న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది.
2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్‌లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment