Oil marketing
-
అమెరికా అడిగినా పట్టించుకోలేదు! పుతిన్ అడగ్గానే..
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా మాటల్ని, అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికల్ని మొదటి నుంచి పెడచెవిన పెడుతున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా ఆయిల్ మార్కెట్ వ్యవహారాలపై చర్చలు నడిపింది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ను స్థిరపరిచేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఓపెక్ప్లస్ ఉత్పత్తి గ్రూపుతో సమన్వయం కొనసాగించనున్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యలు మొదలయ్యాక.. పుతిన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేరుగా ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో.. సౌదీ అరేబియా , ఇతర ప్రధాన పర్షియన్ గల్ఫ్ దేశాలను చమురు ఉత్పత్తులు పెంచాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును అవి ప్రతిఘటించాయి.ఇందుకు అమెరికా, రష్యాపై విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమే!. అయితే పుతిన్‌తో శనివారం, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌తో శుక్రవారం వరుస చర్చలు జరిపిన సౌదీ క్రౌన్ ప్రిన్స్.. ఆయిల్ మార్కెట్ నియంత్రణకు ప్రయత్నిస్తామన్న హామీ ఇవ్వడం విశేషం. చమురు ధరల నియంత్రణతో పాటు అమెరికాకు చిర్రెత్తిపోయేలా ద్వైపాక్షిక ఒప్పందాలకు గురించి కూడా.. సౌదీ-రష్యాల మధ్య చర్చలు జరిగినట్లు సౌదీ అధికారిక వర్గాలే ఒక ప్రకటనలో ప్రస్తావించడం గమనార్హం. -
బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్’ ముప్పు!
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్ బి మైనస్ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని, ఇది కంపెనీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ తెలిపింది. కొనుగోలు చేసే సంస్థ ప్రభుత్వ రంగంలోనిదా లేక ప్రైవేట్ కంపెనీయా అన్న దానిపై బీపీసీఎల్ క్రెడిట్ రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని మూడీస్ వెల్లడించింది. బీపీసీఎల్‌లో ఉన్న మొత్తం 53.29 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సెప్టెంబర్ 30న జరిగిన సమావేశంలో కార్యదర్శుల బృందం ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ప్రస్తుత షేరు ధరల ప్రకారం బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 57,500 కోట్లకు పైగా ఉంటుంది. సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్లకు సంబంధించి బీపీసీఎల్ 1.7 బిలియన్ డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. కంపెనీ ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బాగా లేదు. ఇలాంటప్పుడు విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి చెల్లించాల్సి వస్తే బీపీసీఎల్‌కు రీఫైనాన్సింగ్‌పరమైన రిస్కులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2019 మార్చి ఆఖరు నాటికి బీపీసీఎల్ దగ్గర రూ. 5,300 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉండగా.. వచ్చే 15 నెలల్లో రూ. 10,900 కోట్ల మేర రుణాలను చెల్లించాల్సి రానుంది. -
150 కోట్ల డాలర్లు సమీకరించనున్న ఐఓసీ
ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్ డినామినేషన్ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు మూడీస్ సంస్థ బీఏఏ2 రేటింగ్‌ను, ఫిచ్ రేటింగ్స్ సంస్థ ట్రిపుల్ బి మైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. వాటాదారుల రాబడులు, మూలధన పెట్టుబడులు అధికంగా ఉన్నా, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ఐఓసీకి మంచి రేటింగే ఇచ్చామని మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలన్ చెప్పారు. ఇటీవలే ఈ కంపెనీ రూ.12,300 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిందని, నికర రుణాలను మరింతగా పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఐఓసీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో తోడ్పాటు అందుతోందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. -
దేశవ్యాప్తంగా 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. చిన్న స్థాయిలో ఏర్పాటయ్యే 60 ప్రైవేట్ బాట్లింగ్ ప్లాŠంట్లలో ఇండియన్ ఆయిల్ 21 ప్లాంట్లను, భారత్ పెట్రోలియం 20, హిందుస్తాన్ పెట్రోలియం 19 ప్లాంట్ల సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. సాధారణ బాట్లింగ్ యూనిట్ వార్షిక సామర్ద్యం 1,20,000 టన్నులుగా ఉంటుండగా, ప్రైవేట్ రంగంలోని చిన్న బాట్లింగ్ ప్లాంట్ల సామర్ధ్యం వార్షికంగా 30,000 టన్నులుగా ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ వినియోగం వచ్చే ఏడాది 6–8 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఇప్పటిదాకా ఇండియన్ ఆయిల్ 2.75 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆసియాపై ‘ చమురు ధరా భారం’ పెంచకండి
వియన్నా: చమురు విక్రయాలపై ఆసియా కొనుగోలుదారుల నుంచి ‘ప్రీమియం’ వసూలు చేయవద్దన్న తన దశాబ్దకాల డిమాండ్‌ను భారత్ మళ్లీ ఒపెక్ ముందు ఉంచింది. ఇలాంటి చర్యలు భారత్ వంటి దేశాలపై అధిక భారాన్ని మోపుతాయని చమురు వ్యవహారాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాలకు సబ్సిడీలు ఇవ్వడం కోసం ఆసియా దేశాలపై అధిక ప్రీమియం వడ్డన తగదని అన్నారు. ఇక్కడ జరిగిన ఇండియా–ఒపెక్ 2వ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘‘బాధ్యతాయుత ధరల’’ విధానాన్ని అవలంభించడానికి ఒపెక్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల సామాన్య ప్రజలకూ ఇంధనాన్ని అందుబాటులో ఉంచడానికి భారీ చమురు వినిమయ దేశాలకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. ‘‘2016లో నేను 6వ ఒపెక్ అంతర్జాతీయ సెమినార్‌కు హాజరయినప్పుడు –ఆసియాపై ప్రీమియం కాదు. ఆసియాకు డివిడెండ్– అనే అంశాన్ని నేను ప్రస్తావించాను. ఇప్పుడే ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మణిశంకర్ అయ్యర్ చమురు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ‘‘ప్రీమియం’’ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినా, దీనిపై ఒపెక్ స్పందించకపోవడం గమనార్హం. ఆసియా మార్కెట్లను ప్రధాన మార్కెట్‌గా పరిగణించాలని కోరుతూ తాజాగా ప్రదాన్ చేసిన విజ్ఞప్తి ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. -
మార్చి నాటికి 50% నగదు రహిత విక్రయాలే
భారత్ పెట్రోలియం వెల్లడి ముంబై: ప్రభుత్వరంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చే మార్చి నాటికి తమ మొత్తం విక్రయాల్లో 50 శాతం నగదు రహితంగానే జరపాలని భావిస్తున్నాయి. నవంబర్ 8 తర్వాత తమ అవుట్లెట్లలో డిజిటల్ లావాదేవీలు అంతకుముందున్న 10 శాతం నుంచి 26 శాతానికి పెరిగినట్టు బీపీసీఎల్ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ/పీఎన్జీ, ఎల్పీజీ విక్రయాలకు సంబంధించి ఏటా 7.3 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు పేర్కొంది. మార్చి చివరి నాటికి అన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ లావాదేవీల్లో 50 శాతానికి పైగా లాయల్టీ కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వ్యాలెట్లు, ఎన్ఈఎఫ్టీ ద్వారా జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జార్జ్‌పాల్ సోమవారం ఢిల్లీలో తెలిపారు. నగదు రహిత లావాదేవీలను పెంచే లక్ష్యంలో భాగంగా తమ అవుట్లెట్లలో పీఓఎస్ మెషిన్ల ఏర్పాటుకు బీపీసీఎల్... ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు తదితర బ్యాంకులతో సోమవారం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే పేటీఎం, ఫ్రీచార్జ్, ఆక్సిజెన్, రిలయన్స్జియో, ఎస్బీఐ బుడ్డీ, ఫినో తదితర మొబైల్ వ్యాలెట్లతోనూ భాగస్వామ్యం ఉన్నట్టు బీపీసీఎల్ వెల్లడించింది. -
హెచ్‌పీసీఎల్ బోనస్ షేర్లు...
ప్రతి రెండు షేర్లకు ఒక షేరు జారీ.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. ఇన్వెస్టర్ల వద్ద ఉన్న రూ.10ముఖ విలువ గల ఒకో షేరుకు 2 షేర్లను బోనస్‌గా ఇవ్వనున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ బోనస్ షేర్ల ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,500 కోట్లకు పెంచుకోవడానికి, రిజర్వ్‌లను మూలధనంగా మార్చుకోవడానికి గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా ముంబై రిఫైనరీ వార్షిక సామర్థ్యాన్ని 6.6 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకోవడానికి కూడా డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. కాగా విశాఖ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునే రూ.20,928 కోట్ల పెట్టుబడి ప్రణాళికకు డెరైక్టర్ల బోర్డ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బోనస్ షేర్ల జారీ, ముంబై రిఫైనరీ విస్తరణ తదితర వార్తల కారణంగా హెచ్‌పీసీఎల్ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని(రూ.1,233) తాకింది. చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,161 వద్ద ముగిసింది. -
వంట గ్యాస్ సబ్సిడీకి మళ్లీ నగదు బదిలీ
వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలుచేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగ దారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. శనివారం నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ ఇందుకు గడువు విధించారు. వినియోగదారులు ఆధార్‌తో పాటు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ప్రక్రియను గడువులోపల పూర్తిచేసుకోవాలి. అలా చేయకపోతే వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందదు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. చిత్తూరు : జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 32 ఏజెన్సీలుండగా 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులున్నారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇక భారత్ గ్యాస్‌కు సంబంధించి 19 ఏజెన్సీలుండగా, 96,100 మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటివరకు ఆధార్ సీడింగ్ జరగనవి ఇండేన్‌కు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వద్ద 3,59,475 (89శాతం) మంది వినియోగదారులు ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోగా, బ్యాంకుల్లో మాత్రం 3,25,446 (80.57 శాతం) మందే అకౌంట్లు పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 2,48,023 మంది (92.07శాతం) ఏజెన్సీ వద్ద ఆధార్‌సీడింగ్ పూర్తిచేసుకోగా, బ్యాంకుల్లో 1,84,791 (83.62శాతం) మాత్రమే అకౌంట్లు పూర్తి చేశారు. భారత్ గ్యాస్‌కు సంబంధించి 89,948 (93.65శాతం) మంది ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా, 77,303 (80.37శాతం) మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేశారు. మూ డు ఏజెన్సీల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 71 ఏజెన్సీల పరి ధిలో 7,20,991 మంది వంట గ్యాస్ వినియోగదారులుం డగా వీరిలో 6,54,246 మంది గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధా ర్ సీడింగ్ పూర్తిచేసుకోగా ఇక 5,87,540 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలను పూర్తి చేశారు. ఈ లెక్కన గ్యాస్ ఏజెన్సీలవద్ద సరాసరి 90.85 శాతం మంది వినియోగాదారులు ఆధార్ సీడింగ్ పూర్తిచేసుకోగా, 82.01 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తి చేశారు. మిగిలిన వారు ఆధార్ సీడింగ్ పూర్తిచేయలేదు. సీడింగ్ పూర్తై వారికే సబ్సిడీ వంటగ్యాస్ వినియోగానికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ సీడింగ్‌తోపాటు బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసిన వారికే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. ఏ ఒక్కటి చేయకపోయినా వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ వర్తించదు. ప్రక్రియ పూర్తిచేయని వారు గ్యాస్ మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేయడం ఎలా? వినియోగదారులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సంబంధిత వంటగ్యాస్ ఏజెన్సీలో అందజేయాలి. ఆ తరువాత గ్యాస్ ఏజెన్సీ వారి వద్ద ఫారం -3 నమూనాను తీసుకుని, అందులో తాము వినియోగిస్తున్న గ్యాస్‌కు సంబంధించిన 17 అంకెలతో కూడిన కన్స్యూమర్ ఐడీ నెంబ ర్ను నింపాలి. దాంతోపాటు గ్యాస్ కేటాయింపునకు సంబంధించిన రశీదును జత చేసి బ్యాంకుకు సమర్పించాలి. ఈ ప్రక్రియకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అవసరం లేదు. ఆధార్ కార్డు లేనివారు వారు ఫారం -3 ద్వారా బ్యాంకులో అకౌంట్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉన్న వారు కార్డు జిరాక్స్కాపీనీ బ్యాంకులో అందజేయవచ్చు. ఫారం-3 నమూనాలు సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆధార్ మాత్రమే ఇచ్చి బ్యాంకు అకౌంట్లు చేయని వారు ఫారం -3 ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అందరూ ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 14వ తేదీలోపు వినియోగదారులు పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఫారం -3 ద్వారా ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. శనివారం నుంచే వినియోగదారులు గ్యాస్‌కు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీ మొత్తం బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. సబ్సిడీ మొత్తం ఎంత అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. - ఎంవీ సత్యప్రసాద్, ఎల్పీజీ డెప్యూటీ సేల్స్ మేనేజర్ గ్యాస్ ధరలపై స్పష్టత రాలేదు గ్యాస్ సిలెండర్ ధర తోపాటు సబ్సిడీ ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం ఆధార్ సీడింగ్‌లో భాగంగా సిలెండర్‌కు పూర్తి ధర చెల్లించాల్సిందే. ఫిబ్రవరి 14 లోపల ఆధార్ సీడింగ్ చేయకపోతే సబ్సిడీ పొందే అవకాశం కోల్పోతారు. వినియోగదారులు జాగ్రత్తపడి బ్యాంకుల్లో అకౌంట్లు పూర్తిచేసుకోవాలి. ప్రభుత్వం వినియోగదారుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి,గ్యాస్ డీలర్స్ అసోషియేషన్