లారీల సమ్మె ఉధృతం..!
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు
- సిమెంటు, ఇసుక, స్టీలు సరఫరా పూర్తిగా బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె తీవ్రమవుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి వేల సంఖ్యలో లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సిమెంటు, స్టీలు, ఇసుక వంటివాటి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో కూరగాయల లారీలకు మినహాయింపునిచ్చినా.. పొరుగు రాష్ట్రాల్లో సమ్మె ఉధృతంగా కొనసాగుతుండడంతో అక్కడి నుంచి లారీలు రావడం లేదు. మహారాష్ట్రలో పది వేలకు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి సరఫరా అయ్యే క్యాబేజీ, ఉల్లి, ఆలుగడ్డల రవాణా నిలిచిపోయింది.
ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి సరఫరా కావాల్సిన టమాటా, మిర్చి కూడా తగ్గిపోయింది. దీంతో సమీప ప్రాంతాల నుంచి చిన్నలారీలు, ఆటో ట్రాలీల్లో హైదరాబాద్‌కు సరుకు తరలుతోంది. మరోవైపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి సమ్మెను మరింత తీవ్రం చేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ఆదివారం రాత్రి వరకు కూడా ప్రభుత్వం స్పందించకుంటే.. సోమవారం నుంచి అత్యవసర సరుకులు తరలించే లారీలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దుర్గాప్రసాద్, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి ప్రకటించారు.
రహదారులపై ఆందోళనలు..
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల లారీల డ్రైవర్లు, యజమానులు ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విజయవాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో లారీ యజమానుల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది.
‘సింగిల్ పర్మిట్’పై స్పందించట్లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
బస్సుల్లో సరుకు తరలించండి: సీఎస్
లారీల సమ్మె తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరమైతే ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర సరుకులను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమ్మె పరిస్థితిపై సచివాలయంలో సమీక్షించారు. పాలు, కూరగాయలు, నీళ్లు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, మందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లారీ యజమానుల సంఘంతో చర్చలు జరపాలని ఆదేశించారు. కాగా.. లారీల బీమాకు సంబంధించి థర్డ్‌పార్టీ చెల్లింపుల అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ శనివారం సమావేశమైంది. దీనికి సంబంధించి ఆదివారం నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఇదిలా ఉండగా.. లారీల సమ్మె విరమింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.