న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్‌ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది.
అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్‌లైన్స్‌పై భారమూ తగ్గుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు.
Comments
Please login to add a commentAdd a comment