Turn Around
-
భారీ లాభాల్లో సెయిల్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి రూ. 1,306 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,642 కోట్ల నుంచి రూ. 29,858 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,201 కోట్ల నుంచి రూ. 27,769 కోట్లకు పెరిగాయి. కంపెనీ మొత్తం స్టీల్ ఉత్పాదక వార్షికం సామర్థ్యం 20 ఎంటీకాగా.. ఈ కాలంలో ముడిస్టీల్ ఉత్పత్తి 4.3 మిలియన్ టన్నుల నుంచి 4.8 ఎంటీకి బలపడింది. అమ్మకాలు 4.21 ఎంటీ నుంచి 4.77 ఎంటీకి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 88 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి ఏసీసీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్లో నష్టాలను వీడి రూ. 388 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం, ఇంధన వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్, నిర్వహణా సామర్థ్యం తోడ్పాటునిచ్చాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా పుంజుకుని రూ. 4,435 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,987 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో సిమెంట్, క్లింకర్ అమ్మకాలు 17 శాతంపైగా ఎగసి 8.1 మిలియన్ టన్నులను తాకాయి. మొత్తం వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 4,127 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 1,913 వద్ద ముగిసింది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్‌పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్‌చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 3,043 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. విభిన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 72,229 కోట్ల నుంచి రూ. 88,489 కోట్లకు ఎగసింది. కాగా.. స్టాండెలోన్ నికర లాభం దాదాపు మూడు రెట్లు జంప్‌చేసి రూ. 506 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 176 కోట్లు ఆర్జించింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 28 శాతం పుంజుకుని 600 కోట్ల పౌండ్లకు చేరింది. మెరుగుపడ్డ సరఫరాలు, పటిష్ట మోడళ్లు, వీటికి తగిన ధరలు ఉత్తమ పనితీరుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి 26.5 కోట్ల పౌండ్ల పన్నుకుముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో 9 మిలియన్ పౌండ్ల పన్నుకుముందు నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో లాక్డౌన్ల కారణంగా హోల్‌సేల్ అమ్మకాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. జనవరి నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని అంచనా వేసింది. చిప్‌ల కొరత తగ్గడం, ఉత్పత్తి, హోల్‌సేల్ అమ్మకాలు పుంజుకోవడం కంపెనీ టర్న్‌అరౌండ్‌కు దోహదం చేసినట్లు జేఎల్ఆర్ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ.419 వద్ద ముగిసింది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం రికార్డ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,932 కోట్ల నుంచి రూ. 5,777 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతానికి బలహీనపడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది. -
నష్టాల్లోకి టాటా స్టీల్ లాంగ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్‌కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి గోద్రెజ్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 423 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 92 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,611 కోట్ల నుంచి రూ. 4,445 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,814 కోట్ల నుంచి రూ. 4,202 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ. 391 కోట్ల నుంచి రూ. 992 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 51 శాతం జంప్‌చేసి రూ. 14,130 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 9,334 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. నాదిర్ గోద్రెజ్‌ను మరో మూడేళ్లపాటు అంటే 2026 మార్చి 31వరకూ చైర్మన్, ఎండీగా బోర్డు తిరిగి ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేరు 9% జంప్‌చేసి రూ. 477 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ. 7,245 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 8,644 కోట్ల నుంచి రూ. 7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
భారత్ ఫోర్జ్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 232 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 212 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,083 కోట్ల నుంచి రూ. 3,573 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 1,841 కోట్ల నుంచి రూ. 3,296 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. కొత్త ఆర్డర్లు ప్లస్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి భారత్ ఫోర్జ్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 1,077 కోట్ల నికర లాభం సాధించింది. 2020–21లో రూ. 127 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 6,336 కోట్ల నుంచి రూ. 10,461 కోట్లకు జంప్ చేసింది. దేశీ కార్యకలాపాల నుంచి రూ. 1,000 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను సాధించినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి వెల్లడించారు. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ నుంచి ఇవి లభించినట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఉత్తర అమెరికా నుంచి స్టీల్, అల్యూమినియం ఫోర్జింగ్ కార్యకలాపాల ద్వారా 15 కోట్ల డాలర్ల విలువైన తాజా కాంట్రాక్టులను పొందినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 5.5% జంప్‌చేసి రూ. 663 వద్ద ముగిసింది. -
ఇండిగో టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 620 కోట్ల నష్టం ప్రకటించింది. ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల ఈ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 4,910 కోట్ల నుంచి రూ. 9,295 కోట్లకు జంప్‌చేసింది. ప్యాసిజింజర్ టికెట్ల విక్రయాల ద్వారా 98 శాతం అధికంగా రూ. 8,073 కోట్ల ఆదాయం లభించినట్లు ఇండిగో వెల్లడించింది. కాగా.. వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియాను ఎండీగా నియమిస్తున్నట్లు ఇండిగో బోర్డు తాజాగా తెలియజేసింది. ఎండీగా భాటియా కంపెనీ అన్ని విభాగాలకూ సారథ్యం వహించనున్నట్లు ఇండిగో చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ టీమ్‌ను ముందుండి నడిపించనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 1,971 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 1,134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మెరుగుపడ్డ బిజినెస్ వాతావరణం, 4జీ కస్టమర్లలో వృద్ధి, బలపడిన మొబైల్ ఏఆర్పీయూ వంటి అంశాలు పటిష్ట ఫలితాల సాధనకు సహకరించాయి. క్యూ2లో మొత్తం ఆదాయం 19% పుంజుకుని రూ. 28,326 కోట్లను అధిగమించింది. పెట్టుబడి వ్యయాలు రూ. 6,972 కోట్లుగా నమోదయ్యాయి. 16 దేశాలలో ఎయిర్టెల్ 16 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్ల సంఖ్య 48 కోట్లకు చేరింది. టెలికం రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్ చెల్లింపులకు ఎయిర్‌టెల్‌కు నాలుగేళ్ల గడువు లభించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, డేటా సెంటర్లు, డిజిటల్ సర్వీసుల ఆదాయం పుంజుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో దేశీ ఆదాయం 18 శాతంపైగా వృద్ధితో రూ. 20,987 కోట్లను తాకింది. కస్టమర్ల సంఖ్య 35.5 కోట్లకు చేరింది. ఒక్కో కస్టమర్‌పై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 10 బలపడి రూ. 153కు చేరింది. 4జీ వినియోగదారుల సంఖ్య 26 శాతం ఎగసి 19.25 కోట్లను తాకింది. ఒక్కో యూజర్ సగటు నెల రోజుల డేటా వినియోగం 18.6 జీబీగా నమోదైంది. 3,500 టవర్లను అదనంగా ఏర్పాటు చేసుకుంది. ‘కేంద్రం ప్రకటించిన సంస్కరణలు టెలికం పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులకు దారిచూపనున్నాయి. దీంతో దేశీయంగా డిజిటల్ విస్తరణకు ఊతం లభించనుంది. సంస్కరణలు కొనసాగుతాయని, దీర్ఘకాలంగా పరిశ్రమను దెబ్బతీస్తున్న అంశాలకు పరిష్కారాలు లభించవచ్చని భావిస్తున్నాం. 5జీ నెట్వర్క్ ద్వారా మరింత పటిష్టపడనున్నాం’ అని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (దక్షిణాసియా)గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు యథాతథంగా రూ. 713 వద్ద ముగిసింది. -
ఐఆర్సీటీసీ షేర్ల విభజన
న్యూఢిల్లీ: రైల్వే రంగ దిగ్గజం ఐఆర్సీటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 82 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 24 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఆదాయం 85% పైగా జంప్‌చేసి రూ. 243 కోట్లను తాకింది. కాగా.. షేరు ముఖ విలువను విభజించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువగల ప్రతీ ఒక షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. తద్వారా మార్కెట్లో లిక్విడిటీ పెరగడంతోపాటు.. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,695 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,729 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం కావడం గమనార్హం! -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 9,768 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,648 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,662 కోట్ల నుంచి రూ. 53,534 కోట్లకు జంప్‌చేసింది. అయితే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 29,116 కోట్ల నుంచి రూ. 41,397 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 5.54 మిలియన్ టన్నుల నుంచి 7.88 ఎంటీకి ఎగసింది. విక్రయాలు 5.34 ఎంటీ నుంచి 7.11 ఎంటీకి వృద్ధి చూపాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 16,185 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు టాటా స్టీల్ సీఎఫ్‌వో కౌశిక్ చటర్జీ వెల్లడించారు. రూ. 3,500 కోట్ల క్యాష్ ఫ్లోను సాధించడంతోపాటు.. రూ. 5,894 కోట్లమేర రుణ చెల్లింపులను చేపట్టినట్లు తెలియజేశారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం పుంజుకుని రూ. 1,434 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,209 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 864 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం బలపడటం, మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 2.59 శాతం నుంచి 3.12 శాతానికి పుంజుకోవడంతో గ్లోబల్ స్థాయిలో 2.52 శాతం నుంచి 3.04 శాతానికి ఎగశాయి. గతేడాది 2.7 శాతంగా నమోదైంది. -
సన్ ఫార్మా.. సూపర్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,444 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,656 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,585 కోట్ల నుంచి రూ. 9,719 కోట్లకు ఎగసింది. లోబేస్తోపాటు.. కీలక ఫార్మా బిజినెస్‌లో సాధించిన వృద్ధి ఇందుకు సహకరించినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. కోవిడ్–19 ప్రొడక్టులు సైతం ఇందుకు మద్దతిచ్చినట్లు తెలియజేశారు. ఫార్ములేషన్స్ జూమ్ క్యూ1లో సన్ ఫార్మా దేశీ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు 39 శాతం జంప్‌చేసి రూ. 3,308 కోట్లను అధిగమించాయి. మొత్తం ఆదాయంలో ఇవి 34 శాతం వాటాకు సమానంకాగా.. టారోతో కలిపి యూఎస్ విక్రయాలు 35 శాతం వృద్ధితో రూ. 2,800 కోట్లను తాకాయి. వీటి వాటా 29 శాతం. ఇక వర్ధమాన మార్కెట్ల ఆదాయం సైతం 25 శాతం పురోగమించి రూ. 1,605 కోట్లను అధిగమించింది. మొత్త ఆదాయంలో ఈ విభాగం 17 శాతం వాటాను ఆక్రమిస్తోంది. మార్కెట్ క్యాప్ అప్ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 784 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 16,971 కోట్లు బలపడింది. వెరసి రూ. 1,85,704 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈలో 3.58 కోట్లు, బీఎస్ఈలో 20.34 లక్షల షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
లాభాల్లోకి మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 475 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 268 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,111 కోట్ల నుంచి రూ. 17,776 కోట్లకు జంప్‌చేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ కొంతమేర సవాళ్లు విసిరినప్పటికీ.. గతేడాది క్యూ1 పరిస్థితులతో పోలిస్తే ప్రభావం తక్కువేనని కంపెనీ పేర్కొంది. దీంతో ఫలితాలు పోల్చలేమని వ్యాఖ్యానించింది. సుజుకీ మోటార్ కార్పొరేషన్ బోర్డు నుంచి జూన్‌లో పదవీ విరమణ చేసిన ఒసాము సుజుకీని గౌరవ చైర్మన్‌గా గుర్తిస్తున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. కంపెనీకి అందించిన సేవలకు ఈ గుర్తింపునిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ విజయంలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన ఒసాము మారుతీ బోర్డులో కొనసాగనున్నట్లు తెలియజేసింది. అమ్మకాలు జూమ్: క్యూ1లో మారుతీ మొత్తం 3,53,614 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 76,599 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. దేశీయం గా 3,08,095 వాహనాలు అమ్ముడుపోగా.. 45,519 యూనిట్ల ఎగుమతులు సాధించింది. గత క్యూ1లో ఈ సంఖ్యలు వరుసగా 67,027, 9,572గా నమోదయ్యాయి. కాగా.. స్టాండెలోన్ పద్ధతిలోనూ మారుతీ రూ. 441 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 249 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలపై సెకండ్ వేవ్ ప్రభావం, భారీగా పెరిగిన కమోడిటీ ధరలు క్యూ1 లాభాలను పరిమితం చేసినట్లు మారుతీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. అయితే వ్యయాలను తగ్గిం చే చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 1.3 శాతం వెనకడుగుతో రూ. 7,145 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 250 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 3,571 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. స్టాండెలోన్ ఫలితాలివి. అయితే మొత్తం ఆదాయం రూ. 12,216 కోట్ల నుంచి రూ. 11,380 కోట్లకు క్షీణించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 2,160 కోట్ల స్టాండెలోన్ లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 2,957 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 49,066 కోట్ల నుంచి రూ. 48,041 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ4లో తాజా స్లిప్పేజెస్ రూ. 7,368 కోట్లను తాకగా.. మొత్తం ప్రొవిజన్లు 70 శాతం తక్కువగా రూ. 1,844 కోట్లకు పరిమితమయ్యాయి. మార్జిన్లు డీలా మార్చికల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 14.78 శాతం నుంచి 13.77 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.88 శాతం నుంచి 3.35 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఏకే దాస్ పేర్కొన్నారు. ఈ ఏడాది స్థూల ఎన్పీఏలను 2.5 శాతంవరకూ తగ్గించుకోనున్నట్లు చెప్పారు. అయితే దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.18 శాతం నుంచి 2.16 శాతానికి నీరసించాయి. ఈ ఏడాది మార్జిన్లను 2.5 శాతానికి మెరుగుపరచుకోనున్నట్లు దాస్ తెలియజేశారు. కనీస మూలధన పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 13.1 శాతం నుంచి 14.93 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 82.3 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో రెండు ఎక్సే్చంజీలలోనూ కలిపి దాదాపు 5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
Indian Oil Corporation: టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 8,781 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అధిక రిఫైనింగ్ మార్జిన్లు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,185 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1.39 లక్షల కోట్ల నుంచి రూ. 1.63 లక్షల కోట్లకు ఎగసింది. క్యూ4లో 21.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించింది. గతంలో 20.69 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1.5 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జీఆర్ఎం ప్లస్: క్యూ4లో ఐవోసీ ఒక్కో బ్యారల్‌పై 10.6 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) సాధించింది. అంతక్రితం ఏడాది బ్యారల్‌కు 9.64 డాలర్ల నష్టం నమోదైంది. ఇందుకు ప్రధానంగా చమురు నిల్వల ధరలు ప్రభావం చూపింది. నిల్వల లాభాలను పక్కనపెడితే నికరంగా 2.51 డాలర్ల జీఆర్ఎం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,386 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 5,14,890 కోట్లను తాకింది. 2019–20లో రూ. 5,66,354 కోట్ల అమ్మకాలు సాధించింది. రుణ భారం రూ. 1.16 లక్షల కోట్ల నుంచి రూ. 1.02 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 28,847 కోట్ల పెట్టుబడి వ్యయాలకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం ఎగసి రూ. 107 వద్ద ముగిసింది. క్యూ4లో అధిక నిల్వలకుతోడు, మెరుగైన రిఫైనింగ్ మార్జిన్లు సాధించడంతో భారీ లాభాలు ఆర్జించాం. గతేడాది క్యూ4లో నిల్వల కారణంగానే నష్టాలు నమోదయ్యాయి. ముడిచమురును ఇంధనంగా మార్చేకాలంలో ధరలు పెరిగితే మార్జి న్లు బలపడతాయి. ఇదేవిధంగా ధరలు క్షీణిస్తే నష్టాలకు ఆస్కారం ఉంటుంది. ఈ క్యూ4లో బ్రెంట్ చమురు ధరలు 23% బలపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో 50–67 శాతానికి మందగించిన రిఫైనరీల ఉత్పత్తి జూన్ నుంచి 90 శాతానికి ఎగసింది. –ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చదవండి: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ -
ఎయిర్టెల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 759 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,237 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 12% పుంజుకుని రూ. 25,747 కోట్లను తాకింది. దేశీయంగా ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 18,338 కోట్లకు చేరింది. దీనిలో మొబైల్ సేవల ఆదాయం 9% బలపడి రూ. 14,080 కోట్లయ్యింది. ఆఫ్రికా ఆదాయం 17 శాతం ఎగసి రూ. 7,602 కోట్లకు చేరువైంది. వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 5.8% నీరసించి రూ. 145కు పరిమితమైంది. వ్యయాలు తగ్గినా.. క్యూ4లో పెట్టుబడుల వ్యయం సగానికి తగ్గి రూ. 3,739 కోట్లకు పరిమితమైంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితుల కారణంగా డేటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఫిక్స్డ్ లైన్లుసహా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం అధిక పెట్టుబడులు వెచ్చించవలసి వచ్చినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. వెరసి హోమ్ సర్వీసులపై మూడు రెట్లు అధికంగా రూ. 332 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. ఎక్స్ట్రీమ్ పేరుతో విడుదల చేసిన ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా కొత్తగా 2.74 లక్షల మంది జత కలిశారు. దీంతో ఈ విభాగంలో కస్టమర్ల సంఖ్య 30.7 లక్షలకు చేరింది. ఎల్సీవో భాగస్వామ్యం ద్వారా నాన్‌వైర్‌డ్ పట్టణాలలోనూ సేవలు విస్తరిస్తున్నట్లు ఎయిర్టెల్ వివరించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా తగ్గి రూ. 15,084 కోట్లకు పరిమితమైంది. 2019–20లో రూ. 32,183 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ కాలంలో టర్నోవర్ తొలిసారి రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 1,00,616 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 84,676 కోట్ల ఆదాయం సాధించింది. ప్రస్తుతం దేశీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 72,308 కోట్లను అధిగమించింది. ఆఫ్రికా బిజినెస్ సైతం 19 శాతం పుంజుకుని రూ. 28,863 కోట్లను తాకింది. గ్లోబల్ కస్టమర్ల సంఖ్య 47 కోట్లుకాగా.. దేశీయంగా కస్టమర్లు 13 శాతం పెరిగి 35 కోట్లకు చేరారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రుణ భారం రూ. 1,48,508 కోట్లుగా నమోదైంది. కోవిడ్–19 సవాళ్లలో అవసరమైన డిజిటల్ ఆక్సిజన్ వంటి సర్వీసులను అందిస్తున్నాం. ఇలాంటి కష్టకాలంలోనూ కస్టమర్లకు పటిష్ట నెట్‌వర్క్‌ను అందించేందుకు తోడ్పడుతున్న సిబ్బందిని ప్రశంసిస్తున్నాను. వెరసి మరోసారి ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలిగాం. క్యూ4లో ఎంటర్ప్రైజ్ విభాగం రెండంకెల వృద్ధిని సాధించింది. – ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం నష్టంతో రూ. 548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 564–546 మధ్య ఊగిసలాడింది. -
టాటా కన్జూమర్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ..టాటా కన్జూమర్ నాలుగో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నష్టాల నుంచి బయటపడి రూ. 74 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 122 కోట్ల నికర నష్టం నమోదైంది. దేశీయంగా అమ్మకాల పరిమాణం రెండంకెల వృద్ధిని సాధించడం ప్రభావం చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం ఎగసి రూ. 3,037 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.05 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. క్యూ4లో దేశీ ఆహారం, పానీయాల విభాగాలలో 20 శాతంపైగా పురోగతిని అందుకున్నట్లు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గ్రూప్ సీఎఫ్‌వో ఎల్.కృష్ణకుమార్ పేర్కొన్నారు. నాన్‌బ్రాండెడ్ బిజినెస్ టాటా కాఫీ ప్లాంటేషన్ సైతం పటిష్ట పనితీరు చూపడం ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. టాటా కన్జూమర్ గతంలో టాటా బెవరేజెస్‌గా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. కాగా.. క్యూ4లో మొత్తం వ్యయాలు 29 శాతం పెరిగి రూ. 2,818 కోట్లను తాకాయి. విభాగాల వారీగా దేశీయంగా పానీయాల విభాగం 60 శాతం జంప్‌చేసి రూ. 1,205 కోట్లను తాకగా.. ఫుడ్ బిజినెస్ 22 శాతం పుంజుకుని రూ. 642 కోట్లకు చేరింది. వీటిలో సాల్ట్ అమ్మకాలు 17 శాతం, సంపన్ విభాగం ఆదాయం 26 శాతం చొప్పున ఎగసింది. అయితే అంతర్జాతీయ పానీయాల బిజినెస్ యథాతథంగా రూ. 875 కోట్లుగా నమోదైంది. టాటా స్టార్‌బక్స్ ఆదాయం 14 శాతం బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి టాటా కన్జూమర్ నికర లాభం రెట్టింపై రూ. 930 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 11,602 కోట్లకు చేరింది. టాటా కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం బలపడి రూ. 651 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 655–638 మధ్య ఊగిసలాడింది. -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా స్టీల్ గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో టర్న్అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 7,162 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,615 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,323 కోట్ల నుంచి రూ. 50,250 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 35,432 కోట్ల నుంచి రూ. 40,052 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. రికార్డ్ ఇబిటా: తొలి అర్ధభాగంలో కోవిడ్–19 ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థం నుంచి దేశీయంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు.. ఆర్థిక రికవరీ ప్రారంభంకావడంతో స్టీల్ వినియోగం పెరిగినట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. దీంతో పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు తెలియజేశారు. క్యూ4లో ముడిస్టీల్ ఉత్పత్తి 4.75 మిలియన్ టన్నులకు చేరి రికార్డును సృష్టించగా.. అమ్మకాలు 16 శాతం పెరిగి 4.67 మిలియన్ టన్నులను తాకినట్లు టాటా స్టీల్ పేర్కొంది. క్యూ4లో ఇబిటా 40 శాతం వృద్ధితో రూ. 12,295 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 14,290 కోట్ల ఇబిటాను సాధించినట్లు వెల్లడించింది. మార్జిన్లు 40.9 శాతంగా నమోదయ్యాయి. పెట్టుబడి వ్యయాల తదుపరి రూ. 8,800 కోట్ల ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు నరేంద్రన్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి క్యాష్‌ఫ్లో రూ. 24,000 కోట్లకు చేరగా.. రూ. 28,000 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. వెరసి మొత్తం రుణ భారం 28 శాతం తగ్గి రూ. 75,389 కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,071 వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంక్ టర్న్అరౌండ్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. రూ. 1,359 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) రూ. 12,887 కోట్ల నికర నష్టం నమోదైంది. వెరసి ఐదేళ్ల తరువాత టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఇక గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో నికర లాభం 4 రెట్లు ఎగసి రూ.512 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 135 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం మార్చిలో బయటపడినట్లు ఎల్ఐసీ నియంత్రణ లోని ఐడీబీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ అనుసరించిన టర్న్అరౌండ్ వ్యూహాలు ట్రాన్స్‌ఫార్మేషన్‌కు బాటను ఏర్పరచినట్లు బ్యాంక్ తెలియజేసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 3,240 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 1.34 శాతం బలపడి 5.14 శాతానికి చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 166 కోట్ల నుంచి రూ. 548 కోట్లకు జంప్ చేసింది. ఈ మార్చి త్రైమాసికంతో కలిపి వరుసగా ఐదు క్వార్టర్లపాటు బ్యాంకు లాభాలు ఆర్జించినట్లు ఐడీబీఐ ఎండీ, సీఈవో రాకేష్ శర్మ వివరించారు. ఎన్పీఏలు తగ్గాయ్: మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 27.53% నుంచి 22.37%కి బలహీనపడ్డాయి. ఇదే విధంగా నికర ఎన్పీఏలు 4.19% నుంచి 1.97%కి భారీగా తగ్గాయి. అయితే మొండి ప్రొవిజన్లు రూ. 1,738 కోట్ల నుంచి రూ. 2,367 కోట్లకు పెరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్కుగాను రూ. 500 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు బ్యాంకు తెలియజేసింది. టైర్–1 పెట్టుబడులు 13.06%కి, సీఆర్ఏఆర్ 15.59 శాతానికి మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ4లో తాజా మొండిబాకీలు రూ. 2,281 కోట్లకు చేరగా.. రికవరీలు రూ. 1,233 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 36.25 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా- ఉత్తమ్ గాల్వా.. భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. వెరసి సన్ ఫార్మా కౌంటర్ వరుసగా రెండో రోజు లాభాలతో సందడి చేస్తుంటే.. ఉత్తమ్ గాల్వా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సన్ ఫార్మాస్యూటికల్ నికర లాభం 70 శాతం ఎగసి రూ. 1,813 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 5 శాతమే పెరిగి రూ. 8,553 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం మెరుగుపడి 25.6 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 518ను అధిగమించింది. ప్రస్తుతం 5 శాతం లాభంతో రూ. 508 వద్ద ట్రేడవుతోంది. వెరసి గత రెండు రోజుల్లో ఈ షేరు 11 శాతంపైగా ర్యాలీ చేసింది. ఉత్తమ్ గాల్వా స్టీల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఉత్తమ్ గాల్వా స్టీల్ రూ. 19.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 335 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 142 కోట్ల నుంచి రూ. 195 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 321 కోట్ల నుంచి రూ. 176 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ గాల్వా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 6.50 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీకి సంబంధించి కార్పొరేట్ రుణచెల్లింపుల రిజల్యూషన్ చేపట్టేందుకు ఎస్బీఐకు ఎన్సీఎల్టీ అనుమతించింది.