international bond market
-
150 కోట్ల డాలర్లు సమీకరించనున్న ఐఓసీ
ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్, రిఫైనింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్ డినామినేషన్ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు మూడీస్ సంస్థ బీఏఏ2 రేటింగ్‌ను, ఫిచ్ రేటింగ్స్ సంస్థ ట్రిపుల్ బి మైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. వాటాదారుల రాబడులు, మూలధన పెట్టుబడులు అధికంగా ఉన్నా, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ఐఓసీకి మంచి రేటింగే ఇచ్చామని మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలన్ చెప్పారు. ఇటీవలే ఈ కంపెనీ రూ.12,300 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిందని, నికర రుణాలను మరింతగా పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఐఓసీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో తోడ్పాటు అందుతోందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. -
విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 50 కోట్ల డాలర్ల నిధులు సమీకరించనున్నది. 750 కోట్ల డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ పదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఈ 50 కోట్ల డాలర్ల బాండ్ల విక్రయాన్ని చేపట్టింది. ఈ ఏడాది ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టిన తొలి భారత ఆర్థిక సంస్థగా ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచింది. ఈ బాండ్లను ఐసీఐసీఐ బ్యాంక్ తన దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్సెంటర్ బ్రాంచ్ ద్వారా విక్రయిస్తోంది. ఈ బాండ్ల విక్రయం సోమవారం రాత్రి ముగియనున్నది. ఈ ఇష్యూకి మూడీస్ సంస్థ బీఏఏ3 రేటింగ్‌ను, ఎస్ అండ్ పీ సంస్థ బీబీబీమైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ రెండు రేటింగ్‌లు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌ను సూచిస్తాయి. తన ఆర్థిక లక్ష్యాలను సాధించే సత్తా ఆ సంస్థకు ఉందని ఈ రేటింగ్‌లు పేర్కొంటున్నాయి.