బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో తెలంగాణ నేత? | Political Suspense Over BJP Chief Post | Sakshi
Sakshi News home page

బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో తెలంగాణ నేత?

Published Mon, Mar 3 2025 7:08 AM | Last Updated on Mon, Mar 3 2025 8:52 AM

Political Suspense Over BJP Chief Post

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కొత్త అధ్యక్షుని ఎంపికపై అధిష్టానం చురుగ్గా కసరత్తు చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడపగలిగే నేత కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కొన్ని నెలలుగా మంతనాల్లో మునిగి తేలారు. సంఘ్, పార్టీ మధ్య సమన్వయం చేసుకోగల సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటి కే ఒక జాబితా సిద్ధమైందని చెబుతున్నా రు. అందులోంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 20 లోపు కొత్త అధ్యక్షుని ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

2019లో అమిత్‌ షా కేంద్ర హోం మంత్రి అయ్యాక వెంటనే జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తొలుత బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఆర్నెల్ల తర్వాత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2023 జనవరిలో ముగియాల్సి ఉన్నా 2024 లోక్‌సభ ఎన్నికల దాకా పొడిగించారు. ఆ తర్వాత నడ్డా కేంద్ర కేబినెట్‌ మంత్రి అయినా మహారాష్ట్ర సహా పలు అసెంబ్లీ ఎన్నికల వల్ల కొత్త అధ్యక్షని ఎంపిక వాయిదా పడింది. నూతన అధ్యక్షుని ఎంపికపై రెండు రకాల ప్రతిపాదనలున్నట్టు చెబుతున్నారు.

పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున అక్కడ పార్టీని నడపడంలో సమర్థుడై ఉండటంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ నేప థ్యం కలిగి ఉన్న నేతను నియమించాలనేది ఒక ప్రతిపాదన. దక్షిణాదిలో చొచ్చుకెళ్లేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. వచ్చే మూడేళ్లలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. కనుక దక్షిణాది నేతను అధ్యక్షున్ని చేస్తే పార్టీకి మేలన్నది.

మరో ప్రతిపాదన..
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం అధ్యక్ష రేసులో ఉత్తరాది నుంచి కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితర పేర్లు షికారు చేస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement