రానున్న రోజుల్లో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) బిజినెస్‌లో పోటీకి తెరతీసేందుకు వీలుగా నిబంధనలు విడుదల చేయనున్నట్లు పెట్రోలియం, సహజవాయు నియంత్రణ బోర్డ్(పీఎన్‌జీఆర్‌బీ) తాజాగా పేర్కొంది. దీంతో ఉన్నట్టుండి సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. 30-45 రోజుల్లో సీజీడీ ప్రాంతాలను నోటిఫై చేసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో లిస్టెడ్ కంపెనీలు మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు బలహీనపడ్డాయి. వివరాలు చూద్దాం..
కోవిడ్-19 ఎఫెక్ట్
కొత్తగా పోటీకి తెరతీసే విషయంలో గడువు ప్రకటించనప్పటికీ తొలుత ముంబై, ఢిల్లీలలో ఇందుకు అవకాశమున్నదని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది మహానగర్ గ్యాస్(ఎంజీఎల్), ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లపై కొంతమేర ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఎంజీఎల్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంతోపాటు.. రాయ్‌గఢ్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. అయితే కోవిడ్-19 కారణంగా ఇప్పటికే వృద్ధి అవకాశాలు నీరసించడంతో ఈ ఏడాది పెట్టుబడుల వ్యయాలను రూ. 400-500 కోట్లకు పరిమితం చేయనున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఏడాదికి 40 కొత్త గ్యాస్ స్టేషన్లను ప్రారంభిస్తూ ఐజీఎల్ నిలకడగా వృద్ధి సాధిస్తున్నట్లు ఎడిల్‌వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రాధాన్య రంగాలపై అధికంగా ఆధారపడటం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలియజేసింది.
నేలచూపులో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంజీఎల్ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1024 వరకూ వెనకడుగు వేసింది. ఇక ఐజీఎల్ షేరు 4.4 శాతం పతనమై రూ. 422 వద్ద కదులుతోంది. కాగా.. ఐజీఎల్ మార్చి 19న రూ. 284 వద్ద 52 వారాల కనిష్టాన్నీ, ఫిబ్రవరి 7న రూ. 534 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా ఎంజీఎల్ మార్చి 19న రూ. 664 వద్ద ఏడాది కనిష్టాన్నీ, జనవరి 30న రూ. 1246 వద్ద గరిష్టాన్నీ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment