా 5,20,000 బీపీడీగా (మొత్తం వినియోగంలో 38 శాతం) ఉండగలదు.
అలాగే కార్ల కొనుగోళ్లు పెరిగే కొద్దీ పెట్రోల్ వినియోగం 2,70,000 బీపీడీ మేర (మొత్తంలో 20 శాతం) వృద్ధి చెందవచ్చు. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ డిమాండ్ అత్యధికం. 2000తో పోలిస్తే 2023లో భారత్‌లో కార్ల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా కార్ల సంఖ్య 2030 నాటికి 40 శాతం మేర పెరగొచ్చు. ఇక మొత్తం వాహనాల సంఖ్యలో మూడొంతుల వాటా ఉండే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కూడా కీలకంగా ఉండగలదు.
నివేదికలో మరిన్ని అంశాలు..
⇢ పెట్రోకెమికల్స్ ఉత్పత్తిలో ఎల్‌పీజీ, ఈథేన్ వినియోగం 40,000 బీపీడీ స్థాయిలో పెరగొచ్చు.
⇢ 2023లో 58 లక్షల బీపీడీగా ఉన్న భారత్ రిఫైనింగ్ సామర్థ్యం 2030 నాటికి 68 లక్షల బీపీడీకి చేరవచ్చు.
⇢ భారత్ దిగుమతి అవసరాలు దాదాపు 10 లక్షల బీపీడీ స్థాయిలో 46 లక్షల బీపీడీ నుంచి 56 లక్షల బీపీడీకి చేరవచ్చు. రిఫైనరీలను వేగవంతంగా విస్తరిస్తుండటంతో క్రూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలు 10 లక్షల బీపీడీ స్థాయిలో పెరగవచ్చు.
⇢ ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్ చోదకంగా ఉండగలదు.
⇢ 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉంది.
⇢ 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా.
⇢ 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదు. అయితే అటు తర్వాత తగ్గే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment