Hindustan Ship Yard
-
విశాఖ: ఇది ఆరంభం మాత్రమే.. హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త రికార్డు!
నౌకల నిర్మాణం, మరమ్మతుల విషయంలోనూ హిందుస్థాన్ షిప్ యార్డు తనదైన ముద్ర వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో దూసుకుపోతూ.. మరోవైపు సాంకేతికతకు పదును పెడుతోంది. భారత నౌకాదళం కోసం నిరి్మస్తున్న షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి అబ్బురపరిచింది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న నేపథ్యంలోనౌకా నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డు సరికొత్త అధ్యాయాల్ని లిఖిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులు, నిర్మాణాలనైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతిపెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. తాజాగా భారత నౌకాదళం కోసం డైవింగ్ సపోర్ట్ వెసల్ షిప్లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) భారత నౌకాదళానికి చెందిన షిప్ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచి్చంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. డీప్సీ డైవింగ్, సబ్‌మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ నిస్టార్, ఐఎన్ఎస్ నిపుణ్ యుద్ధనౌకల్ని తయారు చేస్తోంది. తొలిసారిగా యుద్ధ నౌకలో 3 మెగావాట్ల డీజిల్ జనరేటర్ ఏర్పాటు చేసి చారిత్రక అధ్యాయాన్ని లిఖించింది. ఐఎన్ఎస్ నిస్టారాలో గురువారం ఉదయం ఈ భారీ జనరేటర్‌ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి యుద్ధ నౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. నిర్మాణ సమయంలో మొదటి జనరేటర్ సేవలు ప్రారంభిస్తే.. నౌకానిర్మాణం దాదాపు పూర్తయినట్లేనని భావిస్తారు. ఈ జనరేటర్ ప్రారంభమైతే.. షిప్‌కు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇప్పటివరకూ 2 మెగావాట్ల డీజిల్ జనరేటర్లు మాత్రమే వినియోగించారు. కానీ.. నిస్టార్కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కారి్మకులు నిరంతరం శ్రమించి దీనిని రూపొందించారు. ఈ జనరేటర్ ప్రారంభంతో నిస్టార్ షిప్ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయని షిప్‌యార్డు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఐఎన్ఎస్ నిస్టార్ను భారత నౌకాదళానికి అప్పగించేందుకు షిప్‌యార్డు బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ యుద్ధనౌక నిర్మాణ ప్రాజెక్టును రూ.2,100 కోట్ల వ్యయంతో హెచ్ఎస్ఎల్ చేపడుతోంది. -
షిప్ రిపేర్ హబ్‌గా విశాఖ.. అదానీ పోర్ట్స్ నుంచి అమెరికా షిప్స్ వరకూ..
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు హిందూస్థాన్ షిప్‌యార్డుతో జతకడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం షిప్‌రిపేర్ హబ్‌గా అడుగులు వేస్తోంది. అదానీ పోర్టుల నుంచి అమెరికాకు చెందిన నౌకల వరకూ.. రక్షణ దళాల నుంచి.. ఆయిల్ కార్పొరేషన్ల వరకూ.. అన్ని సంస్థలూ హెచ్ఎస్ఎల్ వైపే చూస్తున్నాయి. నిర్లక్ష్యంగా పనులు చేస్తారన్న అపప్రద నుంచి నిర్ణీత సమయానికంటే ముందుగానే మరమ్మతులు పూర్తి చేస్తారన్న స్థాయికి ఎదిగిన షిప్‌యార్డు.. ఈ ఏడాది రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను దక్కించుకున్న హెచ్‌ఎస్‌ఎల్‌కు మరో 3 నౌకల పనులను అప్పగించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందూస్థాన్ షిప్‌యార్డు దేశంలోనే అతి పెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన షిప్‌యార్డు తాజాగా 2000 షిప్స్ మరమ్మతుల పనులను కూడా పూర్తి చేసింది. ఈ ఏడాది ఏకంగా రూ.20 వేల కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయనుంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్(ఎఫ్ఎస్ఎస్)ని భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు డిసెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అందుకే దేశ విదేశీ సంస్థలు షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్(డీసీఐ), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ అండ్ ట్రైనింగ్ (సిఫ్నెట్)తో పాటు అమెరికాకు చెందిన మెక్ డెర్మాట్, సింగపూర్‌కు చెందిన అబాన్ ఆఫ్‌షోర్, అదానీ పోర్టులు, సెజ్‌లు.. ఇలా ప్రతి సంస్థా హెచ్‌ఎస్‌ఎల్‌కు పనులు అప్పగించేందుకు సుముఖత చూపుతుండటం విశేషం. పదేళ్ల తర్వాత ఓఎన్జీసీ సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల సమయంలో షిప్యార్డుపై పడిన నిర్లక్ష్యపు మరక దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ఓ నౌకను మరమ్మతు కోసం ఇచ్చిన ఓఎన్జీసీ.. ఆ తర్వాత హెచ్ఎస్ఎల్ వైపు చూడలేదు. దాదాపు పదేళ్ల తర్వాత షిప్‌యార్డుకు పనులు అప్పగించేందుకు ఓఎన్జీసీ రావడం విశేషం. ఓఎన్జీసీకి చెందిన డ్రిల్ షిప్, షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన సాగర్ భూషణ్ పనులు చేపడుతోంది. దీంతో పాటుగా ఓఎన్జీసీ ప్లాట్‌ఫామ్ మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. అదేవిధంగా మరో మూడు షిప్పింగ్ కార్పొరేషన్ నౌకల పనులు కూడా షిప్‌యార్డుకు దక్కనున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. ఇలా గత మూడేళ్ల వ్యవధిలో 31 భారీ నౌకల మరమ్మతులను పూర్తి చేసింది. తాజాగా రూ.620 కోట్లతో సింధుఘోష్ సబ్‌మెరైన్ పనులను కూడా హెచ్ఎస్ఎల్ దక్కించుకుంది. 25 ఎకరాల్లో విస్తరణ పనులు షిప్‌యార్డుకు సమీపంలో ఉన్న 25 ఎకరాల్లో విస్తరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పరిశ్రమల శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇప్పటికే క్షేత్రస్థాయి పనులను కూడా మొదలు పెట్టింది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ తయారీకి అవసరమయ్యేలా 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో స్లిప్వేని 2024 ఆగస్టు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒకేసారి 3 నుంచి 4 నౌకలు తయారు చేసేలా మరో స్లిప్‌వే నిర్మాణానికి అడుగులు వేస్తోంది. రూ.1000 కోట్ల టర్నోవర్ లక్ష్యం దేశంలోని 14 షిప్‌యార్డులతో పోల్చి చూస్తే హెచ్ఎస్ఎల్ నాలుగో స్థానంలో ఉంది. రానున్న రెండేళ్లలో కోల్‌కతా షిప్‌యార్డ్‌ను అధిగమించి మూడుకి చేరుకోవాలనే టార్గెట్‌ను నిర్దేశించుకున్నాం. రాబోయే నాలుగేళ్లలో నంబర్ వన్‌గా నిలిచేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే షిప్ బిల్డింగ్‌లో అనేక పురోగతి సాధించాం. షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.755 కోట్లు టర్నోవర్ సాధించాం. ఈ ఏడాది రూ.1000 కోట్లు మార్కు చేరుకుంటాం. హైవాల్యూస్‌తో చేపట్టనున్న నేవీ నౌకల నిర్మాణాలతో హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరగనుంది. ఇదే ఊపుతో స్వదేశీ పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ను తయారు చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. మూడేళ్లుగా దీనిపై కసరత్తు చేస్తున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై ఇటీవలే చర్చించింది. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. ఇది వస్తే విశాఖపట్నం బూమ్ ఒక్కసారిగా పెరుగుతుంది. – కమాండర్ హేమంత్ ఖత్రీ, హిందూస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీ -
మహానేత సాయం: ఆ ఉత్తరం విద్యార్థి జీవితాన్ని మార్చేసింది
సాక్షి, విశాఖపట్పం: ప్రతి మనిషి పుట్టడం కాలం చెల్లించడం ఖాయం. కానీ ఆ మధ్య కాలంలో చేసిన పనులు చిరస్థాయిగా నిలుస్తాయి. మంచి పనులు చేసిన వారు మహానుభావులుగా నిలుస్తారు. ఆ కోవలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు ఓ కుటుంబాన్ని సమూలంగా మార్చేసింది. ఇంటర్మీడియట్ చదవడానికి వైఎస్ చేసిన సహాయంతో ఎంటెక్ పూర్తి చేసి ఒక ఉన్నత ఉద్యోగిగా మారిన ఓ యువకుడి పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన మజ్జి శంకర్రావు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శాంతి కుమార్ 2003 గుడిలో పదవ తరగతి 476 మార్కులతో పాసయ్యారు. ఇంటర్ చదవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ పురస్కారం ఐదు వేల రూపాయలు పొందడానికి అవకాశం ఉన్నప్పటికి అతడికి ఆ సాయం లభించలేదు. ఎన్నిసార్లు విద్యాశాఖకు లేఖ రాసిన స్పందన లేదు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వెంటనే వైఎస్సార్ ప్రభుత్వానికి లేఖ రాసి ప్రతిభ పురస్కారం అందేలా చేశారు. ఆ తర్వాత శాంతి కుమార్ బాగా చదువుకుని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఎంటెక్ పూర్తి చేసి.. విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఎంపికయ్యారు. మహా నేత చేసిన సహాయం వృధా కాకూడదని అందరికీ సహాయపడటమే కాక ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంత కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. -
క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం: వినయ్ చంద్
సాక్షి, విశాఖపట్నం: క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల లోడ్‌కి సంబంధించి క్రేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు. (విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక) గేర్ బాక్స్ ఫెయిల్యూర్ వల్ల భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని, క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. క్రేన్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, సామర్థ్యానికి తగ్గట్లుగా క్రేన్ నిర్మాణం జరగలేదని తెలిపారు. నిపుణులతోనే తప్పనిసరిగా లోడ్ టెస్టింగ్ పరిశీలన జరపాలన్నారు. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని నిపుణులు సూచించారని తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. -
విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక
సాక్షి, విశాఖపట్నం : విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం నివేదిక అందించింది. షిప్ యార్డ్‌కు అనుపమ క్రేన్ ఇంజనీరింగ్ సంస్థ క్రేన్ సమకూర్చినట్లు తెలిపింది. కాగా హిందూస్తాన్ షిప్ యార్డులో ఆగష్టు 1న క్రేన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. (హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) ప్రమాదం జరిగిన వెంటనే ఘటన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాల తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. -
కుప్పకూలిన భారీ క్రేన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ పారిశ్రామిక నగరంలో విషాదం చోటుచేసుకుంది. నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం ఉ.11.50 గంటలకు భారీ క్రేన్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది విగతజీవులుగా మారారు. 70 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ శిథిలాల కింద చిక్కుకున్న వీరంతా విలవిల్లాడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు. షిప్‌యార్డు పూర్తి నిషేధాజ్ఞలున్న ప్రాంతం కావడంతో మృతుల కుటుంబాలను సైతం లోపలికి అనుమతించలేదు. మృతుల్లో నలుగురు షిప్‌యార్డుకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా క్రేన్ నిర్వహణకు సంబంధించి ఏజెన్సీ సిబ్బందిగా గుర్తించారు. ట్రయల్ రన్ జరుగుతుండగా.. భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలింది. నాలుగేళ్ల క్రితం షిప్‌యార్డు ‘వార్ఫ్/లెవల్ లఫింగ్ క్రేన్’ నిర్మాణానికి ముంబైకి చెందిన అనుపమ్ క్రేన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారీ లిఫ్టింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండేళ్ల క్రితం దీని కమిషనింగ్ పూర్తయింది. అయితే.. ఫుల్ లోడెడ్ ట్రయల్ అప్పట్లో నిర్వహించలేదు. కార్యకలాపాలు ప్రారంభించకుండానే సంస్థతో ఒప్పందం రద్దుచేసుకుంది. అప్పటి నుంచి క్రేన్ జెట్టీలోనే నిలిచిపోయింది. తాజాగా.. ఈ క్రేన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎస్ఎల్ (హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్).. గ్రీన్‌ఫీల్డ్స్ కార్పొరేషన్, లీడ్ ఇంజినీర్స్, క్వాడ్ సెవెన్ సెక్యూరిటీస్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలకు చెందిన సిబ్బందితో పాటు షిప్‌యార్డు రెగ్యులర్ ఉద్యోగులు మూడ్రోజుల నుంచి క్రేన్ సామర్థ్యానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువారం 10 టన్నుల బరువు.. శుక్రవారం 20 టన్నుల బరువును లిఫ్ట్చేసేలా ట్రయల్ రన్ చేపట్టారు. ఇక శనివారం 30 టన్నుల సామర్థ్యం ఎత్తేందుకు ప్రయత్నించగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్, బేస్ పోర్షన్లు రెండూ ఒక్కసారిగా విరిగిపోయాయి. ప్రమాద సమయంలో క్రేన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. క్రేన్ శి«థిలాల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికితీసేందుకు రక్షణ శాఖ సిబ్బందికి సుమారు రెండు గంటలు పట్టింది. షిప్‌యార్డు 75 ఏళ్ల చరిత్రలో ఈ తరహా ప్రమాదం సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఘటనపై మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదంపై విచారణకు కమిటీలు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రమాదానికి గల కారణాలు విచారించేందుకు రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. హెచ్ఎస్ఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కలిసి అంతర్గత కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వం తరఫున కూడా హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. దుర్ఘటనపై రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి దుర్ఘటనపై శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విటర్లో దిగ్భ్రాంతి, తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం విశాఖలో క్రేన్ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటన వివరాలను తెలుసుకున్న ఆయన తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. మృతులు వీరే.. షిప్‌యార్డు ఉద్యోగులు.. సూపర్వైజర్ దుర్గాప్రసాద్ (32), ఐజీసీ వెంకటరమణ (42), సత్తిరాజు (51), టి. జగన్మోహన్రావు (41). గ్రీన్‌ఫీల్డ్ కార్పొరేషన్ సిబ్బంది.. ఎంఎన్ వెంకట్రావు (35), పీలా శివకుమార్ (35), బి. చైతన్య (25). లీడ్ ఇంజినీర్స్ సంస్థ సిబ్బంది.. పల్లా నాగదేముళ్లు (35), పి.భాస్కరరావు (35). క్వాడ్–7 సంస్థ ఉద్యోగి టి. వెంకటరత్నం (43). ప్రస్తుతం 10 మంది మాత్రమే మృతిచెందినట్లు ఆర్డీవో పెంచల్ కిశోర్ చెప్పారు. శిథిలాలు కింద ఎవరూ లేరనీ.. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే.. ప్రమాదంపై హిందూస్థాన్ షిప్‌యార్డు స్పందించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అంటూ ప్రకటన విడుదల చేసింది. లోడ్ టెస్టింగ్ సమయంలో క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ప్రమాద కారణాలపై విచారణ చేపడుతున్నట్లు షిప్‌యార్డు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. -
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్
సాక్షి, విశాఖపట్నం: హిందూస్తాన్ షిప్ యార్డులో శనివారం భారీ క్రేన్ కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కుప్పకూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రేన్ పరిమాణం భారీగా ఉండటం, క్షణాల్లో కుప్పకూలడంతో దాని కింద ఉన్న కార్మికులు తప్పించుకునేందుకు వీలుపడలేదు. కళ్లు మూసి తెరిచేలోపల ఈ ప్రమాదం జరిగిపోయింది. ప్రమాద సమయంలో దాదాపు 18 మంది క్రేన్ కింద ఉన్నట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. (చదవండి : హిందుస్తాన్ షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. (చదవండి : హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం) -
వైరల్ : క్షణాల్లో కుప్పకూలిన భారీ క్రేన్
-
షిప్ యార్డు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విశాఖపట్నం : హిందుస్తాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ నుంచి విశాఖకు బయలుదేరారు. కాగా క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(క్రేన్ కూలి 11 మంది కార్మికులు మృతి) -
ఉద్యోగులవల్లే లాభాల్లోకి..
విశాఖపట్నం (పాత పోస్టాఫీసు), సాక్షి: ఉద్యోగుల సమష్టి కృషి వల్లే హిందుస్తాన్ షిప్‌యార్డ్ తిరిగి గాడిలో పడిందని సంస్థ సీఎండీ, రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్.వి.శరత్‌బాబు చెప్పారు. సంస్థ 66వ వార్షిక సాధారణ సమవేశం నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా సంస్థ ఉద్యోగులంతా కష్టపడి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి నడిపించడం అభినందనీయమన్నారు. ‘‘2015లో రూ.202 కోట్ల నష్టం వచ్చింది. అప్పుడు సంస్థ నెగెటివ్ నెట్‌వర్త్ రూ.1,231.51 కోట్లు. దాన్ని 2018లో రూ.619.43 కోట్లకు తగ్గించాం. 2014–15లో రూ.294 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2015–16లో రూ.593 కోట్లకు, 2016–17లో రూ.629 కోట్లకు, 2017 – 18లో రూ.645 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ.37.49 కోట్లుగా ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 2017–18లో రూ.69.80 కోట్లకు పెరిగిం ది. 2017–18 ఆర్థిక సంవ్సరంలో సంస్థ రూ.645 కోట్ల టర్నోవర్‌ను, రూ.20.99 కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించాం’’ అని వివరించారు. ఆశావహంగా భవిష్యత్తు భారత నేవీకి సంబంధించిన భారీ టెండర్లలో పాల్గొని రూ.2,250 కోట్ల విలువైన రెండు డైవింగ్ సపోర్ట్ నౌకలు, నాలుగు 50 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్స్ నిర్మాణానికి టెండర్‌ను దక్కించుకున్నట్లు శరత్‌బాబు తెలియజేశారు. నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నంతో రూ.10 కోట్ల విలువైన 4 పాంటూన్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో రూ.9వేల కోట్ల విలువైన 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకల నిర్మాణానికి టెండరును దక్కించుకున్నామని, 2019 డిసెంబరు నాటికి పనులు మొదలు పెడతామని చెప్పారాయన. 2020లో సంస్థకు మినీ రత్న హోదాను తెచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేస్తున్నారని చెప్పారాయన. సమావేశంలో ఈడీ (సీఅండ్‌పీ) రమేష్‌వర్మ, డైరెక్టర్ (ఎస్పీ) హేమంత్ కత్రి పాల్గొన్నారు. -
హిందుస్తాన్ షిప్‌యార్డ్ టర్న్ ఎరౌండ్
* 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్ల టర్నోవర్ * రూ.204 కోట్ల నష్టాన్ని అధిగమించి రూ.20 కోట్ల లాభం * 30 ఏళ్ల తరువాత లాభాల్లోకి * షిప్‌యార్డు చైర్మన్ శరత్‌బాబు * నేడు ప్లాటినం జూబ్లీ వేడుకలు సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగ హిందుస్తాన్ షిప్‌యార్డ్ టర్న్ ఎరౌండ్ అయ్యింది. మూడు దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్న హిందూస్తాన్ షిప్‌యార్డు ప్రస్తుతం లాభాల్లోకి వచ్చిందని ఆ సంస్థ సీఎండీ రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు సోమవారం ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్ల టర్నోవర్‌తో రూ.20 కోట్ల లాభం ఆర్జించామన్నారు. ఈ లాభం పెద్ద మొత్తం కాకపోయినా ఖాయిలా పరిశ్రమ అనే మచ్చను చెరిపేసుకున్నామన్నారు. 2014-15లో ఉన్న రు.204 కోట్ల నష్టాన్ని పూడ్చుకొని లాభాల్లోకి రావడమే గొప్ప విజయంగా భావిస్తున్నామన్నారు. 2018 నాటికి ఆర్థికంగా మరింత పుంజుకుంటామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చే నెలాఖరునాటికి తాము డెలివరీ చేసిన వెసల్స్ సంఖ్య తొమ్మిదికి చేరుతుందన్నారు. ఇంత తక్కువ కాలంలో అన్ని ఆర్డర్లను పూర్తి చేయడం ఏ సంస్థకీ సాధ్యం కాదన్నారు. గత మూడు నెలల్లో ఉత్పత్తిని మూడు రెట్లు పెంచామన్నారు. ప్రస్తుతం తమవద్ద రూ.1200 కోట్ల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా విమాన విన్యాసాల మద్దతుకు సంబంధించిన రూ.9వేల కోట్ల విలువైన ఐదు నౌకల వర్క్ ఆర్డర్ ఒప్పందాలు కూడా పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడెనిమిదేళ్లలో రూ.20 వేల కోట్ల ఆర్డర్లు సాధించేందుకు నామినేషన్లు పూర్తి చేశామన్నారు. కొరియా సహకారంతో ఆధునికీకరణ కొరియా షిప్‌యార్డు భాగస్వామ్యంతో సంస్థ ఆధునికీకరణ పనులను చేపట్టనున్నామని సీఎండీ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. షిప్‌యార్డుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇ-75 సబ్‌మెరైన్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. సింధువీర్ సబ్‌మెరైన్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామ చెప్పారు. హుద్‌హుద్ వల్ల తమ సంస్థ రూ.200 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు షిప్‌యార్డు 75 వసంతాల వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నామని సీఎండీ చెప్పారు. 1941 నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో 177 నౌకలు నిర్మించగా, 1950 నౌకలకు మరమ్మతులు చేశామని వివరించారు. జల ఉష నౌకతో ప్రస్థానం ప్రారంభించిన సంస్థ ‘మినిమైజ్ కాస్ట్.. మేగ్జిమైజ్ అవుట్‌పుట్’ అన్న నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. సమావేశంలో డెరైక్టర్లు కమెడోర్ పిహెచ్.ఎం.సలీహ్, కమెడోర్ అశోక్భల్, ఎం.నాగరాజ్, సీజీఎం ఎస్.రమేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.