City Gas Distribution (CGD) Project
-
ఆదాయమే మార్గంగా..బీపీసీఎల్ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపార విభాగాల విస్తరణపై ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. వార్షిక నివేదికలో బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. రిస్కులను తగ్గించుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలను సరి చేసుకుంటున్నామన్నారు. ద్రవ శిలాజ ఇంధనాల వ్యాపారం భవిష్యత్తులో క్షీణిస్తే హెడ్జింగ్ కోసం అదనంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను తీర్చిదిద్దుకుంటున్నామని, వివిధ విభాగాల్లో వ్యాపారాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని సింగ్ వివరించారు. ఇందుకోసం ఆరు ప్రధాన విభాగాలను (పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, వినియోగ వస్తువుల రిటైలింగ్, ఈ–మొబిలిటీ మొదలైనవి) ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్‌లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్‌లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్‌తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్‌లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
గ్యాస్ ఇన్ఫ్రాపై 60 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని నిర్దేశించుకున్నాం. గ్యాస్ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎన్జీ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్ఎన్జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
సిటీ గ్యాస్‌లో పోటీ- ఎంజీఎల్, ఐజీఎల్ వీక్
రానున్న రోజుల్లో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) బిజినెస్‌లో పోటీకి తెరతీసేందుకు వీలుగా నిబంధనలు విడుదల చేయనున్నట్లు పెట్రోలియం, సహజవాయు నియంత్రణ బోర్డ్(పీఎన్జీఆర్బీ) తాజాగా పేర్కొంది. దీంతో ఉన్నట్టుండి సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. 30-45 రోజుల్లో సీజీడీ ప్రాంతాలను నోటిఫై చేసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో లిస్టెడ్ కంపెనీలు మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు బలహీనపడ్డాయి. వివరాలు చూద్దాం.. కోవిడ్-19 ఎఫెక్ట్ కొత్తగా పోటీకి తెరతీసే విషయంలో గడువు ప్రకటించనప్పటికీ తొలుత ముంబై, ఢిల్లీలలో ఇందుకు అవకాశమున్నదని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది మహానగర్ గ్యాస్(ఎంజీఎల్), ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లపై కొంతమేర ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఎంజీఎల్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంతోపాటు.. రాయ్‌గఢ్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. అయితే కోవిడ్-19 కారణంగా ఇప్పటికే వృద్ధి అవకాశాలు నీరసించడంతో ఈ ఏడాది పెట్టుబడుల వ్యయాలను రూ. 400-500 కోట్లకు పరిమితం చేయనున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఏడాదికి 40 కొత్త గ్యాస్ స్టేషన్లను ప్రారంభిస్తూ ఐజీఎల్ నిలకడగా వృద్ధి సాధిస్తున్నట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రాధాన్య రంగాలపై అధికంగా ఆధారపడటం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలియజేసింది. నేలచూపులో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎంజీఎల్ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 1032 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1024 వరకూ వెనకడుగు వేసింది. ఇక ఐజీఎల్ షేరు 4.4 శాతం పతనమై రూ. 422 వద్ద కదులుతోంది. కాగా.. ఐజీఎల్ మార్చి 19న రూ. 284 వద్ద 52 వారాల కనిష్టాన్నీ, ఫిబ్రవరి 7న రూ. 534 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా ఎంజీఎల్ మార్చి 19న రూ. 664 వద్ద ఏడాది కనిష్టాన్నీ, జనవరి 30న రూ. 1246 వద్ద గరిష్టాన్నీ చేరింది. -
స్టీల్ స్ట్రిప్స్ వీల్స్- గుజరాత్ గ్యాస్ స్పీడ్
స్టీల్ వీల్స్ కోసం యూఎస్ మార్కెట్ల నుంచి తాజాగా ఎగుమతి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోపక్క పీఎన్జీఆర్బీ నుంచి రెండు కొత్త ప్రాంతాలకు లైసెన్సులను పొందినట్లు పేర్కొనడంతో గుజరాత్ గ్యాస్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ ప్రస్తుతం భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ ట్రక్ అండ్ కారవాన్ ట్రైలర్ మార్కెట్ నుంచి సరికొత్త ఎగుమతి ఆర్డర్ లభించినట్లు స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా 14,000 స్టీల్ వీల్స్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. వచ్చే రెండు నెలల్లో చెన్పై ప్లాంటు నుంచి వీటిని ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా 3.15 లక్షల డాలర్ల(సుమారు రూ. 2.4 కోట్లు) ఆదాయం లభించే వీలున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో ఇకపై మరిన్ని ఆర్డర్లు లభించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.25 శాతం జంప్‌చేసి రూ. 446 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల్లో ఈ షేరు 31 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గుజరాత్ గ్యాస్ తాజాగా పెట్రోలియం, సహజవాయు నియంత్రణబోర్డు(పీఎన్జీఆర్బీ)నుంచి రెండు ప్రాంతాలకు లైసెన్సులు పొందినట్లు గుజరాత్ గ్యాస్ వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్సర్, భటిండా జిల్లాలకు గ్యాస్ సరఫరా హక్కులను పొందినట్లు పేర్కొంది. తద్వారా సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ముందుగా నిధుల సమీకరణ వివరాలతోపాటు.. గ్యాస్ సరఫరా ఒప్పందాలు తదితరాలను పీఎన్‌జీఆర్‌బీకి దాఖలు చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ గ్యాస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3.3 శాతం లాభపడి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 324ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టానికి చేరింది. కాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 35 శాతం లాభపడటం విశేషం! -
పైప్ గ్యాస్ 400 జిల్లాల్లో
న్యూఢిల్లీ: రాబోయే 2–3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను 2020 నాటికి 10,000కు పెంచుతామన్నారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్వర్క్ పనులకు ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 10వ రౌండ్ గ్యాస్ లైసెన్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించారు. 90 % కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం.. ‘కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 12 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. వీటిలో దాదాపు 6 కోట్ల ఉజ్వల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. మా ప్రభుత్వం చొరవతో దేశంలో 90 శాతం కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం లభించింది. కానీ నాలుగేళ్ల క్రితం దేశంలోని 55 శాతం మందికి మాత్రమే ఎల్పీజీ సౌకర్యం ఉండేది. అంటే గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 కోట్ల మందికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో 24 లక్షలుగా ఉన్న పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు గత నాలుగేళ్లలో 2 కోట్లకు చేరుకున్నాయి. 2014లో దేశ ప్రజలు కేవలం ప్రభుత్వాన్నే కాదు.. పనిచేసే విధానం, సంస్కృతిని మార్చేశారు అంటే అతిశయోక్తేమీ లేదు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కాలుష్యానికి అడ్డుకట్ట.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండేదని ప్రధాని వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలోని సీజీడీల సంఖ్యను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో(50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు) ఇళ్లకు వంటగ్యాస్ అందించే పనులకు శ్రీకారం చుట్టాం. 10వ రౌండ్ బిడ్డింగ్ పూర్తయితే దేశంలోని 70 శాతం జనాభాకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దేశీయ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానిస్తాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తులను పరిరక్షిస్తాం. పంట వ్యర్థాలను బయో–సీఎన్జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు. బిడ్డింగ్‌లో నెల్లూరుకు చోటు సీఎన్జీ పర్యావరణ హితమైనదనీ, దీని ఖర్చు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పోల్చుకుంటే తక్కువని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనను నిలిపివేశామని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
సిటీ గ్యాస్‌కు ప్రాధాన్యత!
కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్‌కి అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్‌ల కింద విద్యుత్‌ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది. ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.