న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 8,781 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అధిక రిఫైనింగ్ మార్జిన్లు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,185 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1.39 లక్షల కోట్ల నుంచి రూ. 1.63 లక్షల కోట్లకు ఎగసింది. క్యూ4లో 21.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించింది. గతంలో 20.69 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1.5 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
జీఆర్‌ఎం ప్లస్: క్యూ4లో ఐవోసీ ఒక్కో బ్యారల్‌పై 10.6 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) సాధించింది. అంతక్రితం ఏడాది బ్యారల్‌కు 9.64 డాలర్ల నష్టం నమోదైంది. ఇందుకు ప్రధానంగా చమురు నిల్వల ధరలు ప్రభావం చూపింది. నిల్వల లాభాలను పక్కనపెడితే నికరంగా 2.51 డాలర్ల జీఆర్‌ఎం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,386 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 5,14,890 కోట్లను తాకింది. 2019–20లో రూ. 5,66,354 కోట్ల అమ్మకాలు సాధించింది. రుణ భారం రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 28,847 కోట్ల పెట్టుబడి వ్యయాలకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం ఎగసి రూ. 107 వద్ద ముగిసింది.
క్యూ4లో అధిక నిల్వలకుతోడు, మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు సాధించడంతో భారీ లాభాలు ఆర్జించాం. గతేడాది క్యూ4లో నిల్వల కారణంగానే నష్టాలు నమోదయ్యాయి. ముడిచమురును ఇంధనంగా మార్చేకాలంలో ధరలు పెరిగితే మార్జి న్లు బలపడతాయి. ఇదేవిధంగా ధరలు క్షీణిస్తే నష్టాలకు ఆస్కారం ఉంటుంది. ఈ క్యూ4లో బ్రెంట్ చమురు ధరలు 23% బలపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో 50–67 శాతానికి మందగించిన రిఫైనరీల ఉత్పత్తి జూన్ నుంచి 90 శాతానికి ఎగసింది.
–ఐవోసీ చైర్మన్ ఎస్‌ఎం వైద్య
Comments
Please login to add a commentAdd a comment