న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,932 కోట్ల నుంచి రూ. 5,777 కోట్లకు బలపడింది.
వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతానికి బలహీనపడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment