న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 3,043 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. విభిన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 72,229 కోట్ల నుంచి రూ. 88,489 కోట్లకు ఎగసింది. కాగా.. స్టాండెలోన్ నికర లాభం దాదాపు మూడు రెట్లు జంప్‌చేసి రూ. 506 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 176 కోట్లు ఆర్జించింది.
జేఎల్‌ఆర్ జూమ్
ప్రస్తుత సమీక్షా కాలంలో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) ఆదాయం 28 శాతం పుంజుకుని 600 కోట్ల పౌండ్లకు చేరింది. మెరుగుపడ్డ సరఫరాలు, పటిష్ట మోడళ్లు, వీటికి తగిన ధరలు ఉత్తమ పనితీరుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి 26.5 కోట్ల పౌండ్ల పన్నుకుముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో 9 మిలియన్ పౌండ్ల పన్నుకుముందు నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో లాక్‌డౌన్ల కారణంగా హోల్‌సేల్ అమ్మకాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. జనవరి నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని అంచనా వేసింది. చిప్‌ల కొరత తగ్గడం, ఉత్పత్తి, హోల్‌సేల్ అమ్మకాలు పుంజుకోవడం కంపెనీ టర్న్‌అరౌండ్‌కు దోహదం చేసినట్లు జేఎల్‌ఆర్ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ.419 వద్ద ముగిసింది.
లాభాల్లోకి టాటా మోటార్స్
Published Thu, Jan 26 2023 6:30 AM | Last Updated on Thu, Jan 26 2023 6:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment