ఇండియన్ ఆయిల్‌కు భారీగా నిల్వ నష్టాలు
క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)కు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,637 కోట్ల నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గడంతో నిల్వ నష్టాలు బాగా పెరిగాయని, దీంతో నికర నష్టం అధికమైందని కంపెనీ చైర్మన్ బి. అశోక్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టాలు రూ. 961 కోట్లుగా ఉన్నాయని వివరించారు. గత క్యూ3లో నిల్వ లాభాలు రూ.2,454 కోట్లుగా ఉండగా, ఈ క్యూ3లో నిల్వ నష్టాలు రూ.12,842 కోట్లుగా ఉన్నాయని వివరించారు.
ముడి చమురును కొనుగోలు చేసినప్పటి ధర కాకుండా ప్రాసెస్ చేసినప్పుడు ఉన్న ధర ఆధారంగా పెట్రో ఇంధనాల ధరలను నిర్ణయిస్తామని, ఈ కాలంలో ముడిచమురు ధరలు మరింతగా పతనమయ్యాయని, ఈ విధంగా నిల్వ నష్టాలు భారీగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. విక్రయాల ద్వారా వచ్చిన నష్టాలకు ప్రభుత్వం రూ.2,866 కోట్లు నగదు సబ్సిడీని, ఓఎన్‌జీసీ వంటి చమురు వెలికితీత కంపెనీలు రూ.6,116 కోట్ల తోడ్పాటునందించాయని వివరించారు. ఇక గత క్యూ3లో రూ.1,17,672 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ3లో రూ.1,07,074 కోట్లకు తగ్గాయని తెలిపారు. వడ్డీ భారం రూ.1,262 కోట్ల నుంచి రూ.929 కోట్లకు తగ్గిందని వివరించారు.