పెట్రో పెంపుపై లెఫ్ట్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంపై వామపక్షాలు భగ్గుమన్నాయి. పెట్రోల్ ధరలు మూడు నెలల్లో ఆరుసార్లు, డీజిల్ ధరలు ఎనిమిది నెలల్లో ఎనిమిదిసార్లు పెంచిన కేంద్రప్రభుత్వం పతనం కాకతప్పదని హెచ్చరించాయి. పెంచిన ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్ర్ట్ర రాజధాని సహా పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో ఇప్పటికే అతలాకుతలమైన సామాన్యుడి జీవితం మరింత దుర్భరం కానుందని ఆవేదనవ్యక్తం చేశాయి. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఆందోళనలు జరగ్గా, సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడలో సైకిల్ తొక్కి నిరసన తెలిపారు.
5 నుంచి ఆందోళన: రాఘవులు
పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా ఈనెల ఐదారు తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఎం పిలుపునిచ్చింది. ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, అడుగంటిన అభివృద్ధితో బడుగుజీవి జీవితం బుగ్గిపాలవుతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోస్తా, రాయలసీమల్లో రేషన్ డీలర్ల సమ్మెతో చౌకబియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరారు.
కాంగ్రెస్ మసే: నారాయణ
పార్లమెంటులో బలం ఉందని యథేచ్ఛగా ప్రజలపై భారం వేస్తూ పోతే కాంగ్రెస్‌ను పెట్రో మంటల్లో తగలబెట్టడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయమని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. కేంద్రప్రభుత్వం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యాట్‌ను తగ్గించాలి: దత్తాత్రేయ
పెట్రో ఉత్పత్తుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. మూడు నెలల కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ.9.17 పెరిగిందని పేర్కొన్నారు. సామాన్యుడి ఆగ్రహానికి గురికాకమునుపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపుపై తమ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుందని తెలిపారు.