నెలాఖరుకల్లా ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా ఆయిల్ దిగ్గజం ఐవోసీలో 10% వాటాను ఈ నెలాఖరుకల్లా విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ఏడాదిలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖ బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఐవోసీలో వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ఈ నెలాఖరుకల్లా ఐవోసీలో 10% వాటాను విక్రయించడం ద్వారా ఇంజినీర్స్ ఇండియా తదితర సంస్థల డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఊపుతేవాలని యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, కంపెనీ షేరు ధర కనిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఇటు కంపెనీ, అటు పెట్రోలియం శాఖ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత శుక్రవారం బీఎస్‌ఈలో ఐవోసీ షేరు రూ. 213 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి 10% వాటాకుగాను రూ. 4,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. కంపెనీలో ప్రభుత్వానికి 78.92% వాటా ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వం సిటీబ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీసహా ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది కూడా.