పైప్ గ్యాస్ ప్రాజెక్టులకు రిమోట్‌తో శంకుస్థాపన చేస్తున్న మోదీ
న్యూఢిల్లీ: రాబోయే 2–3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్యను 2020 నాటికి 10,000కు పెంచుతామన్నారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్‌వర్క్ పనులకు ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 10వ రౌండ్ గ్యాస్
లైసెన్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించారు.
90 % కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం.. ‘కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 12 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. వీటిలో దాదాపు 6 కోట్ల ఉజ్వల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. మా ప్రభుత్వం చొరవతో దేశంలో 90 శాతం కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం లభించింది. కానీ నాలుగేళ్ల క్రితం దేశంలోని 55 శాతం మందికి మాత్రమే ఎల్పీజీ సౌకర్యం ఉండేది. అంటే గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 కోట్ల మందికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో 24 లక్షలుగా ఉన్న పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు గత నాలుగేళ్లలో 2 కోట్లకు చేరుకున్నాయి. 2014లో దేశ ప్రజలు కేవలం ప్రభుత్వాన్నే కాదు.. పనిచేసే విధానం, సంస్కృతిని మార్చేశారు అంటే అతిశయోక్తేమీ లేదు’ అని ప్రధాని మోదీ తెలిపారు.
కాలుష్యానికి అడ్డుకట్ట..
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉండేదని ప్రధాని వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలోని సీజీడీల సంఖ్యను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో(50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు) ఇళ్లకు వంటగ్యాస్ అందించే పనులకు శ్రీకారం చుట్టాం. 10వ రౌండ్ బిడ్డింగ్ పూర్తయితే దేశంలోని 70 శాతం జనాభాకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దేశీయ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానిస్తాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తులను పరిరక్షిస్తాం. పంట వ్యర్థాలను బయో–సీఎన్‌జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు.
బిడ్డింగ్‌లో నెల్లూరుకు చోటు
సీఎన్‌జీ పర్యావరణ హితమైనదనీ, దీని ఖర్చు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పోల్చుకుంటే తక్కువని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనను నిలిపివేశామని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment