ఆసియాపై ‘ చమురు ధరా భారం’ పెంచకండి
వియన్నా: చమురు విక్రయాలపై ఆసియా కొనుగోలుదారుల నుంచి ‘ప్రీమియం’ వసూలు చేయవద్దన్న తన దశాబ్దకాల డిమాండ్‌ను భారత్ మళ్లీ ఒపెక్ ముందు ఉంచింది. ఇలాంటి చర్యలు భారత్ వంటి దేశాలపై అధిక భారాన్ని మోపుతాయని చమురు వ్యవహారాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాలకు సబ్సిడీలు ఇవ్వడం కోసం ఆసియా దేశాలపై అధిక ప్రీమియం వడ్డన తగదని అన్నారు. ఇక్కడ జరిగిన ఇండియా–ఒపెక్ 2వ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘‘బాధ్యతాయుత ధరల’’ విధానాన్ని అవలంభించడానికి ఒపెక్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనివల్ల సామాన్య ప్రజలకూ ఇంధనాన్ని అందుబాటులో ఉంచడానికి భారీ చమురు వినిమయ దేశాలకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. ‘‘2016లో నేను 6వ ఒపెక్ అంతర్జాతీయ సెమినార్‌కు హాజరయినప్పుడు –ఆసియాపై ప్రీమియం కాదు. ఆసియాకు డివిడెండ్– అనే అంశాన్ని నేను ప్రస్తావించాను. ఇప్పుడే ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
మణిశంకర్ అయ్యర్ చమురు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ‘‘ప్రీమియం’’ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించినా, దీనిపై ఒపెక్ స్పందించకపోవడం గమనార్హం. ఆసియా మార్కెట్లను ప్రధాన మార్కెట్‌గా పరిగణించాలని కోరుతూ తాజాగా ప్రదాన్ చేసిన విజ్ఞప్తి ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.