విశాఖపట్నం (పాత పోస్టాఫీసు), సాక్షి: ఉద్యోగుల సమష్టి కృషి వల్లే హిందుస్తాన్ షిప్‌యార్డ్ తిరిగి గాడిలో పడిందని సంస్థ సీఎండీ, రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్.వి.శరత్‌బాబు చెప్పారు. సంస్థ 66వ వార్షిక సాధారణ సమవేశం నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా సంస్థ ఉద్యోగులంతా కష్టపడి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి నడిపించడం అభినందనీయమన్నారు.
‘‘2015లో రూ.202 కోట్ల నష్టం వచ్చింది. అప్పుడు సంస్థ నెగెటివ్ నెట్‌వర్త్ రూ.1,231.51 కోట్లు. దాన్ని 2018లో రూ.619.43 కోట్లకు తగ్గించాం. 2014–15లో రూ.294 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2015–16లో రూ.593 కోట్లకు, 2016–17లో రూ.629 కోట్లకు, 2017 – 18లో రూ.645 కోట్లకు పెరిగింది. గత ఏడాది రూ.37.49 కోట్లుగా ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 2017–18లో రూ.69.80 కోట్లకు పెరిగిం ది. 2017–18 ఆర్థిక సంవ్సరంలో సంస్థ రూ.645 కోట్ల టర్నోవర్‌ను, రూ.20.99 కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించాం’’ అని వివరించారు.
ఆశావహంగా భవిష్యత్తు
భారత నేవీకి సంబంధించిన భారీ టెండర్లలో పాల్గొని రూ.2,250 కోట్ల విలువైన రెండు డైవింగ్ సపోర్ట్ నౌకలు, నాలుగు 50 టన్నుల బొల్లార్డ్ పుల్ టగ్స్ నిర్మాణానికి టెండర్‌ను దక్కించుకున్నట్లు శరత్‌బాబు తెలియజేశారు. నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నంతో రూ.10 కోట్ల విలువైన 4 పాంటూన్స్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో రూ.9వేల కోట్ల విలువైన 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకల నిర్మాణానికి టెండరును దక్కించుకున్నామని, 2019 డిసెంబరు నాటికి పనులు మొదలు పెడతామని చెప్పారాయన. 2020లో సంస్థకు మినీ రత్న హోదాను తెచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేస్తున్నారని చెప్పారాయన. సమావేశంలో ఈడీ (సీఅండ్‌పీ) రమేష్‌వర్మ, డైరెక్టర్ (ఎస్‌పీ) హేమంత్ కత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment