
ఎక్కడివక్కడే
– మూడు రోజులుగా కదలని లారీలు
– సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో సరుకు రవాణా స్తంభించిపోయింది. లారీ యజమానులు చేపట్టిన సమ్మె కారణంగా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల లారీలు ముందుకు కదలలేదు. వాహన ఇన్సూరెన్స్, చలానాలు, జరిమానాల రూపంలో భారీగా ఫీజులు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను లారీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు వారు చేపట్టిన సమ్మె శనివారంతో మూడో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా మినహాయింపులు ఇచ్చిన లారీ యజమానులు శనివారం ఆందోళనను తీవ్రతరం చేశారు. జిల్లా మీదుగా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు సరుకును రవాణా చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలను కూడా తిరగనీయలేదు. దీంతో అవి రహదారుల పక్కన ఆగిపోయాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరు సమీపంలోని చెరువుకట్ట, తపోవనం ప్రాంతాల్లో జాతీయ రహదారి వద్ద పెద్దసంఖ్యలో లారీలను నిలుపుదల చేశారు.
రైతులపై సమ్మె దెబ్బ
లారీ యజమానుల సమ్మె రైతులపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, పండ్లతోటల సాగు గణనీయంగా పెరిగింది. టమాట, పచ్చిమిర్చి, బెండ ఇతర కూరగాయలతో పాటు చీనీ, అరటి, కర్బూజా, మామిడి తదితర పంటలు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. చీనీ, అరటి పంటలను నాగపూర్, ఢిల్లీకి కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో లారీ యజమానులు సమ్మె చేపట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. సమ్మె అలాగే కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. వారితో పాటు వ్యాపారులు, సామాన్య ప్రజలపైనా సమ్మె ప్రభావం పడనుంది.