2023–24లో రూ. 1,299 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయి. రూ.1,299 కోట్లను అధిగమించాయి. అమ్మకాలు 4.5 శాతం బలపడి రూ. 1,810 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1,853 కోట్లయ్యింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది(2022–23) రూ. 1,732 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 1,133 కోట్ల నష్టం ప్రకటించింది. నెదర్లాండ్స్ దిగ్గజం ఇంకా హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థ ఇది.
ఓమ్నిచానల్ ద్వారా కార్యకలాపాల విస్తరణ కోసం భారీ పెట్టుబడులు చేపట్టడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ధరలు పెంచకపోగా.. కొన్ని ప్రొడక్టులపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు పెంచుకోగలిగినట్లు ఐకియా ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చులు 2 శాతం అధికమై రూ. 196 కోట్లను దాటాయి. గతేడాది మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 3,152 కోట్లను తాకాయి. అంతక్రితం ఏడాది రూ. 2,895 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. కంపెనీ హైదరాబాద్, నవీముంబై, బెంగళూరు తదితర నగరాలలో లార్జ్‌ఫార్మాట్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈకామర్స్ కార్యకలాపాల ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment