స్టీల్ వీల్స్ కోసం యూఎస్ మార్కెట్ల నుంచి తాజాగా ఎగుమతి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోపక్క పీఎన్‌జీఆర్‌బీ నుంచి రెండు కొత్త ప్రాంతాలకు లైసెన్సులను పొందినట్లు పేర్కొనడంతో గుజరాత్ గ్యాస్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ ప్రస్తుతం భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
స్టీల్ స్ట్రిప్స్ వీల్స్
ట్రక్ అండ్ కారవాన్ ట్రైలర్ మార్కెట్ నుంచి సరికొత్త ఎగుమతి ఆర్డర్ లభించినట్లు స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ తాజాగా పేర్కొంది. ఆర్డర్‌లో భాగంగా 14,000 స్టీల్ వీల్స్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. వచ్చే రెండు నెలల్లో చెన్పై ప్లాంటు నుంచి వీటిని ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా 3.15 లక్షల డాలర్ల(సుమారు రూ. 2.4 కోట్లు) ఆదాయం లభించే వీలున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో ఇకపై మరిన్ని ఆర్డర్లు లభించే వీలున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.25 శాతం జంప్‌చేసి రూ. 446 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల్లో ఈ షేరు 31 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
గుజరాత్ గ్యాస్
తాజాగా పెట్రోలియం, సహజవాయు నియంత్రణబోర్డు(పీఎన్‌జీఆర్‌బీ)నుంచి రెండు ప్రాంతాలకు లైసెన్సులు పొందినట్లు గుజరాత్ గ్యాస్ వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, భటిండా జిల్లాలకు గ్యాస్ సరఫరా హక్కులను పొందినట్లు పేర్కొంది. తద్వారా సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇందుకు ముందుగా నిధుల సమీకరణ వివరాలతోపాటు.. గ్యాస్ సరఫరా ఒప్పందాలు తదితరాలను పీఎన్‌జీఆర్‌బీకి దాఖలు చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ గ్యాస్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం లాభపడి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 324ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టానికి చేరింది. కాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 35 శాతం లాభపడటం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment