ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్ డినామినేషన్ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు మూడీస్ సంస్థ బీఏఏ2 రేటింగ్‌ను, ఫిచ్ రేటింగ్స్ సంస్థ ట్రిపుల్ బి మైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. వాటాదారుల రాబడులు, మూలధన పెట్టుబడులు అధికంగా ఉన్నా, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ఐఓసీకి మంచి రేటింగే ఇచ్చామని మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలన్ చెప్పారు. ఇటీవలే ఈ కంపెనీ రూ.12,300 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిందని, నికర రుణాలను మరింతగా పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఐఓసీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో తోడ్పాటు అందుతోందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment