న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ రిటైల్ పీఎస్‌యూ.. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) తొలిసారి వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఇందుకు కంపెనీ నిర్వహించిన తాజా సమావేశంలో బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా కేటాయించనుంది.
తద్వారా వాటాదారులకు రివార్డుతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ వాటా మూలధనం రెట్టింపు కానుంది. రూ. 140 కోట్ల నుంచి రూ. 280 కోట్లకు పెరగనుంది. కంపెనీ వద్దగల రూ. 8,412 కోట్ల రిజర్వు నిధుల నుంచి బోనస్ ఈక్విటీ(రూ. 140 కోట్లు) నిధులను సమకూర్చుకోనుంది. తదుపరి దశలో ప్రకటించనున్న రికార్డ్ డేట్ ప్రకారం రెండు నెలల్లోగా బోనస్ షేర్లను కేటాయించే వీలున్నట్లు ఐజీఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.
గ్యాస్ పంపిణీ ఇలా
దేశీయంగా సిటీ గ్యాస్ పంపిణీలో అతిపెద్ద రిటైలర్‌గా నిలుస్తున్న ఐజీఎల్ ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ, పరిశ్రమలు, గృహాలకు పైప్‌డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ)ను సరఫరా చేస్తోంది. ఢిల్లీసహా సమీప ప్రాంతాలైన నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో సిటీ గ్యాస్ పంపిణీ బిజినెస్‌ను నిర్వహిస్తోంది. వీటితోపాటు హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ రిటైల్ గ్యాస్ సర్వీసులు అందిస్తోంది.
ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
సుమారు 882 స్టేషన్ల ద్వారా 1.7 మిలియన్ వాహనాలకు సీఎన్‌జీ సరఫరా చేస్తోంది. 2.5 మిలియన్ గృహాలకు పీఎన్‌జీ అందిస్తోంది. పీఎస్‌యూ దిగ్గజాలు గెయిల్(ఇండియా), బీపీసీఎల్‌తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ ఇది! బోనస్ వార్తల నేపథ్యంలో ఐజీఎల్ షేరు 1.6 శాతం లాభంతో రూ. 392 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment