* 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్ల టర్నోవర్
* రూ.204 కోట్ల నష్టాన్ని అధిగమించి రూ.20 కోట్ల లాభం
* 30 ఏళ్ల తరువాత లాభాల్లోకి
* షిప్‌యార్డు చైర్మన్ శరత్‌బాబు
* నేడు ప్లాటినం జూబ్లీ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ షిప్‌యార్డ్ టర్న్ ఎరౌండ్ అయ్యింది. మూడు దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న హిందూస్తాన్ షిప్‌యార్డు ప్రస్తుతం లాభాల్లోకి వచ్చిందని ఆ సంస్థ సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు సోమవారం ప్రకటించారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్ల టర్నోవర్‌తో రూ.20 కోట్ల లాభం ఆర్జించామన్నారు. ఈ లాభం పెద్ద మొత్తం కాకపోయినా ఖాయిలా పరిశ్రమ అనే మచ్చను చెరిపేసుకున్నామన్నారు. 2014-15లో ఉన్న రు.204 కోట్ల నష్టాన్ని పూడ్చుకొని లాభాల్లోకి రావడమే గొప్ప విజయంగా భావిస్తున్నామన్నారు. 2018 నాటికి ఆర్థికంగా మరింత పుంజుకుంటామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చే నెలాఖరునాటికి తాము డెలివరీ చేసిన వెసల్స్ సంఖ్య తొమ్మిదికి చేరుతుందన్నారు. ఇంత తక్కువ కాలంలో అన్ని ఆర్డర్లను పూర్తి చేయడం ఏ సంస్థకీ సాధ్యం కాదన్నారు. గత మూడు నెలల్లో ఉత్పత్తిని మూడు రెట్లు పెంచామన్నారు. ప్రస్తుతం తమవద్ద రూ.1200 కోట్ల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా విమాన విన్యాసాల మద్దతుకు సంబంధించిన రూ.9వేల కోట్ల విలువైన ఐదు నౌకల వర్క్ ఆర్డర్ ఒప్పందాలు కూడా పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడెనిమిదేళ్లలో రూ.20 వేల కోట్ల ఆర్డర్లు సాధించేందుకు నామినేషన్లు పూర్తి చేశామన్నారు.
కొరియా సహకారంతో ఆధునికీకరణ
కొరియా షిప్‌యార్డు భాగస్వామ్యంతో సంస్థ ఆధునికీకరణ పనులను చేపట్టనున్నామని సీఎండీ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. షిప్‌యార్డుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇ-75 సబ్‌మెరైన్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. సింధువీర్ సబ్‌మెరైన్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామ చెప్పారు. హుద్‌హుద్ వల్ల తమ సంస్థ రూ.200 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందన్నారు.
ప్రతిష్టాత్మకంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు
షిప్‌యార్డు 75 వసంతాల వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నామని సీఎండీ చెప్పారు. 1941 నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో 177 నౌకలు నిర్మించగా, 1950 నౌకలకు మరమ్మతులు చేశామని వివరించారు. జల ఉష నౌకతో ప్రస్థానం ప్రారంభించిన సంస్థ ‘మినిమైజ్ కాస్ట్.. మేగ్జిమైజ్ అవుట్‌పుట్’ అన్న నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. సమావేశంలో డెరైక్టర్లు కమెడోర్ పిహెచ్.ఎం.సలీహ్, కమెడోర్ అశోక్‌భల్, ఎం.నాగరాజ్, సీజీఎం ఎస్.రమేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
హిందుస్తాన్ షిప్‌యార్డ్ టర్న్ ఎరౌండ్
Published Tue, Jun 21 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement