హెచ్పీసీఎల్ బోనస్ షేర్లు...
ప్రతి రెండు షేర్లకు ఒక షేరు జారీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. ఇన్వెస్టర్ల వద్ద ఉన్న రూ.10ముఖ విలువ గల ఒకో షేరుకు 2 షేర్లను బోనస్‌గా ఇవ్వనున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ బోనస్ షేర్ల ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,500 కోట్లకు పెంచుకోవడానికి, రిజర్వ్‌లను మూలధనంగా మార్చుకోవడానికి గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది.
అంతే కాకుండా ముంబై రిఫైనరీ వార్షిక సామర్థ్యాన్ని 6.6 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకోవడానికి కూడా డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. కాగా విశాఖ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునే రూ.20,928 కోట్ల పెట్టుబడి ప్రణాళికకు డెరైక్టర్ల బోర్డ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బోనస్ షేర్ల జారీ, ముంబై రిఫైనరీ విస్తరణ తదితర వార్తల కారణంగా హెచ్‌పీసీఎల్ షేర్ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని(రూ.1,233) తాకింది. చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,161 వద్ద ముగిసింది.