
ఐవోసీకి ఇన్వెంటరీ నష్టాలు
► క్యూ1లో లాభం 45 శాతం క్షీణత
► రూ.4,548 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) జూన్ త్రైమాసికంలో లాభం 45 శాతం తగ్గింది. ఇన్వెంటరీ నష్టాలు రిఫైనరీ మార్జిన్లను మింగేయడంతో లాభం 4,548 కోట్లకు పరిమితమైంది. షేరువారీ ఆర్జన రూ.9.60గా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.8,269 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం మాత్రం 1,07,671 కోట్ల నుంచి రూ.1,29,418 కోట్లకు పెరిగింది. లాభంలో ఈ వ్యత్యాసం ఇన్వెంటరీ నష్టాల వల్లనేనని ఐవోసీ చైర్మన్ సంజీవ్‌సింగ్ తెలిపారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడంతో, దేశీయంగా చమురు నిల్వలపై రూ.4,042 కోట్లను నష్టపోవాల్సి వచ్చింది. క్రూడ్ ఆయిల్‌పై రూ.2,033 కోట్లు, ఉత్పత్తులపై రూ.2,009 కోట్ల నష్టాలు వచ్చాయి. చమురును కొనుగోలు చేసిన తర్వాత, దాన్ని శుద్ధి చేసి మార్కెటింగ్ చేసే సమయంలో ధర తగ్గితే ఏర్పడే నష్టాలను ఇన్వెంటరీ నష్టాలుగా పేర్కొంటారు. ఒకవేళ కొనుగోలు చేసిన తర్వాత విక్రయించే ధర అధికంగా ఉంటే ఇన్వెంటరీ లాభాలుగా చూపుతారు.
ఇక ఒక్కో బ్యారెల్ చమురు శుద్ధిపై 4.32 డాలర్లను మార్జిన్‌గా పొందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో మార్జిన్ 9.98 డాలర్లు కావడం గమనార్హం. 20.736 మిలియన్ టన్నుల ఇంధనాన్ని జూన్ క్వార్టర్లో దేశీయ మార్కెట్లో విక్రయించినట్టు సంజీవ్‌సింగ్ తెలిపారు. విదేశీ మార్కెట్లలో 1.772 మిలియన్ టన్నుల విక్రయాలు జరిగినట్టు చెప్పారు. కిరోసిన్‌ను మార్కెట్ ధరకంటే తక్కువకు విక్రయించడం వల్ల ప్రభుత్వం నుంచి రూ.876 కోట్ల సబ్సిడీ భారం పడింది. కంపెనీ రుణభారం జూన్ క్వార్టర్లో రూ.54,820 కోట్ల నుంచి రూ.34,922 కోట్లకు తగ్గడం సానుకూలాంశం.