చమురు కంపెనీలకు కనికరం లేకుండా పోతుంది. గ్యాప్ లేకుండా పెట్రోలు ధరలను పెంచేస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ.113కి చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో అయితే లీటరు పెట్రోలు ఏకంగా రూ.117.21కి చేరుకుంది.
పెట్రోలు ధరలు వరుసగా మూడూరోజు కూడా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకి 37 పైసల వంతున ధర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113 కి చేరుకోగా డీజిల్ ధర రూ.106.22గా ఉంది.
విమానమే నయం
పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు సైతం ఈ వ్యంగాస్త్రాలకు తగ్గట్టుగానే ఉన్నాయి.
వాటికి పెట్రోల్ చీప్
బైకులు, కార్లు ఇలా సామాన్యులు ఉపయోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇదే వత్యాసం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.
పన్నుల వల్లే
మన పెట్రోలు అవసరాలన్నీ దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన పెట్రోలుకి రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్ కలుపుతారు. తర్వాత వచ్చిన ధరపై కేంద్రం 11 శాతం పన్ను విధిస్తోంది. అనంతరం రాష్ట్రాలు వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం 30 శాతం వ్యాట్‌ని విధిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు 29 శాతం వ్యాట్ విధిస్తోంది. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఏటీఎఫ్ పెట్రోలు ధర ఒక్కో రకంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేంద్రం విధిస్తున్న పన్ను 11 శాతమే ఉండటం. అందువల్ల ఏటీఎఫ్ పెట్రోలు తక్కువ ధరకే లభిస్తోంది.
పెరిగిన పన్నులు
ఇక రెగ్యులర్ పెట్రోలుకి సంబంధించి ముడి చమురు ధర, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్‌లను మినహాయిస్తే లీటరు పెట్రోలు ధరలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 34 శాతంగా ఉంటోంది. ఈ మొత్తం కలపగా వచ్చిన ధరపై రాష్ట్రాలు వేర్వేరుగా వ్యాట్‌ను అమలు చేస్తున్నాయి. గరిష్టంగా రాజస్థాన్, మహారాష్ట్రలు దాదాపు 29 శాతం వ్యాట్‌ను విధిస్తున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోలు దాదాపు రూ. 115 దగ్గరకు చేరుకుంది. రెగ్యులర్ పెట్రోలుకి రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ కనిష్టంగా 17 శాతం నుంచి 29 శాతం ఉండగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను ఏకంగా 34 శాతం ఉంటోంది.
అంతర్జాతీయ ధరలంటూ
పన్నుల విధానం కారణంగా సామాన్యులపై పడుతున్న భారాన్ని ప్రభుత్వాలు నేర్పుగా అంతర్జాతీయ చమురు ధర మీదకు తోసేస్తున్నాయి. ముడి చమురు ధరల వల్లే ఈ సమస్య అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు.
- సాక్షి, వెబ్‌డెస్క్
చదవండి: ఈ దేశంలో పెట్రోలు చాలా చీప్.. లీటరు రూ.1.50 మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment