న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ టర్న్‌అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 475 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 268 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,111 కోట్ల నుంచి రూ. 17,776 కోట్లకు జంప్‌చేసింది.
ప్రస్తుత సమీక్షా కాలంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ కొంతమేర సవాళ్లు విసిరినప్పటికీ.. గతేడాది క్యూ1 పరిస్థితులతో పోలిస్తే ప్రభావం తక్కువేనని కంపెనీ పేర్కొంది. దీంతో ఫలితాలు పోల్చలేమని వ్యాఖ్యానించింది. సుజుకీ మోటార్ కార్పొరేషన్ బోర్డు నుంచి జూన్‌లో పదవీ విరమణ చేసిన ఒసాము సుజుకీని గౌరవ చైర్మన్‌గా గుర్తిస్తున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. కంపెనీకి అందించిన సేవలకు ఈ గుర్తింపునిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ విజయంలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన ఒసాము మారుతీ బోర్డులో కొనసాగనున్నట్లు తెలియజేసింది.
అమ్మకాలు జూమ్: క్యూ1లో మారుతీ మొత్తం 3,53,614 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 76,599 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. దేశీయం గా 3,08,095 వాహనాలు అమ్ముడుపోగా.. 45,519 యూనిట్ల ఎగుమతులు సాధించింది. గత క్యూ1లో ఈ సంఖ్యలు వరుసగా 67,027, 9,572గా నమోదయ్యాయి. కాగా.. స్టాండెలోన్ పద్ధతిలోనూ మారుతీ రూ. 441 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 249 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అమ్మకాలపై సెకండ్ వేవ్ ప్రభావం, భారీగా పెరిగిన కమోడిటీ ధరలు క్యూ1 లాభాలను పరిమితం చేసినట్లు మారుతీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. అయితే వ్యయాలను తగ్గిం చే చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 1.3 శాతం వెనకడుగుతో రూ. 7,145 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment