Lorries strike
-
రేపు దేశవ్యాప్తంగా లారీల బంద్
సాక్షి, అమరావతి బ్యూరో: లారీ ఇండస్ట్రీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేలా కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సవరించిన భారత మోటారు వాహన చట్టం–2019 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దూరప్రాంతాలకు తిరిగే లారీలపై పెను భారం మోపింది. దీని ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పలు రాష్ట్రాల్లో రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాలు విధిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు ఈ కొత్త చట్టం పెను నష్టాన్ని తెచ్చి పెడుతోందని లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. దక్షిణాదితో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ జరిమానాలు అమలు చేయకపోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారు. కానీ ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు జరిమానాల బాదుడు అధికంగా ఉంటోందని లారీ యజమానులు చెబుతున్నారు. బీమా ప్రీమియం, జీఎస్టీ వంటివి లారీ పరిశ్రమను కుదేలు చేస్తున్నాయని అంటున్నారు. లారీ పరిశ్రమను కాపాడుకోవాలంటే రానున్న ఆరు నెలల పాటు కొత్త లారీలు కొనుగోలు చేయరాదని ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ లారీ యజమానులను కోరుతోంది. రాష్ట్ర అసోసియేషన్ మద్దతు లారీల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోషియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలు వెళ్లకుండా నిలువరిస్తామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల లారీలుండగా వీటిలో నాలుగో వంతు మాత్రమే సరకు రవాణాలో ఉన్నాయి. స్థానికంగా తిరిగే లారీలపై సమ్మె ప్రభావం ఉండదని, అందువల్ల సరుకు రవాణా పాక్షికంగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. చమురు, పాలు వంటి అత్యవసర సరుకుల రవాణా లారీలకు సమ్మె నుంచి మినహాయింపునిచ్చారు. లారీ యజమానుల ప్రధాన డిమాండ్లు - లారీ పరిశ్రమను తేరుకోలేకుండా చేసే ఎంవీ యాక్టు–2019 బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి. - రవాణా వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని పెంచరాదు. దీనిపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి. - కొత్త/పాత వాహనాల కొనుగోలుపై జీఎస్టీని తగ్గించాలి. - రవాణా రంగంలో ఏటా రూ. కోటి నగదు విత్‌డ్రాపై 2 శాతం వసూలు నిలిపివేయాలి. -
లారీల సమ్మె నేపథ్యంలో..ఇబ్బందుల్లో డ్రైవర్లు
సాక్షి, వరంగల్ : లారీల సమ్మె నేపథ్యంలో డ్రైవర్లు, క్లీనర్లు నానాఇబ్బందులు పడుతున్నారు. లారీల బంద్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదని వివిధ రాష్ట్రాల నుంచి డ్రైవర్లుగా వచ్చిన వారు క్లీనర్లను ఇక్కడే ఉంచి ఇంటిముఖం పడుతున్నారు. మరికొంత మంది లారీల వద్దే ఉంటూ వంట చేసుకుని తినడంతోపాటు అక్కడే పడుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ పట్టణంలోని ఎల్బీనగర్, పుప్పాలగుట్ట, చింతల్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట. హన్మకొండలోని తదితర ప్రాంతాలతోపాటు భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలోలారీలు ఆధికంగా ఉన్నాయి.లారీల బంద్‌తో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తిండికి అప్పులు చేస్తున్నాం... నేను డ్రైవర్‌గా పనిచేస్తాను. ఆరు రోజులుగా లారీలు నిలిచిపోవడంతో కు టుంబ పోషణ భారంగా మారింది. తిండికి అప్పులు చేస్తున్నాం. వారం రోజులుగా ఇంటికి వెళ్లలేదు. పగలంతా రహదారులపై గడుపుతున్నాం. రాత్రి పూట ప్రయాణం చేస్తున్నాం. సరుకులతో ప్రయాణం చేయాలంటే భయమేస్తోంది. సమ్మె ఇలాగే కొనసాగితే మేమెట్లా బతకాలి. మహేందర్, డ్రైవర్, గుజరాత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం గుజరాత్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు లోడుతో వెళ్తున్నా. ఇంటి నుంచి బయలు దేరి ఎనిమిది రోజు లైంది. రాత్రి పూట ప్రయాణం భారంగా మారింది. రోడ్డుపైనే వంట చేసుకుంటున్నాం. ఉదయం అంతా రెస్ట్ తీసుకుని రాత్రిపూట బయలుదేరుతున్నాం. సమ్మె విరమణ ఎప్పుడు.. మేము తమిళనాడుకు చేరుకునేది ఎప్పుడో తెలియడం లేదు. చేతిలో చిల్లగవ్వలేదు. వంట సరుకుల తెచ్చుకుందామన్నా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి. జావీద్, డ్రైవర్, మహారాష్ట్ర -
నేడు, రేపు ఎక్కడి లారీలక్కడే
-
నేడు, రేపు ఎక్కడి లారీలక్కడే
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ, రోజువారీ చమురు ధరల సవరణ విధానంపై సరుకు రవాణా సంఘాలు భగ్గుమంటున్నాయి. దీన్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్న సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తెలంగాణ లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. సోమ, మంగళవారాల్లో ఒక్క లారీ కూడా రోడ్డెక్కకుండా చూస్తామని ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో సరుకుల తరలింపు ఉండదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్, ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ల నిర్ణయం మేరకు తాము బంద్‌కు పిలుపిచ్చామని వారు తెలిపారు. -
అమ్మకానికి వస్తే... మళ్లీ వెనక్కే
మార్కెట్ గేట్లకు తాళాలు, కాపలాగా గార్డులు కోల్డ్ స్టోరీజీల వద్ద మిర్చి వాహనాలు వరంగల్‌సిటీ : లారీల సమ్మెతో నిరవధిక బంద్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకోవడానికి రైతులు పంట సరుకులతో వస్తే మళ్లీ వచ్చిన దారిన పోవాల్సిందే. సోమవా రం బంద్ విషయం తెలిసినా కొందరు రైతులు అనుకోకుండా మార్కెట్‌కు రా గా చైర్మన్, కార్యదర్శి ఏదో విధంగా అడ్తి, వ్యాపారులకు నచ్చచెప్పి అమ్మకా నికి వచ్చిన సరుకులను కొనుగోళ్లు ని ర్వహించిన విషయం తెలిసిందే. అయితే చైర్మన్, కార్యదర్శి వెంటనే అడ్తి, వ్యా పారులను సమావేశపరిచి, పంట సరుకులతో రైతులు మార్కెట్‌కు వస్తే బాధ్యత మీదేనని వివరించి మైక్‌లో బంద్ గురించి అనౌన్స్ చేయించడంతో పాటు రెండు వైపులా గేట్లను మూసేసి, సె క్యూరిటీ గార్డులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మంగళవారం గేట్లు పూర్తిగా మూసేసి, ఎలాంటి వాహనాలు మార్కెట్లోనికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం అమ్మకానికి వచ్చిన దేశి(దొడ్డురకం) రకం మిర్చిని కొనుగోలు చేయడానికి ఖరీదుదారులు రాకపోవడంతో సుమారు వెయ్యి బస్తా ల వరకు పల్లియార్డులోనే మిగిలిపోయి ఉన్నాయి. కనీసం కోల్డ్‌స్టోరేజిల్లో నిల్వ కోసం వెళ్తామన్నా అడ్తి వ్యాపారులు సహకరించడం లేదని వారు రైతులు వాపోయారు. బారులు తీరిన వాహనాలు చాలా మంది రైతులు వాహనాల్లో మిర్చిని మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చి బంద్ విషయం తెలుసుకొని కోల్డ్‌స్టోరేజిల వద్దకు తీసుకెళ్లడంతో అక్కడ వాహనాలు బారులు తీరిపోయాయి. కొత్తపేట క్రాస్‌రోడ్డు నుంచి నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజిల వరకు వాహనాలు లైన్‌గా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సరైన ధరలేక అటు మార్కెట్ లేక, అమ్ముకోలేక, ఇటు దాచుకోలేక, చేతికొచ్చిన పంటను ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజులు మిర్చి సీజన్ ముందే ఉండడంతో వరంగల్ మార్కెట్ ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అంతపట్టని పరిస్థితి నెలకొంది. -
పప్పులు.. బియ్యం బంద్!
♦ లారీల సమ్మెతో హైదరాబాద్‌కు నిలిచిపోయిన నిత్యావసరాల సరఫరా ♦ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న అసోసియేషన్ల నాయకులు ♦ డీసీఎం అద్దం పగలగొట్టడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మె తీవ్రమైంది. లారీ యజమానుల ఆందోళన ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఎక్కడి చక్రం అక్కడే ఆగింది. హైదరాబాద్‌కు బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంట్, స్టీలు వంటి ముడిసరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆటోనగర్ వద్ద తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్‌ను పర్యవేక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఆదివారం కంకరతో వస్తున్న టిప్పర్లను, ఇతర సరుకుతో వస్తున్న లారీలను అడ్డుకుని టైర్ల నుంచి గాలి తీసివేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. నగరానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేల లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అత్యవసరాల రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. నేడు బీమా సంస్థతో చర్చలు! లారీ యాజమాన్య సంఘాలతో సోమవారం బీమా నియంత్రణ సంస్థ చర్చలు జరిపే అవకా శాలున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ భవిష్యత్ ఆందోళన ఉంటుందన్నారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించని పక్షంలో అత్యవసర వస్తువులను రవాణా చేసే లారీలను సైతం నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ‘మలక్‌పేట్’కు రాని మిర్చి, ఉల్లి మలక్‌పేట్‌లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 10 వేల బస్తాల మేర మిర్చి, ఉల్లిగడ్డ సరఫరా జరిగేది. కానీ ప్రస్తుతం సమ్మె కారణంగా రోజుకు 400 బస్తాలకు మించి రావడం లేదని వ్యాపారులు వాపోయారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి సరుకు రవాణా నిలిచిపోయిందని పేర్కొన్నారు. వారం క్రితం పెద్ద మొత్తంలో సరుకు నిల్వచేయడంతో ప్రస్తుత అవసరాలకు సరిపోతోందని, మరిన్ని రోజులు ఆందోళన కొనసాగితే సరుకులు నిండుకుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్‌కు అరకొర సరఫరా నగరంలోని ప్రధాన మార్కెట్‌గా ఉన్న బేగం బజార్, మహారాజ్‌గంజ్, ముక్తార్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్లకు కొబ్బరి, పప్పులు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, డ్రైఫ్రూట్స్ రవాణా స్తంభించిం ది. గతంలో ఈ ప్రాంతాలకు నిత్యం 200–300 టన్నుల సరుకు రవాణా అయ్యేది. ప్రస్తుతం 40 టన్నులే సరఫరా అందుతోందని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు, కేరళ నుంచి నిత్యం 20 లారీల కొబ్బరి వచ్చేదని, ప్రస్తుతం ఒక్క లారీ కూడా రావడం లేద న్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నగరానికి వచ్చే ఉల్లి, ఆలు, టమాటా రవాణా తగ్గిందని చెప్పారు. పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, డీజిలు, పెట్రోలు వంటి అత్యవస రాలను సమ్మె నుంచి మినహాయించడంతో వాటి సరఫరా యథాతథంగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. -
లారీల సమ్మె ఉధృతం..!
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు - సిమెంటు, ఇసుక, స్టీలు సరఫరా పూర్తిగా బంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె తీవ్రమవుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి వేల సంఖ్యలో లారీలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సిమెంటు, స్టీలు, ఇసుక వంటివాటి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో కూరగాయల లారీలకు మినహాయింపునిచ్చినా.. పొరుగు రాష్ట్రాల్లో సమ్మె ఉధృతంగా కొనసాగుతుండడంతో అక్కడి నుంచి లారీలు రావడం లేదు. మహారాష్ట్రలో పది వేలకు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి సరఫరా అయ్యే క్యాబేజీ, ఉల్లి, ఆలుగడ్డల రవాణా నిలిచిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి సరఫరా కావాల్సిన టమాటా, మిర్చి కూడా తగ్గిపోయింది. దీంతో సమీప ప్రాంతాల నుంచి చిన్నలారీలు, ఆటో ట్రాలీల్లో హైదరాబాద్‌కు సరుకు తరలుతోంది. మరోవైపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి సమ్మెను మరింత తీవ్రం చేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. ఆదివారం రాత్రి వరకు కూడా ప్రభుత్వం స్పందించకుంటే.. సోమవారం నుంచి అత్యవసర సరుకులు తరలించే లారీలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దుర్గాప్రసాద్, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి ప్రకటించారు. రహదారులపై ఆందోళనలు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల లారీల డ్రైవర్లు, యజమానులు ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విజయవాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో లారీ యజమానుల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. ‘సింగిల్ పర్మిట్’పై స్పందించట్లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బస్సుల్లో సరుకు తరలించండి: సీఎస్ లారీల సమ్మె తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవసరమైతే ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర సరుకులను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమ్మె పరిస్థితిపై సచివాలయంలో సమీక్షించారు. పాలు, కూరగాయలు, నీళ్లు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, మందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లారీ యజమానుల సంఘంతో చర్చలు జరపాలని ఆదేశించారు. కాగా.. లారీల బీమాకు సంబంధించి థర్డ్‌పార్టీ చెల్లింపుల అంశంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ శనివారం సమావేశమైంది. దీనికి సంబంధించి ఆదివారం నిర్ణయాలు వెలువడే అవకాశముంది. ఇదిలా ఉండగా.. లారీల సమ్మె విరమింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. -
ఎక్కడివక్కడే
– మూడు రోజులుగా కదలని లారీలు – సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం అనంతపురం సెంట్రల్ : జిల్లాలో సరుకు రవాణా స్తంభించిపోయింది. లారీ యజమానులు చేపట్టిన సమ్మె కారణంగా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల లారీలు ముందుకు కదలలేదు. వాహన ఇన్సూరెన్స్, చలానాలు, జరిమానాల రూపంలో భారీగా ఫీజులు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు వారు చేపట్టిన సమ్మె శనివారంతో మూడో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా మినహాయింపులు ఇచ్చిన లారీ యజమానులు శనివారం ఆందోళనను తీవ్రతరం చేశారు. జిల్లా మీదుగా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు సరుకును రవాణా చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలను కూడా తిరగనీయలేదు. దీంతో అవి రహదారుల పక్కన ఆగిపోయాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరు సమీపంలోని చెరువుకట్ట, తపోవనం ప్రాంతాల్లో జాతీయ రహదారి వద్ద పెద్దసంఖ్యలో లారీలను నిలుపుదల చేశారు. రైతులపై సమ్మె దెబ్బ లారీ యజమానుల సమ్మె రైతులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, పండ్లతోటల సాగు గణనీయంగా పెరిగింది. టమాట, పచ్చిమిర్చి, బెండ ఇతర కూరగాయలతో పాటు చీనీ, అరటి, కర్బూజా, మామిడి తదితర పంటలు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. చీనీ, అరటి పంటలను నాగపూర్, ఢిల్లీకి కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో లారీ యజమానులు సమ్మె చేపట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. సమ్మె అలాగే కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. వారితో పాటు వ్యాపారులు, సామాన్య ప్రజలపైనా సమ్మె ప్రభావం పడనుంది. -
సింగరేణికి సమ్మె దెబ్బ
రోజుకు 6 వేల టన్నుల రవాణాకు బ్రేక్ శ్రీరాంపూర్: తమ డిమాండ్ల సాధన కోసం దక్షిణాది రాష్ట్రాల్లోని లారీ యజమానులు ఏప్రిల్ 1నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో సింగరేణి బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. ఒక రోజు ముందే మార్చి 31 నుంచే లారీలను నిలిపివేశారు. సింగరేణిలో మార్చి 31 నాటికి వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం అన్ని ఏరియాల్లో ఇబ్బడిముబ్బడిగా బొగ్గు ఉత్పత్తి చేశారు. లారీల సమ్మెతో ఒక్క బొగ్గు పెళ్ల కూడా కదలని పరిస్థితి ఏర్పడడంతో రీజియన్ పరిధిలో గనులపై, సీహెచ్‌పీలు, కోల్ యార్డుల వద్ద రోజుకు ఆరువేల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఉత్పత్తి అయిన బొగ్గులో 65 శాతం వ్యాగన్ల ద్వారా ఎన్టీపీసీ, భారీ సిమెంట్ కంపెనీలు, ఇతర బొగ్గు ఆధారిత సంస్థలకు సరఫరా అవుతుంటుంది. మిగిలిన 35 శాతం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమళనాడు వంటి ప్రాంతాల్లోని సిమెంట్, చిన్న విద్యుత్ సంస్థలు, ఐరన్ పరిశ్రమలకు రోడ్డు మార్గాన లారీల ద్వారా వెళ్తుంది. సమ్మెతో లారీలపై ఆధారపడిన సుమారు 1200 మంది లారీ యజమానులు, సుమారు మూడు వేల మంది డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు, సిబ్బంది అందరూ సమ్మె వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా భూగర్భంలోంచి బొగ్గు బయటకు వచ్చిన తరువాత గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి సహజసిద్ధంగా రసాయన చర్యనొంది దానంతటదే మండుతోంది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా ఈ విధంగా జరుగుతుంది. రవాణా సమ్మె ఇలాగే కొనసాగితే బొగ్గు నిల్వలు మంటలకు ఆహుతయ్యే ప్రమాదం ఉంది. బొగ్గు కాలిపోతే గ్రేడ్ పడిపోయి సంస్థకు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది. -
రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో లారీల సమ్మె
-
రేపటి నుంచి లారీల నిరవధిక సమ్మె
రోజూ ఐదు వేల లారీలకు బ్రేక్! సాక్షి, హైదరాబాద్: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, తెలుగు రాష్ట్రాలకు వర్తించే సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లారీ యాజమాన్య సంఘాలు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చలు సైతం అసంపూర్తిగా ముగియడంతో సమ్మె దిశగా లారీ సంఘాలు కార్యాచరణకు సన్నద్ధమవుతు న్నాయి. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు లారీ లను రోడ్డెక్కించబోమని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘంతో కలసి ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు రోజు రాకపోకలు సాగించే సుమారు 5వేల లారీలు స్తంభించనున్నాయి. అంతర్రాష్ట్ర లారీ యజమానులు చేపట్టనున్న ఈ సమ్మెకు స్థానిక లారీల యజమానులు కూడా మద్దతునిచ్చే అవకాశం ఉంది. లారీ సంఘాల ప్రధాన డిమాండ్లివి.. ► ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్ పార్టీ బీమాను ఏప్రిల్ ఒకటి నుంచి 50 శాతం పెంచే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. ► దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలి. ► 15 ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలి. ► తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్‌కు అవకాశం కల్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలి. ► లారీల్లో ఓవర్‌లోడ్‌కు లారీ యజమానులను కాకుండా వినియోగదారులు బాధ్యత వహించేలా చట్టాల్లో మార్పులు చేయాలి. -
లారీలు రోడ్డెక్కాయ్
-
లారీలు రోడ్డెక్కాయ్
లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సర్కారు చర్చలు సఫలం సాక్షి, హైదరాబాద్: ఒకరోజు సమ్మె అనంతరం లారీలు రోడ్డెక్కాయి. లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో లారీల సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె వల్ల ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్‌కు వివరించారు. లారీ యజమానుల సంఘంతో చర్చించి సమ్మె విరమించేలా చూడాలని ఆయన ఆదేశించటంతో గురువారం ఉదయం మంత్రులు మహేందర్‌రెడ్డి, హరీశ్‌రావు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో చర్చించారు. 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా వారు.. త్రైమాసిక పన్నును జనాభా నిష్పత్తిలో తగ్గించాలని, ఏపీ తెలంగాణ మధ్య లారీలు తిరిగేలా వార్షిక కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్లపై పట్టుబట్టారు. వీటిపై సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సినందున మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. వాటికి అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని పట్టుబట్టడంతో పర్మిట్లకు సమ్మతిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. త్రైమాసిక పన్ను తగ్గింపు సహా మిగతా డిమాండ్లపై స్పష్టత ఇచ్చేందుకు గడువు కావాలని, దీనిపై రవాణా రంగంతో ముడిపడిన విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రతిపాదించారు. కమిటీ 3 వారాల్లో నివేదిక సమర్పిస్తుందని, దాని సిఫార్సుల ఆధారంగా డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సమ్మతించిన లారీ యజమానుల సంఘం.. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్ విధానాల అధ్యయనం.. గుజరాత్లో రవాణా రంగ విధానాలు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసేందుకు అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అక్కడి విధానాలను పరిశీలించి ఉన్నతమైనవాటిని ఇక్కడ అమలు చేస్తామన్నారు. రవాణా, వాణిజ్య పన్నులు, పోలీసు శాఖలు వేధిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు విభాగాల ఉన్నతాధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో ఉన్నతస్థాయి భేటీని ఏర్పాటు చేసి చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని హైవేలపై లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని, 38 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో డ్రైవర్ల శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రూ.5 వేలు చెల్లిస్తే రెండు రాష్ట్రాల పర్మిట్.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్యా కొత్తగా త్రైమాసిక పన్ను విధింపు అమలులోకి వచ్చింది. తాజా చర్చల్లో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అంగీకరిస్తే.. వార్షికంగా రూ.5 వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఆ పర్మిట్లకు ఏపీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న ఒప్పందం తరహాలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఏపీకి లేఖ రాయనున్నట్టు మంత్రి చెప్పారు. చర్చల్లో లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. -
ఎరువులొచ్చాయి.. దించేందుకు లారీలేవి?
లారీల సమ్మెతో తొలిరోజే తీవ్ర ప్రభావం నిత్యావసరాల ధరలు భగ్గుమనే అవకాశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: లారీల సమ్మెతో.. తొలిరోజే తీవ్ర ప్రభావం కనిపించింది. నేరుగా ప్రజలపై పడకున్నా.. సరుకు రవాణ సంస్థలు, మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రజలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జనాభా ప్రాతిపదికన త్రైమాసిక పన్నును తగ్గించాలని, రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు తీసుకుని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు దిగిన తెలిసిందే. మంగళవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. దీంతో బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 శాతం సరుకు రవాణ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందస్తు బుకింగ్స్ నమోదైనవి మినహా ఎక్కడా సరుకుల లోడింగ్ జరగలేదు. పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యంలాంటి నిత్యావసరాలు సహా సిమెంట్, ఎరువుల లోడింగ్, అన్లోడింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకోవటంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు నిత్యం ఎరువులు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం న ల్లగొండ, మిర్యాలగూడ, ఖమ్మం, వరంగల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, మూసాపేట స్టేషన్లకు భారీ పరిమాణంలో ఎరువుల లోడ్‌లో గూడ్సు వ్యాగన్లు చేరుకున్నాయి. కానీ వాటిలోంచి దించి, లోడ్ చేసేందుకు లారీలు లేకపోవటంతో వ్యాగన్లు అలాగే నిలిచిపోయాయి. ఈ విషయాన్ని అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తెచ్చారు. వారు మాట్లాడినా లారీల యజమానులు రాకపోవటంతో కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో వ్యవసాయ పనుల నేపథ్యంలో ఎరువులను అత్యవసర వస్తువులుగా భావించి సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ అధికారులు లారీ యజమానుల సంఘాన్ని కోరారు. దీంతో కొన్ని చోట్ల ఎరువుల తరలింపునకు వారు సమ్మతించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లలో మాత్రం ఏడు వేల టన్నుల ఎరువులు స్టేషన్లలోనే ఉన్నాయి. మూసాపేటకు గోధుమలు, ఉప్పు లోడ్లతో కూడి వ్యాగన్లు కూడా వచ్చి నిలిచిపోయాయి. గురువారం నుంచి కూరగాయల దిగుమతి కూడా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. నిత్యం హైదరాబాద్‌కు 19వేల మిలియన్ టన్నుల కూరగాయలు వస్తాయి. గురువారం నుంచి దీనిపై ప్రభావం ఉంటుందని మార్కెటింగ్‌శాఖ ఆందోళన చెందుతోంది. ఇదే జరిగితే ఒక్కసారిగా కూరగాయల ధరలు కొండెక్కటం ఖాయం. లారీ యజమానులతో నేడు చర్చలు సమ్మె తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో మంత్రులు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. త్రైమాసిక పన్నును తగ్గించాలనేది లారీ యజమానుల ప్రధాన డిమాండ్ కావటంతో దానిపై ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనతో చర్చించని కారణంగా రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. కనీసం చర్చలకు కూడా ఆయన అందుబాటులో లేరు. ప్రస్తుతం సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఉండటంతో మంత్రి ఆయనతో భేటీ కాలేకపోయారు. గురువారం సీఎం నుంచి అందే ఆదేశం మేరకు లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. పన్ను తగ్గింపు లాంటి అర్థిక పరమైన అంశాలు మినహా మిగతా డిమాండ్లపై తాము సానుకూలంగా ఉన్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని, చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘం అధ్యక్షులు భాస్కరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.