లాభాల్లోకి దూకిన ఇండియన్ ఆయిల్
Published Thu, Oct 27 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
దేశీయ చమురు, సహజవాయువుల సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నష్టాలకు చెక్ పెట్టి, లాభాలోకి దూకింది. దలాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన క్వార్టర్లో రూ.3,122 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ.450 కోట్ల నికర నష్టాలను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం ఆదాయాలను కూడా రూ.101,128 కోట్లగా నమోదుచేసింది. 2015 ఆర్థికసంవత్సరం ప్రథమార్థంలో ఈ ఆదాయాలు రూ.97,771.6 కోట్లగా ఉన్నాయి.
కాగ, గతేడాది ప్రథమార్థంలో ఉన్న రూ.6,141 కోట్ల నికరలాభాలను ఏకంగా రూ.11,391 కోట్లకు ఇండియన్ ఆయిల్ పెంచుకోగలిగింది. అయితే గత క్వార్టర్ కంటే కంపెనీ లాభాలు 62 శాతం తక్కువగానే నమోదయ్యయి. ఏప్రిల్-సెప్టెంబర్ క్వార్టర్లో సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) లేదా రిఫైనింగ్ క్రూడ్ ఆయిల్పై రాబడులను బ్యారెల్కు 7.19డాలర్లు ఆర్జించింది. 2015 ఇదే క్వార్టర్లో ఇవి 5.76 డాలర్లుగా నమోదయ్యాయి. మార్కెట్ సమయంలో ఈ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ స్టాక్ కొంత క్షీణించింది. 9.65 పాయింట్లు పడిపోయి 312.40 రూపాయలుగా నమోదైంది.
Advertisement
Advertisement