సిటీ గ్యాస్‌కు మంచిరోజులు!
న్యూఢిల్లీ: సహజవాయువు కేటాయింపు విధానంలో సమూల మార్పులకు మోడీ సర్కారు తెరతీయనుంది. ఇప్పటివరకూ ఉన్న ప్రాధాన్యత రంగాల్లో త్వరలోనే భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ కేటాయింపుల్లో యూరియాను తయారుచేసే ఎరువుల ప్లాంట్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతర్వాత ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు వరుసలో ఉన్నాయి.
అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) ప్రాజెక్టులకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), అదేవిధంగా నగరాల్లో ఇళ్లకు నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ని సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వంటి సీజీడీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఇక నుంచి ముందుగా గ్యాస్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది. సీఎన్జీ, పీఎన్జీల వల్ల కాలుష్యం చాలావరకూ తగ్గుతుందని... అంతేకాకుండా సబ్సిడీతో విక్రయిస్తున్న డీజిల్, వంటగ్యాస్ల స్థానంలో వీటిని పెద్దమొత్తంలో అందించేందుకు వీలుందని ఆయావర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశీయంగా రోజుకు 77 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్ సరఫరాల్లో ఐజీఎల్ వంటి సీజీడీ సంస్థలకు 8.32 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తోంది. కొత్త నగరాల్లో కూడా సిటీ గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ రంగం వృద్ధికి వీలుగా ప్రభుత్వం కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిపాదిత కొత్త కేటాయింపుల విధానం ప్రకారం ఇప్పటివరకూ ప్రాధాన్య రంగాలకు కాకుండా ఇతర రంగాలకు చమురు శాఖ నిర్ణయించిన కేటాయింపుల నుంచి కోత విధించి సీజీడీకి అవసరమైన సరఫరాలకు మొదటి ప్రాధాన్యం కింద ఇవ్వనున్నారు.
సహజవాయువు నుంచి అధికంగా ఉపఉత్పత్తులను సంగ్రహించే ప్లాంట్లకు రెండో స్థానం లభించనుంది. ఇక అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి వ్యూహాత్మక రంగాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్లాంట్లకు కొత్త విధానంలో రెండో ప్రాధాన్య స్థానం దక్కనుంది. ఇక గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు నాలుగో స్థానం, విద్యుత్ ప్లాంట్లకు ఐదో ర్యాంక్ లభించనున్నాయి.
ఉత్పత్తి పడిపోవడంతో...
ప్రస్తుతం దేశీ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో సీజీడీ, ఎల్పీజీ రంగాలకు తప్ప ఇతర రంగాలన్నింటికీ కేటాయింపులను 2013-14 ఏడాదికి సరఫరా స్థాయిలవద్దే నిలిపేయాలని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2013-14లో ఎరువుల ప్లాంట్లకు 29.79 ఎంసీఎండీలు, విద్యుత్ ప్లాంట్లు 25.59, ఎల్పీజీ సంగ్రహణ ప్లాంట్లకు 1.83 ఎంసీఎండీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లకు 3.32, రిఫైనరీలకు 1.89, స్టీల్ ప్లాంట్లకు 1.32 ఎంసీఎండీల చొప్పున గ్యాస్ లభించింది.
కాగా, కేజీ-డీ6 తదితర నెల్ప్ బ్లాక్‌లు, గుజరాత స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(జీఎస్పీసీ)కు చెందిన దీన్‌దయాళ్ గ్యాస్‌ల నుంచి భవిష్యత్తులో పెరగనున్న ఉత్పత్తిని గతేడాది ఆగస్టు 23న సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యుత్ ప్లాంట్లకు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, మోడీ సర్కారు ఈజీఓఎంల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త ప్రాధాన్య రంగాల జాబితాలను కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) ఖరారు చేసి, త్వరలోనే తుది ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.